Hemoglobin Deficiency | మన శరీరానికి రక్తం అనేది ఇంధనం లాంటిది. ఇందులో అనేక పదార్థాలు, సమ్మేళనాలు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. వీటన్నింటినీ శరీర భాగాలకు చేరవేయడంలో హిమోగ్లోబిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను కణాలకు చేరవేయడంలో, తిరిగి కణాల నుంచి కార్బన్ డయాక్సైడ్ను ఊపిరితిత్తులకు రవాణా చేయడంలో హిమోగ్లోబిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గితే పలు లక్షణాలు కనిపిస్తాయి. హిమోగ్లోబిన్ తగినంతగా లేకపోతే రక్తం తయారు కాదు. దీంతో రక్తహీనత సమస్య వస్తుంది. ఈ సమస్య చిన్నారులు, మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఐరన్ లోపించడం మూలంగా చాలా మందికి హిమోగ్లోబిన్ సరిగ్గా తయారు కాదు. దీంతో రక్తహీనత ఏర్పడుతుంది.
తోటకూర, గోంగూర, బెల్లం, మాంసాహారంలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఐరన్ ఉండే ఆహారాలను తింటుంటే తద్వారా ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. దీంతో హిమోగ్లోబిన్ కూడా సరిగ్గా ఉత్పత్తి అవుతుంది. అప్పుడు జీవక్రియలకు ఎలాంటి ఆటంకం కలగదు. ఇక హిమోగ్లోబిన్ లోపిస్తే నాలుకపై, కను రెప్పల కింద, గోళ్లు తెల్లగా పాలిపోయి కనిపిస్తాయి. బలహీనంగా ఉంటారు. బద్దకంగా అనిపిస్తుంది. ఏ అంశంపై కూడా ఆసక్తిగా ఉండదు. ఏ పని చేయాలనిపించదు. చిన్న చిన్న పనులకే అలసట వస్తుంది. నిరాశగా ఉంటుంది. నీరసం, ఆయాసం వస్తుంటాయి. అలాగే చిన్నారుల్లో అయితే కొందరికి పొట్టలో నులి పురుగుల సమస్య వస్తుంది.
హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని పరీక్షల్లో తేలితే డాక్టర్లు ఇచ్చే మందులను వాడాల్సి ఉంటుంది. దీంతోపాటు పలు ఆహారాలను తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచవచ్చు. పుచ్చకాయలను తినడం వల్ల మనకు అనేక పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా అనేక ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఈ కాయల్లో ఉంటాయి. అందువల్ల వీటిని తింటే ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. దీని వల్ల హిమోగ్లోబిన్ లోపం నుంచి బయట పడవచ్చు. అలాగే చెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీలు, రాస్ప్ బెర్రీల వంటి బెర్రీ పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటున్నా కూడా హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చు. వీటిల్లోనూ ఐరన్ అధికంగానే ఉంటుంది.
ఖర్జూరాలను రోజూ 4-5 నీటిలో నానబెట్టి తింటుంటే ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది హిమోగ్లోబిన్‌ను తయారు చేసేందుకు ఎంతగానో దోహదం చేస్తుంది. ఖర్జూరాల్లో ఉండే పొటాషియం శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ కూడా తగ్గుతుంది. బీట్ రూట్, ఆరెంజ్, క్యారెట్ వంటి పండ్లు, కూరగాయలను రోజూ ఉదయం ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటి ద్వారా కూడా ఐరన్‌ను పొందవచ్చు. ఇవన్నీ ఐరన్‌ను అందించి హిమోగ్లోబిన్ పెరిగేలా చేస్తాయి. అలాగే నాన్ వెజ్ ప్రియులు అయితే తరచూ మాంసాహారం తీసుకోవాలి. ముఖ్యంగా గుడ్లు, చేపలను తింటుంటే రక్తం అధికంగా తయారవుతుంది. హిమోగ్లోబిన్ లోపం సమస్య కూడా తగ్గుతుంది. ఇలా పలు ఆహారాలను తీసుకుంటూ జాగ్రత్తలను పాటిస్తే హిమోగ్లోబిన్ లోపం నుంచి బయట పడవచ్చు.