గుండె జబ్బులు, రక్తనాళ సమస్యలు, కిడ్నీల వైఫల్యం, నరాల బలహీనత.. ఇవన్నీ మధుమేహ దుష్ఫ్రభావాలే. సంతానలేమికి కూడా మధుమేహం కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. రక్తంలోని మితిమీరిన చక్కెర మోతాదు అన్ని శరీర భాగాలనూ ప్రభావితం చేస్తుంది. మధుమేహంతో బాధపడే మహిళల్లో పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్), పీరియడ్స్ ఆగిపోవడం, లేదంటే క్రమం తప్పడం, గర్భవిచ్ఛిత్తి తదితర సమస్యలు కనిపించవచ్చు. చిన్నవయసులోనే మెనోపాజ్కూ దారితీయవచ్చు.
అప్పటికే గర్భం ధరించి ఉంటే.. అండం తయారీలోనూ ఇబ్బందులు ఎదురుకావచ్చు. కొన్నిసార్లు తయారైన అండంలో లోపాలు ఉండవచ్చు. థైరాయిడ్ స్థాయి కూడా అసాధారణంగా మారిపోవచ్చు. పురుషుల విషయానికి వస్తే.. డయాబెటిస్ బాధితుల్లో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. పురుషాంగంలో రక్త ప్రసరణ సమస్యలు ఉత్పన్నం అవుతాయి. దీంతో అంగస్తంభన బలంగా జరగదు. కాబట్టి, దంపతులు ఎప్పటికప్పుడు మధుమేహ పరీక్షలు చేయించుకోవాలి. రక్తంలో షుగర్ స్థాయులు సరిగా ఉండేలా జాగ్రత్తపడాలి. ప్రీడయాబెటిస్ లక్షణాలు కనిపించగానే అప్రమత్తం కావాలి.