Ginger Milk | అల్లంను మనం నిత్యం అనేక రకాల వంటల్లో వేస్తూనే ఉంటాం. ముఖ్యంగా మసాల వంటకాల్లో అల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అల్లంను వేయడం వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. ఆయుర్వేద ప్రకారం అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. కనుక అల్లాన్ని నేరుగా తినమని లేదా అల్లం రసం సేవించాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే అల్లం ఘాటుగా ఉంటుంది కనుక దీన్ని కొందరు నేరుగా తినలేరు. కానీ అల్లాన్ని పాలలో వేసి మరిగించి కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నా కూడా ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అల్లం, పాలు కాంబినేషన్ చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ మిశ్రమం అనేక లాభాలను అందిస్తుంది. అల్లం పాలను రోజూ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పలు వ్యాధులు సైతం అవుతాయి.
అల్లంలో శక్తివంతమైన కార్మినేటివ్ గుణాలు ఉంటాయి. అందువల్ల అల్లం పాలను సేవిస్తుంటే జీర్ణాశయ ఎంజైమ్లు, జీర్ణ రసాలు ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అజీర్తి తగ్గుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. పొట్టలో ఉండే అసౌకర్యం తొలగిపోతుంది. అల్లంలో జింజరాల్ అనే శక్తివంతమైన బయో యాక్టివ్ సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ ఫ్లామేటరీ కారకంగా పనిచేస్తుంది. దీని వల్ల శరీరంలోని వాపులను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఒళ్లు నొప్పుల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. ఈ సీజన్లో చాలా మందికి దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు వస్తుంటాయి. వాతావరణం చల్లగా ఉండడం వల్ల ఈ సమస్యలు వస్తాయి. కానీ అల్లం వల్ల ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అల్లం పాలను తాగుతుంటే గొంతులో గరగర, గొంతు సమస్యలు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ముక్కు దిబ్బడ తొలగిపోతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.
అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న కారణంగా అల్లం పాలను సేవిస్తుంటే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారి రోగాలు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. వికారంగా ఉండడం, వాంతికి వచ్చినట్లు అనిపించడం, ప్రయాణాల్లో వాంతులు అవడం వంటి సమస్యలు ఉన్నవారు అల్లం పాలను తాగుతుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఈ పాలను తాగడం వల్ల నిద్రలేమి సైతం తగ్గిపోతుంది. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ నిద్రను ప్రేరేపిస్తుంది. కనుక రాత్రి పూట ఈ పాలను తాగితే ఎంతో మేలు జరుగుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. అల్లం పాలను రోజూ సేవిస్తుంటే కొలెస్ట్రాల్ లెవల్స్, బీపీ తగ్గుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మిశ్రమంలో ఉండే పొటాషియం బీపీని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇక అల్లం పాలను చాలా సులభంగా తయారు చేయవచ్చు. అందుకు గాను ఒక పాత్రలో పాలను తీసుకుని అందులో తురిమిన అల్లం వేసి 4 నుంచి 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. అనంతరం అందులో నల్ల మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి వేయాలి. తరువాత స్టవ్ ఆర్పి పాత్రను దించుకోవాలి. అనంతరం అందులో బెల్లం పొడి వేసి బాగా కలపాలి. అవసరం అనుకుంటే అందులో డ్రై ఫ్రూట్స్ లేదా కుంకుమ పువ్వును కలుపుకోవచ్చు. దీంతో పాలు రుచిగా ఉంటాయి. ఇక అలా తయారైన అల్లం పాలను గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. అయితే అల్లంను తాజాగా ఉండేలా చూసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరీ అతిగా మరిగించకూడదు. అవసరం అనుకుంటే యాలకుల పొడి కూడా కలుపుకోవచ్చు. ఇక పొట్టలో ఎల్లప్పుడూ అసౌకర్యంగా ఉండేవారు, విరేచనాలు అవుతున్నవారు, రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడుతున్న వారు, అలర్జీలు ఉన్నవారు, గర్భిణీలు, మొటిమలు, ఇతర చర్మ సమస్యలు ఉన్నవారు ఈ పాలను తాగకూడదు.