Belly Fat | మనలో చాలా మంది పొట్ట చుట్టూ కొవ్వు చేరి అనేక ఇబ్బందులు పడుతున్నారు. పొట్ట చుట్టూ చేరిన కొవ్వు కారణంగా శరీర సౌష్టవం దెబ్బతినడంతో పాటు అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. పొట్ట చుట్టూ కొవ్వు అధికంగా ఉండడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, థైరాయిడ్ వంటి అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక పొట్ట చుట్టూ చేరిన కొవ్వును తగ్గించుకోవడం చాలా అవసరం. పొట్ట చుట్టూ చేరిన కొవ్వు తగ్గాలంటే మనం ముందుగా శరీర జీవక్రియలను పెంచే ఆహారాలను. జీర్ణక్రియను మెరుగుపరిచే ఆహారాలను, కొవ్వు కరిగించే ఆహారాలను తీసుకోవాలి. ఈ ఆహారాల్లో ఉండే ఫైబర్, మంచి కొవ్వులు, ప్రోటీన్లు జీవక్రియను పెంచుతాయి. కొవ్వు నిల్వకు సంబంధించిన హార్మోన్లను నియంత్రిస్తాయి. వీటిలో ఉండే థర్మోజెనిక్ లక్షణాలు క్యాలరీలు ఎక్కువగా బర్న్ అయ్యేలా చేయడంలో సహాయపడతాయి. కనుక మనం కొవ్వును కరిగించే సరైన ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం.
పొట్ట చుట్టూ కొవ్వు అధికంగా ఉన్నవారు అవకాడోలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిలో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. అవకాడోలను తినడం వల్ల అతిగా తినడం తగ్గుతుంది. పొట్ట నిండుగా ఉంటుంది. కనుక పొట్ట చుట్టూ చేరిన కొవ్వు కరగడంతో పాటు శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. గ్రీన్ టీ శరీరంలో జీవక్రియలను పెంచుతుంది. దీంతో క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. కొవ్వు త్వరగా కరుగుతుంది. ఈ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పేరుకుపోయిన కొవ్వు కారణంగా తలెత్తే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో మనం ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం.
ప్రోటీన్, ప్రోబయోటిక్స్ తో నిండిన పెరుగును తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. కండరాల ద్రవ్యరాశి తగ్గడంతోపాటు జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇక ప్రోటీన్, ఫైబర్, అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉండే కినోనోవా రైస్ ను తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు కరుగుతుంది. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఈ ధాన్యాన్ని తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. దీంతో ఉదరంలో కొవ్వు నిల్వలు తగ్గుతాయి. పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉన్నవారు మిరపకాయలను తీసుకోవడం మంచిది. దీనిలో ఉండే కాప్సైసిన్ థర్మోజెనిసిన్ ను పెంచుతుంది. దీంతో విశ్రాంతి సమయంలో కూడా క్యాలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. ఆకలి కూడా తగ్గుతుంది.
బ్లూబెర్రీ, రాస్ప్బెర్రీస్, స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల కూడా పొట్ట చుట్టూ కొవ్వు కరుగుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. ప్రోటీన్ ఎక్కువగా ఉండే గుడ్డు కూడా పొట్ట చుట్టూ కొవ్వును కరిగించడంలో మనకు దోహదపడుతుంది. అల్పాహారంలో భాగంగా ఉదయంపూట గుడ్డును తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో మనం తీసుకునే ఆహార పరిమాణం తగ్గుతుంది. అంతేకాకుండా గుడ్డును తీసుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. పాలకూర, కాలే, ఇతర ఆకుకూరలను తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. వీటిలో క్యాలరీలు కూడా తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కొవ్వు నిల్వలు తగ్గడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఇలా ఫైబర్, ప్రోటీన్, పోషకాలు ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు వేగంగా కరుగుతుంది. శరీర బరువు అదుపులో ఉంటుంది. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల శరీర మొత్తం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.