Eyebrows | ముఖం అందంగా కనిపించడంలో కనుబొమ్మలు ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. అందమైన, వత్తుగా ఉండే కనుబొమ్మలు ముఖ అందాన్ని పెంచడంలోనే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. కనుబొమ్మలు అందంగా కనిపించడానికి స్త్రీలు ఎంతో ఖర్చు చేస్తారని కూడా చెప్పవచ్చు. అయితే కొందరిలో కనుబొమ్మలు చాలా పలుచగా ఉంటాయి. దీంతో వారు ఆత్మనూన్యత భావనకు గురి అవుతూ ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే కొన్ని రకాల ఇంటి చిట్కాలను పాటించడం వల్ల కనుబొమ్మలు ఒత్తుగా, నల్లగా, అందంగా తయారవుతాయి. కనుబొమ్మల అందాన్ని మెరుగుపరిచే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కనుబొమ్మలు పలుచగా ఉన్న వారు రోజూ వాటిపై ఆముదం నూనెను రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆముదం నూనెలో విటమిన్లు, ప్రోటీన్లు, కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది కుదుళ్లు వేగంగా, నల్లగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. దూది లేదా సున్నితమైన బ్రష్ తో రోజూ కనుబొమ్మలపై ఆముదం నూనెను రాయడం వల్ల కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి. అలాగే ఉల్లిపాయలల్లో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఉల్లిపాయ రసాన్ని రోజూ రెండుసార్లు కనుబొమ్మలపై రాసి 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల కనుబొమ్మలు అందంగా తయారవుతాయి.
కలబంద ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను, సౌందర్య ప్రయోజనాలను అందిస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనిలో విటమిన్లు. ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. తాజా కలబంద జెల్ ను కనుబొమ్మలపై రాసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా కొబ్బరి నూనెలో లారిక్ ఆమ్లాలు, విటమిన్లు. ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇది అందరి ఇండ్లల్లోనూ ఉంటుంది. జుట్టు పెరుగుదలకు, ఆరోగ్యానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. రోజూ రాత్రి పడుకునే ముందు కనుబొమ్మలపై కొబ్బరి నూనెను రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల కనుబొమ్మలు ఒత్తుగా, నల్లగా పెరుగుతాయి.
రోజ్మేరీ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి వెంట్రుకలకు రక్తప్రసరణను పెంచి అవి వేగంగా పెరిగేలా చేయడంలో తోడ్పడతాయి. కొబ్బరి నూనెలో రోజ్మేరీ నూనెను కలిపి కనుబొమ్మలపై సున్నితంగా రాసి మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల కొన్ని వారాల్లోనే చక్కటి ఫలితాలను పొందవచ్చు.