Kidney Stones | కిడ్నీలలో రాళ్ల సమస్య అనేది ఒకప్పుడు వయస్సు మీద పడిన వారికి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు యుక్త వయస్సులో ఉన్నవారికి కూడా కిడ్నీ స్టోన్లు వస్తున్నాయి. ఈ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. మద్యం అధికంగా సేవించడం, పొగ తాగడం, మాంసాహారాలను అధికంగా తినడం, నీళ్లను సరిగ్గా తాగకపోవడం, కూల్ డ్రింక్‌లను అధికంగా సేవించడం వంటి పలు కారణాల వల్ల చాలా మందికి కిడ్నీ స్టోన్లు వస్తుంటాయి. అయితే కిడ్నీ స్టోన్లు వచ్చినప్పుడు వాటిని తక్కువ సైజులోనే ఉన్నప్పుడు గుర్తిస్తే వాటికి శస్త్ర చికిత్స అవసరం ఉండదు. డాక్టర్లు ఇచ్చే మందులను క్రమం తప్పకుండా వాడితే స్టోన్లు వాటంతట అవే కరిగిపోతాయి. దీంతోపాటు నొప్పి కూడా తగ్గుతుంది. మూత్రం సాఫీగా జారీ అవుతుంది. అలాగే ఆహారం విషయంలోనూ పలు మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీ స్టోన్ల సమస్య సహజంగా నీళ్లను సరిగ్గా తాగకపోవడం వల్ల వస్తుంది. నీళ్లను తగినంత మోతాదులో తాగకపోతే కిడ్నీల్లో వ్యర్థాలు పేరుకుపోతాయి. అవి దీర్ఘకాలంలో రాళ్లుగా మారుతాయి. అలా జరగకుండా ఉండాలంటే నీళ్లను తగిన మోతాదులో తాగాల్సి ఉంటుంది. దీంతో కిడ్నీల్లో ఉండే వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటకు పోతాయి. స్టోన్స్ ఏర్పడకుండా ఉంటాయి. రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీళ్లను తాగితే అసలు కిడ్నీ స్టోన్లు రావని వైద్యులు చెబుతున్నారు. కనుక నీళ్లను తగినంత మోతాదులో తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే నిమ్మ జాతికి చెందిన పండ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ పండ్లలో సిట్రేట్ ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్లను కరిగించేందుకు సహాయం చేస్తుంది. కిడ్నీల్లో స్టోన్లకు కారణం అయ్యే కాల్షియం, ఆగ్జలేట్స్ వంటి వాటిని మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. నిమ్మరసం, నారింజ, ద్రాక్ష, పైనాపిల్ వంటి పండ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే మేలు జరుగుతుంది. కిడ్నీ స్టోన్లను త్వరగా వదిలించుకోవచ్చు.
క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలను తినడం మానుకోవాలి. ఆగ్జలేట్స్ అధికంగా ఉండే ఆహారాలను కూడా తక్కువగా తినాలి. ఈ రెండు రకాల ఆహారాలను కలిపి తినకూడదు. ఇవి స్టోన్లు వచ్చేందుకు కారణం అవుతాయి. ఉదాహరణకు పాలకూర, టమాటాలను కలిపి తింటే వీటిల్లో ఉండే క్యాల్షియం, ఆగ్జలేట్స్ కారణంగా ఇవి కిడ్నీల్లో స్టోన్లు ఏర్పడేందుకు కారణం అవుతాయి. కనుక ఇలాంటి ఫుడ్ కాంబినేషన్లను మానేయాలి. వెన్న తక్కువగా ఉండే పాలు, పెరుగు, చీజ్ వంటివి తింటే వాటిల్లో ఉండే విటమిన్ డి శరీరంలో అధికంగా ఉండే క్యాల్షియంను శోషించుకునేలా చేస్తుంది. దీంతో ఎముకలు నిర్మాణమవుతాయి. ఎముకలు బలంగా ఉంటాయి. కిడ్నీ స్టోన్ల సమస్య ఉండదు. ఇక కొందరు క్యాల్షియం ట్యాబ్లెట్లను వాడుతుంటారు. కానీ ఇది డోసు మించితే స్టోన్స్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కనుక డాక్టర్ చెబితే తప్ప ఈ ట్యాబ్లెట్లను వాడకూడదు.
మాంసాహారం అధికంగా తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోయి అది కూడా కిడ్నీ స్టోన్స్‌ను కలగజేస్తుంది. కనుక మాంసాహారాన్ని అధికంగా తినడం మానుకోవాలి. అందుకు బదులుగా పప్పు దినుసులు, శనగలు, బీన్స్, పచ్చి బఠానీలను తీసుకోవాలి. ఇవి కిడ్నీ స్టోన్లు ఏర్పడకుండా చూస్తాయి. ప్రోటీన్లను సైతం అందిస్తాయి. అలాగే టీ, కాఫీలను అధికంగా తాగడం వల్ల కూడా స్టోన్స్ వస్తాయి. కనుక రోజుకు 2 లేదా 3 కప్పులకు మించి టీ, కాఫీ తాగకుండా చూసుకోవాలి. ఫాస్డ్ ఫుడ్స్, ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, స్నాక్స్, శీతల పానీయాలను తీసుకోవడం మానుకోవాలి. ఇవన్నీ కిడ్నీలపై నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. స్టోన్స్ ఏర్పడేలా చేస్తాయి. ఇలా ఆహారాల విషయంలో మార్పులు చేసుకుంటే కిడ్నీ స్టోన్స్ ను సులభంగా కరిగించుకోవచ్చు. భవిష్యత్తులోనూ మళ్లీ ఇవి ఏర్పడకుండా ఉంటాయి.