Immunity In Winter | చలికాలంలో సహజంగానే చాలా మందికి శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ, ఫ్లూ వంటి సమస్యల బారిన పడుతుంటారు. దీంతో తీవ్ర అవస్థ పడతారు. చలికాలంలో చాలా మందికి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో సహజంగానే ఆయా సమస్యలు వస్తుంటాయి. అయితే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకుంటే ఈ సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు. ఇక ఇందుకు గాను పలు హెర్బల్ టీలు మనకు ఎంతో సహాయం చేస్తాయి. సాధారణంగా చాలా మంది చలికాలంలో టీ, కాఫీలను అధికంగా తాగుతుంటారు. శరీరాన్ని వెచ్చగా ఉంచడం కోసం వారు అలా చేస్తుంటారు. అయితే వాటికి బదులుగా హెర్బల్ టీలను తాగితే మేలు జరుగుతుంది. దీంతో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలను సులభంగా తగ్గించుకోవచ్చు. ఆయా సమస్యలను తగ్గించేందుకు పలు హెర్బల్ టీలను మనం ఈ సీజన్లో రోజూ తాగాల్సి ఉంటుంది.
ఆయుర్వేదంలో శిలాజిత్ అనే మూలికకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. ఇది హిమాలయాల్లో ఎత్తైన ప్రదేశాల్లో మాత్రమే లభించే తారు లాంటి పదార్థం. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని పలు ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. శిలాజిత్ను తీసుకుంటే పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. అయితే శిలాజిత్ను ఉపయోగించి తయారు చేసిన హెర్బల్ టీని సేవించడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ టీని తాగితే మన శరీరానికి బలం లభిస్తుంది. శరీరం దృఢంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. ఈ టీని సేవించడం వల్ల మైండ్ రిలాక్స్ అయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. శిలాజిత్ టీలో శొంఠి, అశ్వగంధ, జాపత్రి వంటి మూలికలను సైతం కలపాల్సి ఉంటుంది. దీంతో ఇంకా ఎక్కువ లాభాలు కలుగుతాయి. ఈ టీని సేవించడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇక శిలాజిత్ టీ మనకు మార్కెట్లో లేదా ఆన్లైన్లోనూ లభిస్తుంది.
వివిధ రకాల పండ్లను ఉపయోగించి తయారు చేసే ఫ్రూట్ టీ కూడా మనకు మార్కెట్లో లభిస్తుంది. దీన్ని తాగుతున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ప్రస్తుతం చాలా పండ్లకు చెందిన ఫ్రూట్ హెర్బల్ టీలను తయారు చేసి విక్రయిస్తున్నారు. వీటిని తాగడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. స్ట్రాబెర్రీ, మామిడి, పుచ్చకాయ, నారింజ వంటి పండ్లకు చెందిన ఫ్రూట్ టీలు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిని రోజూ తయారు చేసుకుని తాగవచ్చు. ఈ ఫ్రూట్ టీలను సేవిస్తుంటే అనేక రకాల విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మనస్సు ప్రశాంతంగా మారేలా చేస్తాయి. దీంతో మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి తగ్గుతుంది.
రోజూ మనం వంటల్లో వాడే పసుపుతో టీ తయారు చేసి తాగుతున్నా కూడా ఉపయోగం ఉంటుంది. గోరు వెచ్చని నీటిలో కాస్త పసుపు వేసి బాగా కలిపి తాగుతుండాలి. పసుపులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. పసుపును రోజూ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులను తగ్గించుకోవచ్చు. అలాగే అధిక బరువు తగ్గుతారు. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. ఇలా ఆయా టీలను సేవించడం వల్ల చలికాలంలో సులభంగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండవచ్చు.