Weak Immunity System | మన శరీరంలో ఒక్కో భాగం ఒక్కో విధిని నిర్వహిస్తుంది. అందువల్లే దేనికదే ప్రత్యేకమైనది. అయితే అన్ని భాగాలను రక్షించేది రోగ నిరోధక వ్యవస్థ. శరీరంలోకి ఏవైనా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశిస్తే వెంటనే స్పందించేది ఈ వ్యవస్థే. దీంతో మనకు రోగాలు రాకుండా చూస్తుంది. అయితే రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటే మనం సులభంగా రోగాల బారిన పడతాం. ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఈ క్రమంలోనే రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటే మన శరీరం పలు లక్షణాలను, సంకేతాలను సూచిస్తుంది. వాటిని గమనించడం ద్వారా మన రోగ నిరోధక శక్తి తగ్గిందని సులభంగా తెలుసుకోవచ్చు. దీంతో ముందుగానే జాగ్రత్త పడవచ్చు. రోగాలు రాకుండా అడ్డుకోవచ్చు.
మన రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా మారి రోగ నిరోధక శక్తి తగ్గితే మనకు తరచూ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ముఖ్యంగా తరచూ జలుబు చేస్తుంటుంది. ఒక పట్టాన తగ్గదు. ఫ్లూ జ్వరం ఉంటుంది. చెవి ఇన్ఫెక్షన్లు వస్తాయి. సైనస్, బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి సమస్యలు మనల్ని తరచూ ఇబ్బందులకు గురి చేస్తాయి. ఒక వేళ వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్లు తరచూ రాకపోయినా ఒకసారి వచ్చినవి అంత సులభంగా తగ్గడం లేదంటే మాత్రం మన రోగ నిరోధక శక్తి తగ్గిందని గుర్తించాలి. అలాగే రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటే గాయాలు, పుండ్లు అంత సులభంగా మానవు. షుగర్ లేకపోయినా గాయాలు, పుండ్లు మానేందుకు సమయం పడుతుందంటే అలాంటి వారిలో రోగ నిరోధక శక్తి తగ్గిందని గుర్తించాలి.
రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటే తీవ్రమైన అలసట నిరంతరాయంగా ఉంటుంది. చిన్న పనిచేసినా విపరీతంగా అలసట వస్తుంది. రాత్రంతా సరిగ్గా నిద్రించినా కూడా ఉదయం నిద్ర లేవగానే విపరీతమైన అలసట ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే జీర్ణాశయంలో పలు ఇన్ఫెక్షన్లు తరచూ వస్తుంటాయి. దీంతో విరేచనాలు, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. ఇవి అంత త్వరగా తగ్గవు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే శరీరంలో ఏ ప్రదేశంలో అయినా సరే బ్యాక్టీరియా ఎక్కువగా పెరిగిపోతుంది. అది ఇన్ఫెక్షన్లను కలగజేస్తుంది. ముఖ్యంగా నాలుక అంతా తెల్లగా మారుతుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన కూడా అధికంగానే ఉంటాయి. ఇవన్నీ రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉందని తెలిపే సంకేతాలు.
అన్ని పోషకాలు కలిగిన సమతుల ఆహారాన్ని రోజూ తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థను బలంగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు, తృణ ధాన్యాలను అధికంగా తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు నట్స్, విత్తనాలు కూడా బాగానే పనిచేస్తాయి. అలాగే నీళ్లను తగిన మోతాదులో తాగుతుండాలి. రాత్రి పూట కచ్చితంగా 7 నుంచి 8 గంటల పాటు నిద్రించాలి. ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకునేందుకు రోజూ యోగా, ధ్యానం చేయాలి. పుస్తక పఠనం చేయాలి. పచ్చని ప్రకృతిలో రోజూ కాసేపు గడపాలి. మద్యపారం, ధూమపానంకు దూరంగా ఉండాలి. ఈ సూచనలు పాటిస్తే పైన తెలిపిన సంకేతాలు, లక్షణాలు అన్నీ తగ్గిపోతాయి. దీంతో మీ రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారిందని నిర్దారించుకోవచ్చు.