Asthma | చలికాలంలో ఎక్కువగా వేధించే అనారోగ్య సమస్యల్లో ఆస్తమా కూడా ఒకటి. ఆస్తమాతో బాధపడే వారిలో ఊపిరితిత్తుల వాయు మార్గాలు మూసుకుపోయి శ్వాస తీసుకోవడం మరింత ఇబ్బందిగా ఉంటుంది. చలికాలంలో ఈ సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. పిల్లలల్లో ఈ సమస్యను మరీ ఎక్కువగా చూడవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం దాదాపు 235 మిలియన్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. పర్యావరణ కాలుష్యం, ఊబకాయం, ఒత్తిడి, కల్తీ ఆహారాన్ని తీసుకోవడం, అలర్జీ, జన్యుపరమైన కారణాల వల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఆస్తమాతో బాధపడే వారు తప్పకుండా వైద్యుల సహాయాన్ని తీసుకోవాల్సిందే. మందులను వాడడంతో పాటు మనం తీసుకునే ఆహార విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఆస్తమాను, దాని లక్షణాలను, తీవ్రతను తగ్గించే ఆహారాన్ని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఆస్తమాతో బాధపడే వారు పలు రకాల ఆహారాలను రోజూ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
వెల్లుల్లి, ఉల్లిపాయలల్లో యాంటీ బయాటిక్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు బలంగా తయారవుతాయి. ఊపిరితిత్తులల్లో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ సాఫీగా సాగుతుంది. ఉల్లిపాయల్లో శక్తివంతమైన క్వెర్సెటిన్ అనే శోథ నిరోధక సమ్మేళనం ఉంటుంది. ఇది అలర్జీల నుండి ఉపశమనాన్ని అందించడంలో సహాయపడుతుంది. ఆస్తమాతో బాధపడే వారు వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మెగ్నీషియం శ్వాసకోశ కండరాలను కదలించగలదని వైద్యులు చెబుతున్నారు. మెగ్నీషియం లోపించడం వల్ల ఆస్తమా ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది. కనుక మెగ్నీషియం కలిగిన ఆహారాలను తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ముదురు ఆకుపచ్చ ఆకుకూరలు, గుమ్మడి గింజలు, అంజీర్, జీడిపప్పు, డార్క్ చాక్లెట్ వంటి వాటిల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది.
శక్తివంతమైన, ఆరోగ్యకరమైన ఆహారాల్లో అవిసె గింజలు ఒకటి. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. వేయించిన అవిసె గింజలు లేదా సాధారణ అవిసె గింజల నూనెను 2 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆస్తమా కూడా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. విటమిన్ డి లోపం కూడా ఊపిరితిత్తుల పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుంది. కనుక ఆస్తమాతో బాధపడే వారు శరీరంలో విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలి. రోజూ శరీరానికి సూర్యకాంతి తగిలేలా చూసుకోవాలి. విటమిన్ డి సప్లిమెంట్స్ ను వాడాలి. అలాగే విటమిన్ సి వాయుమార్గాల్లో తాపజనక ప్రతిస్పందనలను, ఊపిరితీసుకోవడంలో ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుంది. కనుక విటమిన్ సి ఎక్కువగా ఉండే మామిడి, జామ, టమాట, బొప్పాయి, నారింజ, ఉసిరి వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
దీన్ని చైనీస్ వైద్యంలో ఎక్కువగా వాడతారు. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడానికి, శ్వాస నాళాల్లో స్రావాలను తగ్గించడానికి, శరీరానికి బలాన్ని చేకూర్చడానికి దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అతిమధురం వేళ్లతో చేసిన టీ శ్వాసనాళాల మార్గాలను సడలించడంలో సహాయపడుతుంది. అలాగే పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉండే కర్కుమిన్ శ్వాసనాళాలను ప్రభావితం చేస్తుంది. రక్తనాళాలను విస్తరించి గాలి ప్రసరణను మెరుగుపరచడంలో పసుపు సహాయపడుతుంది. ఎల్వోఎక్స్, సీవోఎక్స్ 2 అనే ఇన్ఫ్లామేటరీ ఎంజైమ్ ల పనితీరును కూడా పసుపు తగ్గిస్తుంది. ఒక గ్లాస్ నీటిలో పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ మిరియాల పొడి కలిపి పరగడుపున తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శ్వాసకోస రుగ్మతల నుండి ఉపశమనం కలుగుతుంది. ఆస్తమాతో బాధపడే వారు మందులను వాడడంతో పాటు ఈ ఆహారాలను తీసుకునే ప్రయత్నం చేయాలి. వీటిని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. తీవ్రమైన ఆస్తమా నుండి ఉపశమనం కలుగుతుంది.