High BP | ప్రతి సంవత్సరం 17.9 మిలియన్ల జనాభా హృదయ సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారని వైద్య నిపుణుల అధ్యయనాలల్లో వెల్లడైంది. వీటిలో ముఖ్యంగా గుండెపోటు, స్ట్రోక్ వంటి వాటితో మరణించే వారి సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యలు యువతలో ఎక్కువగా రావడం మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. గుండెపోటు, స్ట్రోక్ లతో పాటు ఇతర గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉండాలంటే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం చాలా అవసరం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చక్కటి ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది.
సమతుల్యమైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా అరటి పండును తీసుకోవడం వల్ల గుండెకు ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అరటిపండు మనకు అన్ని వేళలా తక్కువ ధరలో లభిస్తుంది. అలాగే అరటిపండు తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా దీనిని ఇష్టంగా తింటారు. అరటిపండ్లను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అరటిపండులో పొటాషియం ఎక్కువగా సోడియం తక్కువగా ఉంటుంది. దీనిని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. అంతేకాకుండా అరటిపండును తీసుకోవడం వల్ల దీనిలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.
అధిక రక్తపోటు కారణంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ప్రతిరోజూ అరటిపండును తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉండడంతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. పొటాషియంతో పాటుగా దీనిలో ఫైబర్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. అరటి పండును తీసుకోవడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే కేవలం అరటిపండును మాత్రమే కాకుండే మనం తీసుకునే ఆహారంలో బ్రోకలీ, ఆకుకూరలు, పప్పు దినుసులు, గింజలు, కూరగాయలు, పండ్లు వంటి వాటిని కూడా చేర్చుకోవాలి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి.
ఆహారంతో పాటు జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల కూడా మనం గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. వ్యాయామాన్ని దినచర్యలో భాగంగా చేసుకోవాలి. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయడం అలవరుచుకోవాలి. ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయాలి. ఈ విధంగా అరటిపండును ఆహారంలో భాగంగా చేసుకుని సమతుల్య ఆహారాన్ని తీసుకుంటూ చక్కటి జీవనశైలిని పాటించడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.