మా బాబు వయసు ఆరు సంవత్సరాలు. ఒక కన్ను నుంచి కొంచెం నీరు కారి ఎర్రగా మారితే పీడియాట్రిక్ ఫిజీషియన్కు చూపించాం. రెండు రోజుల్లోనే కళ్లు ఉబ్బడం, పూర్తిగా తెరుచుకోని పరిస్థితి ఏర్పడింది. మళ్లీ వెళ్తే యాంటిబయాటిక్స్ రాసిచ్చారు. ఇప్పటికి ఐదారు రోజులు అవుతున్నది. మళ్లీ వెళ్తే సీటీ స్కాన్ చేయాలని అంటున్నారు. ఈ పరిస్థితులు బిడ్డ చూపును ఏమైనా దెబ్బతీస్తాయా? కంటి ఇన్ఫెక్షన్ ఏదైనా ప్రమాదానికి సంకేతమా? ఆందోళనగా ఉంది సలహా ఇవ్వండి.
మాములుగా కంటి లోపల తెల్లగుడ్డు భాగం ఎర్రగా మారడం, చీము రావడం, కన్ను అంటుకట్టుకుపోవడం, కళ్ల చుట్టూ ఎక్కువ వాపు లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే దాన్ని ‘కన్‌జన్‌క్టివైటిస్’ అంటాం. కన్ను చుట్టూరా ఉన్న భాగం బాగా మూసుకుపోయి, ఉబ్బుగా ఉంటే సెల్యులైటిస్ అంటాం. మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబుకు ‘సెల్యులైటిస్ కండిషన్’ అనిపిస్తున్నది. మీ బిడ్డ ‘ఆర్బిటాల్ సెల్యులైటిస్’తో బాధ పడుతున్నట్టు తెలుస్తున్నది. కన్ను చుట్టూ ఉన్న కణజాలంలో ఇన్ఫెక్షన్ రావడం, చీము పట్టుకొని ఉండటం ఈ సమస్య ప్రధాన లక్షణం. కనుగుడ్డు కనిపించి, కన్ను సరిగ్గానే కదులుతుంటే.. ‘ప్రీ సెప్టల్ సెల్యులైటిస్’ అంటాం. దీన్ని కంటి ముందుభాగంలో ఉన్న కణజాలపు ఇన్ఫెక్షన్గా గుర్తిస్తాం. అదే కంటి వెనుక భాగంలో అయితే ‘పోస్ట్ సెప్టల్ సెల్యులైటిస్’గా చెప్తాం. ఇన్ఫెక్షన్ కంటి వెనకాల ఉంటే అది బ్రెయిన్‌కు పాకే ప్రమాదం ఉంటుంది. అలా ఉందా? లేదా? అనే విషయం నిర్ధారణ చేసుకోవడానికే డాక్టర్ సీటీ స్కాన్ చేయాలని చెప్తున్నట్టున్నారు. కంటి వెనుక ఉన్న చీమును వీలైనంత త్వరగా తీయాల్సిన అవసరం ఉంటుంది. ఆలస్యం చేయకుండా మళ్లీ డాక్టర్‌ను సంప్రదించండి.