Vitamin D | మన శరీరానికి విటమిన్ డి ఎంతో అవసరం అన్న విషయం అందరికీ తెలిసిందే. రోజూ కాసేపు సూర్యకాంతిలో మన శరీరం తగిలేలా ఉంటే మన ఒంట్లో విటమిన్ డి తయారవుతుంది. విటమిన్ డి తగినంతగా ఉంటేనే మన ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే రోగ నిరోధక వ్యవస్థను కూడా విటమిన్ డి ప్రభావితం చేస్తుంది. విటమిన్ డి వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా శరీరంలో పలు జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు కూడా మనకు విటమిన్ డి అవసరం అవుతుంది. అయితే రోజులో సూర్యకాంతి ఏ సమయంలో ఎక్కువగా ఉంటుంది, ఏ సమయంలో మనం ఎండలో నిలబడితే మన శరీరం ఎక్కువ విటమిన్ డిని తయారు చేసుకుంటుంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రోజులో ఉదయం లేదా సాయంత్రం సమయంలో అతినీలలోహిత కిరణాల ప్రభావం తక్కువగా ఉంటుంది. కనుక ఉదయం 8 గంటల లోపు లేదా సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య సూర్య కాంతి తగిలేలా ఎండలో నిలబడాలి. దీంతో సూర్యకాంతిని గ్రహించుకుని శరీరం విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. విటమిన్ డిని శరీరం అలా తయారు చేసుకుని పలు అవసరాలకు ఉపయోగించుకుంటుంది. అయితే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య సూర్యకాంతి తీవ్రత ఎక్కువ. సూర్యకాంతి ద్వారా శరీరం ఈ సమయంలోనే ఎక్కువ విటమిన్ డిని తయారు చేసుకుంటుంది.
అయితే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య మనం ఎండ తీవ్రత కారణంగా ఎండలో నిలబడలేం. అందుకు గాను కొందరు సన్ ప్రొటెక్షన్ క్రీమ్లను రాసుకుంటారు. అయితే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, విటమిన్ డిని శరీరం ఎక్కువగా తయారు చేసినప్పటికీ, ఈ సమయంలో వచ్చే కాంతిలో అతినీలలోహిత కిరణాలు ఎక్కువగా ఉంటాయి కనుక శరీరానికి హాని కలుగుతుంది. కనుక ఉదయం 8 గంటల లోపు అయితే చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల సూర్యకాంతిని శరీరం తగినంతగా గ్రహించి విటమిన్ డి ని తయారు చేసుకుంటుంది. ఇక విటమిన్ డి మనకు పలు ఆహారాల ద్వారా కూడా లభిస్తుంది.
కోడిగుడ్లు, చీజ్, నారింజ పండ్లు, పుట్టగొడుగులు, మటన్ లివర్, చేపలు, రొయ్యలు, జున్ను, నెయ్యి, మొక్కజొన్న, పాలు, పచ్చి బఠానీలు వంటి ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల కూడా మనం విటమిన్ డిని పొందవచ్చు. విటమిన్ డి పెద్దలకు రోజుకు 20 మిల్లీగ్రాముల మేర అవసరం అవుతుంది. విటమిన్ డి లోపిస్తే మన శరీరం పలు లక్షణాలను సూచిస్తుంది. వాటిని పరిశీలించడం ద్వారా శరీరంలో విటమిన్ డి లోపించిందని అర్థం చేసుకోవచ్చు. విటమిన్ డి లోపిస్తే ఎముకలు బలహీనంగా మారిపోతాయి. దీంతో ఎముకల్లో నొప్పి వస్తుంటుంది. అలాగే కండరాలు బలహీనంగా మారి ఒళ్లంతా నొప్పులుగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి సమస్యలు తరచూ వస్తుంటాయి. ఈ లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను కలిసి విటమిన్ డి ట్యాబ్లెట్లను వాడాలి. అలాగే పైన తెలిపిన ఆహారాలను తరచూ తింటుండాలి. దీంతో విటమిన్ డి లోపం నుంచి సులభంగా బయట పడవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.