Cabbage | క్యాబేజీని దాని నుంచి వచ్చే వాసన కారణంగా చాలా మంది తినేందుకు అంతగా ఇష్టపడరు. కానీ క్యాబేజీతో మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. క్యాబేజీని తినడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. పలు వ్యాధులను నయం చేసే శక్తి దీనికి ఉంటుంది. క్యాబేజీని నేరుగా పచ్చిగానే తినవచ్చు. లేదా జ్యూస్ చేసి తాగవచ్చు. సూప్ వంటివి తయారు చేసి కూడా తీసుకోవచ్చు. ఎలా తిన్నా కూడా క్యాబేజీతో మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఒక కప్పు ఉడకబెట్టిన క్యాబేజీని తింటే 22 క్యాలరీల శక్తి మాత్రమే లభిస్తుంది. పిండి పదార్థాలు 5 గ్రాములు, ఫైబర్ 2 గ్రాములు, ప్రోటీన్లు 1 గ్రాము లభిస్తాయి. అలాగే క్యాబేజీని తింటే విటమిన్లు కె, సి, బి6, బి9, ఎ, బి2, బి1, బి5లతోపాటు పొటాషియం, మాంగనీస్, క్యాల్షియం, మెగ్నిషియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు అనేకం లభిస్తాయి. కనుక దీన్ని రోజూ తినాలని వైద్యులు సైతం సూచిస్తున్నారు.
క్యాబేజీని తినడం వల్ల అనేక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి లభిస్తాయి. ముఖ్యంగా ఎరుపు రంగు క్యాబేజీలో ఆంథో సయనిన్స్ అధికంగా ఉంటాయి. అనేక యాంటీ ఇన్ ఫ్లామేటరీ సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇవి తీవ్రమైన వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి. క్యాబేజీని ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులను తగ్గిస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. శరీరంలోని వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. జీర్ణ వ్యవస్థకు సైత క్యాబేజీ ఎంతగానో మేలు చేస్తుంది. దీన్ని తింటే రెండు రకాల ఫైబర్స్ మనకు లభిస్తాయి. క్యాబేజీని తినడం వల్ల సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ రెండింటిని మనం పొందవచ్చు. ఇవి మలబద్దకాన్ని తగ్గిస్తాయి. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తాయి. దీంతో రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
క్యాబేజీలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందువల్ల దీన్ని తింటే యాంటీ ఆక్సిడెంట్ గా విటమిన్ సి పనిచేస్తుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలంగా మారుస్తుంది. దీంతోపాటు కొల్లాజెన్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ముఖ్యంగా సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. క్యాబేజీలో ఆంథో సయనిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా ఎరుపు రంగు క్యాబేజీని తినాలి. ఇందులో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. బీపీ తగ్గేలా చేస్తుంది. హైబీపీ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. క్యాబేజీని తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ సైతం తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
క్యాబేజీలో అనేక సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. అందుకనే క్యాబేజీ ఆ వాసన వస్తుంది. అయితే ఈ సమ్మేళనాలు మనకు మేలు చేస్తాయి. పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూస్తాయి. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. ఈ విషయాన్ని సైంటిస్టులు స్వయంగా తమ అధ్యయనాల ద్వారా వెల్లడించారు. క్యాబేజీని విటమిన్ కె కు మంచి మూలం అని చెప్పవచ్చు. క్యాబేజీని తింటే విటమిన్ కె సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయం చేస్తుంది. అలాగే గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్త స్రావం అవకుండా జాగ్రత్త పడవచ్చు. అధిక బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజీ ఎంతగానో మేలు చేస్తుంది. దీన్ని తింటే చాలా తక్కువగా క్యాలరీలు లభిస్తాయి. పైగా ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఇలా క్యాబేజీని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.