Edema | వయస్సు పెరుగుతున్న కొద్దీ చాలా మందికి అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇది సహజమే. ఇలాంటి అనారోగ్య సమస్యల్లో ఎడిమా కూడా ఒకటి. పాదాల వాపులనే ఎడిమా అంటారు. ఈ సమస్య వస్తే పాదం మొత్తం వాపులకు గురవుతుంది. వేలితో నొక్కితే సొట్ట పడుతుంది. పాదాలలో నీరు చేరడం వల్ల ఇలా అవుతుంది. ఎడిమా అనేది వయస్సు మీద పడిన వారికి మాత్రమే కాదు, ప్రస్తుతం చాలా మందికి వస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. నిత్యం గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేయడం, ఒకే చోట ఎక్కువ సేపు నిలబడి ఉండడం, గర్భిణీలకు, అధిక బరువు ఉన్నవారికి, ఉప్పును అధికంగా తీసుకునే వారికి, పలు రకాల మందులను దీర్ఘకాలంగా వాడేవారికి, చిన్నపాటి గాయాలు అయినవారికి, వేడి వాతావరణంలో ఉండే వారికి, స్త్రీలకు రుతు సమయంలో ఇలా పాదాల వాపులు వస్తుంటాయి.
పాదాల వాపులు ఉన్నవారు ఆందోళన చెందాల్సిన పనిలేదు. పలు రకాల ఇంటి చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అయితే వాపులు ఎంతకీ తగ్గకుండా అంతకంతకూ విపరీతమైన నొప్పి వస్తుంటే మాత్రం కచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాలి. వాపుల దగ్గర ఎరుపుదనం ఉన్నా, దురదలు వస్తున్నా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనా, చర్మం రంగు మారినా వెంటనే డాక్టర్‌ను కలవాల్సి ఉంటుంది. లేదంటే ప్రాణాపాయ పరిస్థితులకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. సాధారణ పాదాల వాపులు అయితే ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. పాదాల వాపులు ఉన్నవారు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. పాదాల కింద దిండును ఎత్తుగా పెట్టి విశ్రాంతి తీసుకోవాలి. కూర్చుని పనిచేసే వారు ప్రతి 30 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాల పాటు బ్రేక్ తీసుకోవాలి. అదే నిలబడి ఉండేవారు కూర్చునేందుకు ప్రయత్నించాలి.
సగం బకెట్లో గోరు వెచ్చని నీటిని తీసుకుని అందులో కాస్త ఎప్సమ్ సాల్ట్ వేసి కలిపి ఆ నీటిలో పాదాలు మునిగేలా ఉంచాలి. ఇలా 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచితే పాదాల వాపులు వెంటనే తగ్గిపోతాయి. నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఎప్సమ్ సాల్ట్‌లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి వాపులు, నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు లేదా పాదాలు, కాళ్లపై పుండ్లు ఉన్నవారు ఈ చిట్కాను పాటించకూడదు. అలాగే మార్కెట్లో సర్జికల్ మెడికల్ దుకాణాల్లో కంప్రెషన్ సాక్స్ లభిస్తాయి. వాటిని తెచ్చి ధరిస్తున్నా ఉపశమనం లభిస్తుంది. ఆహారంలో ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించాలి. ఉప్పులో ఉండే సోడియం శరీరంలో అధికంగా చేరితే నీళ్లను ఎక్కువగా నిల్వ ఉండేలా చేస్తుంది. దీంతో పాదాల వాపులు వస్తాయి. కిడ్నీలపై భారం కూడా పడుతుంది. కనుక ఉప్పు వాడకాన్ని గణనీయంగా తగ్గించాలి.
పాదాల వాపులు ఉన్నవారు నీళ్లను అధికంగా తాగాలి. దీంతో శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ సమస్య ఉన్నవారు తేలికపాటి వ్యాయామాలు చేస్తుండాలి. దీంతో రక్త సరఫరా మెరుగు పడి వాపులు తగ్గుతాయి. అలాగే పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా ఎడిమా సమస్య తగ్గుతుంది. కీరదోస, పుచ్చకాయ, కొత్తమీర రసం, అల్లం రసం, స్ట్రాబెర్రీలు, చెర్రీలు, విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తింటుండాలి. యాపిల్ సైడర్ వెనిగర్ కూడా బాగానే పనిచేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తాగుతున్నా కూడా పాదాల వాపులు తగ్గిపోతాయి. యాపిల్ సైడర్ వెనిగర్‌ను దంతాలకు తగలకుండా తీసుకోవాలి. లేదంటే దంతాలపై ఉండే ఎనామిల్ దెబ్బ తింటుంది. ఇలా పలు ఇంటి చిట్కాలను, సూచనలను పాటిస్తుంటే పాదాల వాపులను తగ్గించుకోవచ్చు.