Chinese Fast Food | ప్రస్తుతం నడుస్తున్నది అంతా ఫాస్ట్ యుగంగా మారింది. ప్రజలు అన్నింట్లోనూ వేగాన్ని కోరుకుంటున్నారు. తమ పనులు వేగంగా జరగాలని ఆశిస్తున్నారు. అందులో భాగంగానే ఆహారం విషయంలోనూ వారు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ ను తీసుకుంటున్నారు. సమయం ఉండడం లేదని లేదా వంట చేయలేదని చాలా మంది బయటకు వెళ్లి ఫాస్ట్ ఫుడ్స్‌ను లాగించేస్తున్నారు. ఫ్రైడ్ రైస్, మంచూరియా, నూడుల్స్ వంటి చైనీస్ ఫాస్ట్ ఫుడ్‌ను తినడం ఎక్కువైపోయింది. అయితే ఈ ఫుడ్స్‌ను ఎప్పుడో ఒకసారి తింటే ఫర్వాలేదు. శరీరానికి కలిగే హాని ఏమీ ఉండదు. కానీ చాలా మంది ఫాస్ట్ ఫుడ్స్‌ను తరచూ తింటున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా హాని చేస్తుందని, అనేక వ్యాధులను, అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్‌ను తరచూ తినే వారు జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు.
ప్రస్తుతం మనకు బయట ఎక్కడ చూసినా ఫాస్ట్ ఫుడ్ చాలా ఎక్కువగా అందుబాటులో ఉంటోంది. రహదారుల పక్కన చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎక్కువగా వెలుస్తున్నాయి. వాటిల్లో అనేక రకాల ఫాస్ట్ ఫుడ్స్ ను విక్రయిస్తున్నారు. ఆ ఫుడ్స్ అన్నీ ఎంతో రుచిగా ఉంటాయి. వాటిని వండేటప్పుడు వచ్చే వాసనకే చాలా మంది ఫిదా అవుతుంటారు. దీంతో వారు ఆ ఫుడ్స్‌ను తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. ఫాస్ట్ ఫుడ్స్ వాసన చూస్తేనే కొందరికి నోట్లో నీళ్లూరతాయి. అయితే ఫాస్ట్ ఫుడ్స్ ను తరచూ తినడం వల్ల అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయి. ఫాస్ట్ ఫుడ్ లో అజినొమోటో కలుపుతారు. అందువల్లే ఆ ఫుడ్స్‌కు అంతటి టేస్ట్ వస్తుంది. వాస్తవానికి దీన్ని ఆహారాల్లో వాడకూడదని ఎప్పుడో నిషేధం విధించారు. కానీ ఈ రూల్‌ను చాలా మంది పాటించడం లేదు. విచ్చల విడిగా అజినొమోటోను వాడుతున్నారు. ఇది మన ఆరోగ్యానికి తీవ్రంగా హాని చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అజినొమోటోనే మోనో సోడియం గ్లూటమేట్ అని లేదా ఎంఎస్‌జీ లేదా టేస్టింగ్ సాల్ట్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. దీన్ని వేయడం వల్ల వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే ఇది ప్రమాదకరమైన రసాయనం అని, దీన్ని తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అజినొమోటోలో 12.3 శాతం వరకు సోడియం ఉంటుంది. 21.1 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం, 0.4 మిల్లీగ్రాముల మేర ఐరన్ ఉంటాయి. అయితే సోడియం అధికంగా ఉంటుంది కనుక అజినొమోటో ఆరోగ్యకరమైనది కాదు. ఇది మన శరీరంలో చేరినప్పుడు అనారోగ్య సమస్యలను కలగజేస్తుంది. మనకు వ్యాధులు వచ్చేలా చేస్తుంది.
అజినొమోటోను అధికంగా తీసుకుంటే శరీరంలో సోడియం ఎక్కువగా చేరుతుంది. ఇది కిడ్నీలపై భారం పెంచుతుంది. దీంతో కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే సోడియం వల్ల రక్త నాళాలపై ఒత్తిడి పడుతుంది. దీంతో బీపీ పెరుగుతుంది. హైబీపీకి ఇది దారి తీస్తుంది. గుండె పనితీరు మందగిస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అజినొమోటో వల్ల శరీరంలో సోడియం అధికమై చెమట అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీంతో చెమట పట్టినప్పుడు శరీరం దుర్వాసన వస్తుంది. అలాగే అలసట, డీహైడ్రేషన్, కీళ్లు, కండరాల నొప్పులు, జీర్ణాశయంలో మంట, గ్యాస్, అసిడిటీ, బీపీ, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. ఇలా అజినొమోటో మనకు ఎంతో కీడు చేస్తుంది. కనుక అది ఉండే ఫాస్ట్ ఫుడ్స్‌ను అతిగా తినడం తగ్గించాలి. లేదంటే అనవసరంగా రోగాల బారిన పడాల్సి ఉంటుంది.