Polished Rice | ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి బియ్యమే ప్రధాన ఆహారంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆసియా దేశాల వారు బియ్యాన్ని అధికంగా తింటారు. అయితే బియ్యం పేరు చెబితే అందరికీ తెల్లగా పాలిష్ చేయబడిన బియ్యమే గుర్తుకు వస్తాయి. చాలా మంది బియ్యం తెల్లగా ఉంటే కానీ తినరు. బియ్యాన్ని యంత్రాల్లో అనేక మార్లు పాలిష్ చేసి మీద ఉండే పొట్టు చాలా వరకు పోయేలా చేస్తారు. దీంతో బియ్యం తెల్లగా మారి మెరుస్తుంది. అయితే వాస్తవానికి ఇలా పాలిష్ చేయబడిన బియ్యాన్ని తినడం మంచిది కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పూర్వ కాలంలో చాలా మంది దంపుడు బియ్యాన్నే తినేవారు. కానీ దాని స్థానంలో పాలిష్ బియ్యం వచ్చి చేరింది. ఇది అనేక దుష్పరిణామాలను కలిగిస్తుందని వారు అంటున్నారు.
పాలిష్ చేయబడిన బియ్యంలో ఫైబర్ ఉండదు. బియ్యంపై పొట్టును పూర్తిగా తొలగిస్తారు. కనుక ఫైబర్ కూడా పొట్టుతోపాటే పోతుంది. అలాంటి బియ్యాన్ని తింటే మనకు ఫైబర్ అసలు లభించదు. దీంతో పాలిష్ చేయబడిన బియ్యాన్ని తింటే జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా తిన్న అన్నం సరిగ్గా జీర్ణం కాదు. మలబద్దకం ఏర్పడుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను కలగజేస్తుంది. జీర్ణాశయం ఎల్లప్పుడూ నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. పొట్టలో అసౌకర్యం కూడా ఏర్పడుతుంది. పాలిష్ చేయబడిన బియ్యంలో బి విటమిన్లు ఉండవు. అనేక బి విటమిన్లతోపాటు ఐరన్, మెగ్నిషియం, జింక్ వంటి మినరల్స్‌ను కూడా కోల్పోతాం. అలాగే పాలిష్ చేయబడిన బియ్యంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండవు. బియ్యాన్ని పాలిష్ చేయడం వల్ల పొట్టులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లను కూడా కోల్పోతాము.
పాలిష్ చేయబడిన బియ్యాన్ని తింటే అనేక పోషకాలు లభించవు. కనుక పోషకాహార లోపం తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విటమిన్ బి1, బి3లతోపాటు ఐరన్, జింక్ లోపం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. దీని వల్ల రోగ నిరోధక శక్తి సైతం తగ్గుతుంది. వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి పాలిష్ చేయబడిన బియ్యం పరోక్షంగా రోగాలకు కారణమవుతుందని ఈ విషయం ద్వారా స్పష్టమవుతుంది. పాలిష్ చేయబడిన బియ్యం డయాబెటిస్ ఉన్నవారికి అసలు ఏమాత్రం మంచిది కాదు. ఈ బియ్యం గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ అధికంగా ఉంటుంది. దీన్ని అన్నంగా చేసి తింటే రక్తంలో షుగర్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి. ఇది మధుమేహం ఉన్నవారికి కీడు చేస్తుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు పాలిష్ చేయబడిన బియ్యాన్ని ఎట్టి పరిస్థితిలోనూ తినకూడదు.
పాలిష్ చేయబడిన బియ్యాన్ని తింటే అధికంగా బరువు పెరుగుతారు. ఫైబర్ ఉండదు కనుక తిన్న అన్నం మొత్తం మన శరీరంలో కొవ్వుగా మారుతుంది. దీంతో బరువు పెరిగి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గుండె జబ్బులకు కూడా దారి తీస్తుంది. పాలిష్ చేయబడిన బియ్యంలో ఆర్సెనిక్ స్థాయిలు అధికంగా ఉంటాయి. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ఇలాంటి బియ్యాన్ని తింటే శరీరంలో టాక్సిన్లు చేరుతాయి. ఇది క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కలగజేస్తుంది. కనుక పాలిష్ చేయబడిన బియ్యాన్ని అసలు తినకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యం కోసం బ్రౌన్ రైస్‌ను తినాలి. లేదా సింగిల్ పాలిష్ రైస్‌ను కూడా తినవచ్చు. దీంతో అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.