Iron rich drinks | శరీరానికి అన్నిరకాల పోషకాలు అందితేనే ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్లతోపాటు ఐరన్ కూడా కావాల్సిందే. హీమోగ్లోబిన్ తయారీలో ముఖ్యమైనది. శరీరం సరైన రీతిలో పెరుగుదకు ఎంతగానో సహకరిస్తుంది. ఐరన్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. అది లభించే ఆహారాలను తీసుకోవడంలో మనం వెనకడుగు వేస్తున్నాం. ఐరన్ లోపం రక్తహీనతకు దారితీస్తుంది. రక్తహీనత ఉన్న వ్యక్తుల్లో శక్తి స్థాయిలు తగ్గిపోవడం, అలసట, చర్మం పాలిపోవడం, ఏకాగ్రత కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఐరన్ లోపించిన వారిలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. గర్భిణిలు డిప్రెషన్‌కు లోనవుతుంటారు. ఐరన్ లోపం వల్ల పుట్టబోయే బిడ్డ బరువు తక్కువగా పుట్టే అవకాశాలు ఉంటాయి. శరీరంలో అవయవాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. ఐరన్ లోపం వల్ల మెదడులో రక్తనాళాలు ఉబ్బి తలనొప్పి వస్తుంది. పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. థైరాయిడ్ గ్రంధి పనితీరు మందగిస్తుంది. ఐరన్ లోపాన్ని నివారించి ఆరోగ్యాన్ని పొందేందుకు కొన్నిరకాల జ్యూసులు ఎంతగానో ఉపకరిస్తాయి. వీటిని ఇంటి వద్దే తయారు చేసుకుని నిత్యం తాగవచ్చు.

బచ్చలికూర ఐరన్ లభించే అద్భుతమైన ఆకుకూర. దీని రసం తీసి గానీ లేదా స్మూతీని తయారు చేసుకుని గానీ తాగవచ్చు. కొబ్బరి, జీడిపప్పు, రాస్బెర్రీలతో కలిపి తయారు చేసుకోవడం ద్వారా రుచికరమైన స్మూతీని సిద్ధం చేసుకోవచ్చు. స్మూతీని తయారుచేసేటప్పుడు పైనాపిల్‌ను కూడా కలుపుకోవడం ద్వారా మరిన్ని ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ స్మూతీని తీసుకోవడం ద్వారా శరీరానికి ఎక్కువ మొత్తంలో విటమిన్ సీ అందుతుంది.

పీ ప్రోటీన్ షేక్ శరీరంలో ఐరన్ స్థాయిలను పెంచడంలో సాయపడుతుంది. ఈ జ్యూస్‌ను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఇతర ప్రోటీన్ పౌడర్లతో పోలిస్తే బఠానీ ప్రోటీన్‌లో ఎక్కువ మొత్తంలో ఐరన్ ఉంటుంది. బఠానీ ప్రోటీన్ పౌడర్‌తో పానీయాన్ని .. షేక్ లేదా స్మూతీగా చేసుకోవచ్చు. తీపిగా ఉండేందుకు చక్కెర కలుపకుండా చూసుకోవాలి.

బీట్రూట్ జ్యూస్ మరొక సాధారణ ఐరన్-రిచ్ డ్రింక్. బీట్రూట్లో ఐరన్ అధికంగా ఉండటమే కాకుండా, పొటాషియం, మాంగనీస్, ఫోలేట్, బీటైన్, విటమిన్ సీ వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. దీనిలో ఉండే ఖనిజాలు రక్త కణాలను సరిచేయడానికి, ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరచడంలో సాయపడతాయి. క్యారెట్, నారింజ లేదా ఉసిరిని కలుపుకోవడం ద్వారా బీట్రూట్ రసాన్ని మరింత రుచికరంగా చేసుకోవచ్చు.

ప్రూనే నాన్-హీమ్ ఐరన్‌తో కూడిన ఎండిన రేగు పండ్ల జ్యూస్. ప్రూనే జ్యూస్ మన రోజువారీ ఐరన్ అవసరాలను తీరుస్తుంది. అయినప్పటికీ నాన్ హీమ్ ఐరన్ శరీరం వెంటనే గ్రహించదు. దీనిపైనే ఎక్కువ దృష్టిపెట్టకూడదు. శరీరంలో ఆరోగ్యకరమైన ఐరన్ స్థాయిలను నిర్వహించడానికి హీమ్, నాన్-హీమ్ ఐరన్ మిశ్రమాన్ని కలిగి ఉండటం చాలా మంచిది అని గుర్తుంచుకోవాలి.

మల్బరీలో ఐరన్‌తో పాటు విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. అరటిపండ్లు, ఓట్స్, చియా గింజలు, పెరుగును కలుపడం ద్వారా రసం లేదా స్మూతీని మరింత రుచికరంగా తయారు చేసుకోవచ్చు.

గుమ్మడికాయ గింజలు ఐరన్ గొప్ప మూలం. యాంటీఆక్సిడెంట్లు, అవసరమైన ఖనిజాలను కూడా అందిస్తాయి. గుమ్మడికాయ గింజలతో జ్యూస్ లేదా స్మూతీని తయారు చేసుకోవచ్చు. ఆహారంలో కూడా తీసుకోవచ్చు.
పాలకూరలో ఐరన్ అధికంగా ఉంటుంది. బ్రోకలి, పిస్తా, బాదం పప్పు, ఎండు ఖర్జూరాలు, మటన్ లివర్, పల్లీల్లో ఐరన్ ఎక్కువగా దొరుకుతుంది. టమాట, ఉల్లి, క్యారట్, ముల్లంగి తీసుకోవడం ద్వారా ఎక్కువ ఐరన్ పొందవచ్చు. ఐరన్ లోపంతో ఉన్నవారు కాఫీ, టీ, పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
డైట్లో ఏవైనా మార్పులు చేసే ముందు వైద్యుడిని లేదా డైటీషియన్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం. రక్తహీనత సమస్యతో బాధపడుతున్నవారు ఏ ఆహారం, పానీయాలు తీసుకోవాలో వైద్యుల నుంచి సలహా తీసుకోవాలి.