Stomach Discomfort | ప్రస్తుతం చాలా మంది జీర్ణ సమస్యల బారిన పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా బయటి ఫుడ్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్టలో అసౌకర్యం ఏర్పడుతోంది. ఫుడ్ పాయిజనింగ్ కూడా అవుతోంది. దీంతో జీర్ణ సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే పలు ఇతర కారణాల వల్ల కూడా మనకు అనేక జీర్ణ సమస్యలు వస్తుంటాయి. ఒత్తిడి, ఆందోళన, కారం, మసాలాలు ఉన్న ఆహారాలను అధికంగా తినడం, శీతల పానీయాలను ఎక్కువగా సేవించడం, మద్యం సేవించడం, పొగ తాగడం, మాంసం అధికంగా తినడం, ఆలస్యంగా భోజనం చేయడం, థైరాయిడ్ వంటి అనేక కారణాల వల్ల జీర్ణ సమస్యలు వస్తున్నాయి. అయితే ఉదయం ఈ అలవాట్లను పాటిస్తే దాంతో జీర్ణ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇక ఆ అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం నిద్రలేచిన వెంటనే చాలా మంది టీ లేదా కాఫీ తాగుతారు. కానీ ఇవి పొట్టలో అసౌకర్యాన్ని పెంచి జీర్ణ సమస్యలను కలగజేస్తాయి. అయితే ఉదయం నిద్ర లేవగానే వీటికి బదులుగా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇది అన్ని రకాల జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. ఉదయం నిద్ర లేచిన వెంటనే గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. పొట్టలో ఉండే అసౌకర్యం తగ్గుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో జంక్ ఫుడ్‌ను, నూనె పదార్థాలను తీసుకోవడం మానేయాలి. ఇవి పొట్టలో అసౌకర్యాన్ని పెంచుతాయి. ఈ ఆహారాలకు బదులుగా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి పొట్టను ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా ఓట్స్, తాజా పండ్లు, తృణ ధాన్యాలు, కూరగాయలను ఉదయం తినాలి. దీంతో జీర్ఱక్రియ మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. పొట్ట ఉబ్బరం పోతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.
బ్రేక్‌ఫాస్ట్ చేసిన వెంటనే కూడా చాలా మంది టీ, కాఫీ సేవిస్తుంటారు. వీటి వల్ల గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల బ్రేక్‌ఫాస్ట్ అనంతరం టీ, కాఫీలకు బదులుగా పండ్ల రసాలను చక్కెర లేకుండా అప్పటి కప్పుడు తయారు చేసి తాగాలి. ఇవి మన జీర్ణ వ్యవస్థను హాయిగా ఉంచుతాయి. పొట్టలో అసౌకర్యం, గ్యాస్ ఏర్పడకుండా చూస్తాయి. అలాగే భోజనం చేసిన ప్రతిసారి ఆహారంలో కచ్చితంగా పెరుగు లేదా మజ్జిగను తీసుకోవాలి. ఇవి మన జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. దీంతో జీర్ణ వ్యవస్థలో ఉండే అసౌకర్యం తొలగిపోతుంది. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్, విరేచనాల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కనుక భోజనం చివర్లో పెరుగు లేదా మజ్జిగను తీసుకోవడం మరిచిపోకండి.
మనం రోజూ పనిఒత్తిడి లేదా వివిధ రకాల కారణాల వల్ల ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ఒత్తిడి మరీ అధికంగా ఉంటే దాని ప్రభావం జీర్ణ వ్యవస్థపై పడుతుంది. దీంతో పొట్టలో అసౌకర్యం ఏర్పడి గ్యాస్ వస్తుంది. కనుక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అందుకు గాను యోగా, ధ్యానం ఎంతగానో పనిచేస్తాయి. రోజూ కాసేపు ప్రకృతిలో గడపడం వల్ల లేదా ఇష్టమైన సంగీతం వినడం, పుస్తకాలను చదవడం వల్ల కూడా ఒత్తిడి, ఆందోళనను దూరం చేసుకోవచ్చు. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. రోజూ తగినన్ని నీళ్లను కూడా తాగాల్సి ఉంటుంది. నీళ్లు జీవక్రియలు సక్రమంగా జరిగేలా చూస్తాయి. దీంతో మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం రాకుండా నివారించవచ్చు. ఇలా పలు రకాల ఆరోగ్య సూత్రాలను పాటించడం వల్ల పొట్టలో అసౌకర్యం ఏర్పడకుండా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.