మనదేశంలో ఎండకాలం తర్వాత వానకాలం రాకతోనే అనేక రకాల సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి. పిల్లల్లో ఈ సమస్యలు అధికంగా ఉంటాయి. వానకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, గొంతువాపు, విరేచనాలు, యూరిన్ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు పిల్లల్ని ఎక్కువగా బాధిస్తుంటాయి. ఇవి వైరస్ వల్ల గానీ, అలర్జీ వల్ల గానీ వస్తుంటాయి. సీజనల్ వ్యాధుల వల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ పిల్లల్ని మంచిగా చూసుకుంటే తగ్గిపోతాయి.
కానీ, ఈ సీజనల్ డెంగ్యూ, రికెట్సియల్ ఇన్ఫెక్షన్, మలేరియా, టైఫాయిడ్, లెప్టో స్పైరోసిస్, స్రబ్ టైపస్, బ్లడ్ ఇన్ఫెక్షన్ వంటి తీవ్రమైన ప్రభావం చూపే రోగాలు వస్తున్నాయి. వీటిని ఉష్ణమండల జ్వరాలు (ట్రాపికల్ ఫీవర్స్) అంటారు. ఈ రోగాలను నిర్లక్ష్యం చేస్తే శరీర అవయవాల పనితీరు మందగిస్తుంది. చికిత్స కోసం ఐసీయూలో ఉంచాల్సి రావొచ్చు. కాబట్టి ఈ సీజన్లో పిల్లలకు జ్వరం వస్తే.. అది సాధారణ జ్వరమా? ప్రాణాంతకమైన ట్రాపికల్ జ్వరమా? అని తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే పిల్లలు అన్ని రకాల జ్వరాలను తేలికగా ఎదుర్కోగలరు.
ట్రాపికల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన జ్వరం తీవ్రంగా ఉంటుంది. జ్వరం వంద డిగ్రీల దాకా ఉంటుంది. మూడు రోజులైనా తగ్గదు. ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. జ్వరంతోపాటు చలి, వణుకు, ఒంటిపై దద్దుర్లు, ఒళ్లంతా కందిపోయినట్టుగా ఎర్రగా మారడం, కంటి చుట్టూ వాపు, కాళ్లూ చేతులు వాయడం, దగ్గు వంటి లక్షణాలు ఉంటాయి. ఇలా ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యులకు చూపించాలి. వాళ్లు లక్షణాల ఆధారంగా సరైన పరీక్షలు చేసి, కచ్చితమైన వైద్యం అందిస్తారు. కొంతమంది జ్వరం రాగానే ఇంట్లో ఉన్న పాత మందులు ఇస్తారు. ఒకరికి జ్వరం వస్తే వాడుతున్న మందే రెండో వాళ్లకు కూడా వాడతారు.
పాత మందులు కొని వాడతారు. సొంతంగా పరీక్షలు చేయిస్తారు. ఇవన్నీ చాలా నష్టం కలిగిస్తాయి. సొంతంగా మందులు వాడటం వల్ల యాంటి బయాటిక్స్కి రోగాలు లొంగవు. ఫీవర్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకున్నా కొన్ని ఎటూ తేలవు. కొన్ని జ్వరాలు పాజిటివ్ వచ్చినా కచ్చితత్వం ఉండదు. కాబట్టి లక్షణాలను బట్టి ఎన్నో రోజు పరీక్ష చేయాలనేది వైద్యులు నిర్ణయిస్తారు. సొంత పరీక్షలు, మందుల వల్ల పిల్లలకు ఎక్కువ ప్రమాదం ఉంటుంది. తీవ్రమైన జ్వరం, మూడు రోజులకు మించి ఉంటే… తప్పకుండా వైద్యులకు చూపించండి.
– డాక్టర్ అనుపమ వై.
సీనియర్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్