Noodles | ఆఫీసుకు టైమ్ అవుతుందనో, స్కూల్ లేదా కాలేజీకి వెళ్లాలనో, పని ఉందని త్వరగా వెళ్లాలని చెప్పి చాలా మంది ఉదయం సరిగ్గా బ్రేక్ ఫాస్ట్ చేయడం లేదు. బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు కూడా సరిగ్గా సమయం ఉండడం లేదని చాలా మంది చెబుతుంటారు. దీంతో 2 నిమిషాల్లో అయ్యే నూడుల్స్ వంటి ఆహారాలను ఉదయం చాలా మంది తింటున్నారు. ఇవే కాకుండా జంక్ ఫుడ్‌ను ఉదయమే ఎక్కువగా లాగించేస్తున్నారు. రెడీ టు ఈట్ ఫుడ్స్‌ను కూడా ఉదయం తింటున్నారు. అయితే ఇలాంటి ఆహారాలను తినడం అంత మంచిది కాదని, దీర్ఘకాలంలో ఇలాంటి ఆహారాలు మన శరీరంపై నెగెటివ్ ప్రభావాన్ని చూపుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది నూడుల్స్‌ను ఉదయం అధికంగా తింటుంటారు. అలాగే సాయంత్రం సమయంలోనూ బయట నూడుల్స్‌ను ఫాస్ట్ ఫుడ్ బండ్ల వద్ద లాగించేస్తుంటారు. నూడుల్స్ మన ఆరోగ్యానికి అత్యంత హానికరం అని, వీటిని తింటే పలు వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
నూడుల్స్‌లో సోడియం అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే శరీరంలో సోడియం స్థాయిలు పెరుగుతాయి. ఇది బీపీని పెంచుతుంది. దీంతో గుండె జబ్బులు లేదా హార్ట్ స్ట్రోక్స్ వచ్చే చాన్స్‌లు ఉంటాయి. సోడియం ఉండే ఆహారాలను తరచూ తినడం వల్ల శరీరంలో నీరు అధికంగా చేరుతుంది. శరీర భాగాలు వాపులకు గురవుతాయి. దీంతో ఆయా భాగాల్లో నొప్పులు కూడా వస్తాయి. నూడుల్స్‌లో ఎలాంటి పోషకాలు ఉండవు. అంతా చెత్తతో సమానం. వీటిని తినడం వల్ల శరీరంలో అనవసరంగా వ్యర్థాలు పేరుకుపోతాయి. వాటిని బయటకు పంపేందుకు శరీరం తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. పోషకాలు లేని ఆహారం తినడం వల్ల పోషకాల లోపం కూడా వస్తుంది. ఇది మరిన్ని అనారోగ్య సమస్యలను కలగజేస్తుంది.
నూడుల్స్‌ను సాధారణంగా పామ్ ఆయిల్ లేదా నాసిరకమైన ఆయిల్స్‌లో ఫ్రై చేసి తయారు చేస్తారు. ఇవి అనారోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ వీటిలో అధికంగా ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో హాని చేస్తాయి. నూడుల్స్‌ను తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగిపోతాయి. అధికంగా బరువు పెరుగుతారు. దీంతో గుండె జబ్బులు లేదా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నూడుల్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు వాటిల్లో ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ పదార్థాలను కలుపుతారు. ఇవి మన శరీరంపై నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. తరచూ ఇవి మన శరీరంలోకి వెళ్తే ప్రమాదం సంభవిస్తుంది. క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
అధ్యయనాలు చెబుతున్న ప్రకారం నూడుల్స్‌ను తరచూ తినడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ అనే వ్యాధి వస్తుంది. దీని వల్ల బీపీ పెరుగుతుంది. షుగర్ లెవల్స్ నియంత్రణ తప్పుతాయి. శరీరంలో కొవ్వు అధికంగా చేరుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. నూడుల్స్ గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా పెరుగుతాయి. దీర్ఘకాలంలో ఇది టైప్ 2 డయాబెటిస్‌కు దారి తీస్తుంది. షుగర్ వచ్చేందుకు కారణం అవుతుంది. నూడుల్స్‌లో ఫైబర్ ఉండదు. అందువల్ల వీటిని తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మలబద్దకం ఏర్పడుతుంది. అలాగే విరేచనం సాఫీగా అవక పొట్టలో అసౌకర్యం ఏర్పడుతుంది. నూడుల్స్‌ను తినడం వల్ల ఇలా అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక వీటిని తినడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.