Immunity Foods | సీజన్లు మారినప్పుడు మనకు సహజంగానే దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. ఇక ఇప్పుడు చలికాలం మొదలై చాలా రోజులు అవుతోంది. దీంతో చాలా మంది శ్వాసకోశ సమస్యలతో సతమతం అవుతున్నారు. అయితే కొందరికి ఈ సీజన్ మొత్తం ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. అంటే వారిలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి వారు రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను తినాల్సి ఉంటుంది. వీటిని తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి వ్యాధిని కలిగించే క్రిములతో, ఇన్ఫెక్షన్లతో పోరాటం చేస్తాయి. దీంతో రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇక ఈ సీజన్లో ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే అందుకు తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే మన శరీరానికి శక్తి లభించడమే కాదు ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా పప్పు దినుసులతోపాటు చికెన్, మటన్, చేపలు, కోడిగుడ్లు, చీజ్, పుట్టగొడుగులు, పచ్చి బఠానీలు, క్యాబేజీ, క్యాలిఫ్లవర్, బీన్స్ వంటి ఆహారాలను తీసుకోవాలి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి రోగాల నుంచి రక్షణను అందిస్తాయి. అదేవిధంగా విటమిన్ సి ఉండే ఆహారాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తాజా పండ్లు, కూరగాయల్లో విటమిన్ సి ఉంటుంది. ముఖ్యంగా నిమ్మ, నారింజ జాతికి చెందిన పండ్లతోపాటు కివి, పైనాపిల్, మామిడి, ద్రాక్ష వంటి పండ్లలో, పాలకూర, క్యాప్సికం వంటి ఆకుకూరలు, కూరగాయల్లోనూ విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను తింటున్నా కూడా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవచ్చు.
మన రోగ నిరోధక శక్తి పెరిగేందుకు విటమిన్ ఎ కూడా ఎంతగానో సహాయం చేస్తుంది. ఇది కూరగాయల్లో, నట్స్, విత్తనాల్లో ఉంటుంది. బీటాకెరోటిన్ ఉన్న ఆహారాలను తీసుకుంటే అది మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. విటమిన్ ఎ మనకు క్యారెట్స్, కీరదోస, బొప్పాయి, గుమ్మడికాయలు, ఆకుకూరల్లో లభిస్తుంది. అదేవిధంగా డి విటమిన్ లభించేలా చూసుకోవాలి. రోజూ ఉదయం శరీరానికి 20 నిమిషాలపాటు అయినా ఎండ తగిలేలా ఉండాలి. దీంతో విటమిన్ డి తయారవుతుంది. అలాగే నారింజ పండ్లు, పుట్టగొడుగులు, కోడిగుడ్లు వంటి ఆహారాలను తినడం వల్ల కూడా మనకు విటమిన్ డి లభిస్తుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్‌ను పెంచేందుకు సహాయపడుతుంది.
ఆకుకూరలు, బీన్స్, నిమ్మజాతికి చెందిన పండ్లలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అదేవిధంగా ఐరన్ అధికంగా ఉండే బీన్స్, లివర్, ఆకుకూరలను తీసుకోవడం వల్ల కూడా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కోడిగుడ్లు, బ్రౌన్ రైస్, బీన్స్, పుట్టగొడుగులు, ఓట్స్, పాలకూర, పాల ఉత్పత్తులు, పప్పు దినుసులు, అరటి పండ్లలో సెలీనియం అధికంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఇది కూడా సహాయం చేస్తుంది. అదేవిధంగా జింక్ ఉండే చిక్కుడు జాతి గింజలు, విత్తనాలు, నట్స్, పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలా ఈ సీజన్లో వచ్చే రోగాలకు చెక్ పెట్టాలంటే ఇమ్యూనిటీ పవర్‌ను అందించే ఈ ఆహారాలను తినాల్సి ఉంటుంది. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. రోగాలు రాకుండా చూసుకోవచ్చు.