Weight Loss | ప్రస్తుతం భారతీయులు అధికంగా ఎదుర్కొంటున్న సమస్యల ఊబకాయం ఒకటి. ముఖ్యంగా మహిళలు, పిల్లల్లో ఈ ఊబకాయం రేటు ఎక్కువగా ఉండడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. భారతీయ మహిళల్లో 24 %, పిల్లల్లో 23% మంది అధిక బరువుతో బాధపడుతున్నారని గణంకాలు తెలియజేస్తున్నాయి. నూనెలో వేయించిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల ఊబకాయం సమస్య తలెత్తుతోంది. ఊబకాయం మొత్తం శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఊబకాయం కారణంగా రక్తపోటు, గుండె సమస్యలు, డయాబెటిస్, హార్మోన్ల అసమతుల్యత వంటి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కనుక మనం శరీర బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
బరువు తగ్గడానికి ముందుగా మనం చేసేది వ్యాయామం. దీనితో పాటు క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం, కొవ్వును కరిగించే పానీయాలను తీసుకోవడం, శరీరంలో జీవక్రియలను పెంచే ఆహారాలను తీసుకోవడం వంటివి చేయాలి. వీటితో పాటు ఇప్పుడు చెప్పే కొన్ని చిట్కాలను పాటించాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఆరోగ్యకరంగా స్థిరమైన బరువును తగ్గవచ్చు. బరువు తగ్గడానికి ఉపయోగపడే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునే వారు ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సమయం ఆకలి అవ్వకుండా ఉంటుంది. తద్వారా మనం తక్కువ ఆహారాన్ని తీసుకోగలుగుతాం.
అలాగే చక్కెర కలిగిన ఆహారాలను తక్కువగా తీసుకోవాలి. నూనెలో వేయించిన ఆహారాలను, ప్రాసెస్ చేసిన ఆహారాలను, ప్యాక్ చేసిన స్నాక్స్ ను తక్కువగా తీసుకోవాలి. అసలు బరువు తగ్గాలనుకునే వారు వీటిని మొత్తానికి తీసుకోకపోవడమే మంచిది. అలాగే శరీరాన్ని ప్రతిరోజూ కదిలిస్తూ ఉండాలి. నడక, యోగా వంటి వాటితో పాటు సరళమైన వ్యాయామాలు చేయాలి. శరీరానికి తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలి. అంతేకాకుండా రాత్రిపూట తగినంత నిద్ర పోయేలా చూసుకోవాలి. నిద్రలేమి ఆకలి హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. రాత్రి సరిగ్గా నిద్రించకపోవడం వల్ల మరుసటి రోజు ఆకలి ఎక్కువగా అవుతుంది.
నిద్రలేమి బరువు తగ్గడాన్ని కష్టతరం చేస్తుంది. కనుక రోజూ తగినంత నిద్ర అనగా 6 నుండి 8 గంటల నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. అలాగే బరువు తగ్గడానికి క్విక్ డైట్స్ కు బదులుగా దీర్ఘకాలం పాటు ఉండే ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలి. ఇలాంటి అలవాట్లను పాటించడం వల్ల మనం దీర్ఘకాలం పాటు శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు. పైన తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల మనం ఊబకాయం సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఊబకాయం మనం తీసుకునే ఆహారంతోనే కాకుండా మన నిద్ర, ఒత్తిడి, హార్మోన్లు, జన్యుపరమైన కారణాల వల్ల కూడా తలెత్తే అవకాశం ఉంది. కనుక మనం మన జీవనశైలిని కూడా తప్పకుండా మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.