Blackheads | మనలో చాలా మంది బ్లాక్ హెడ్స్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. వీటి వల్ల ముఖ అందం తగ్గుతుందనే చెప్పవచ్చు. ఇవి ఎక్కువగా జిడ్డు చర్మం ఉన్న వారిలో వస్తూ ఉంటాయి. అలాగే ఆరుబయట ఎక్కువగా తిరిగే వారిలో ఇవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాతావరణ కాలుష్యం, దుమ్ము, ధూళి వంటి వాటిని బ్లాక్ హెడ్స్ రావడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. చర్మ రంధ్రాల్లో నూనె, మృతకణాలు సహజంగానే పేరుకుపోతాయి. వీటికి గాలి తగలడం వల్ల నల్లగా మారి బ్లాక్ హెడ్స్ లాగా తయారవుతాయి. ఈ బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ముక్కు, నుదురు భాగాల్లో వస్తూ ఉంటాయి. చాలా మంది వీటిని తొలగించుకోవడానికి ఖరీదైన బ్యూటీ ట్రీట్మెంట్స్ ను తీసుకుంటారు. బ్యూటీ పార్లర్ కు వెళ్లే అవసరమే లేకుండా మనం ఇంట్లోనే చాలా సులభంగా ఈ బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చు. ఈ ఇంటి చిట్కాలను వాడడం వల్ల చర్మానికి కూడా ఎటువంటి హాని కలగదు.
బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో ముఖ్యంగా కోడిగుడ్డు తెల్లసొన మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ముందుగా కోడిగుడ్డు తెల్లసొనను ముఖానికి రాసుకోవాలి. తరువాత ముఖంపై టిష్యూ పేపర్ ను అంటించాలి. కళ్లు, ముక్కు రంధ్రాలు, నోరు వంటి భాగాల్లో కాకుండా మిగిలిన చర్మంపై టిష్యూ పేపర్ వేసి నెమ్మదిగా అద్దాలి. తరువాత టిష్యూ పేపర్ పై కూడా మరలా తెల్లసొనను లేయర్ గా రాసుకోవాలి. ఇది ఆరిన తరువాత నెమ్మదిగా టిష్యూ పేపర్ ను తొలగించాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. అలాగే ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను తీసుకుని అందులో నీటిని వేసి పేస్ట్ లాగా కలపాలి. దీనిని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాసి 3 నిమిషాల పాటు సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల బేకింగ్ సోడా స్క్రబ్ లాగా పనిచేసి బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్ వేసి అందులో కొద్దిగా తేనె వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాసి సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుని బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. అదే విధంగా బ్లాక్ హెడ్స్ తో బాధపడే వారు ముల్తానీ మట్టిని కూడా ఉపయోగించవచ్చు. ఒ గిన్నెలో తగినంత ముల్తానీ మట్టిని తీసుకుని అందులో రోజ్ వాటర్ వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుని పూర్తిగా ఆరే వరకు ఉంచాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై అధికంగా ఉండే నూనె తొలగిపోతుంది. దీంతో బ్లాక్ హెడ్స్ రాకుండా ఉంటాయి. దాల్చిన చెక్క పొడిలో తేనె కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.
ముఖానికి ఆవిరి పట్టడం వల్ల కూడా సమస్య తగ్గుతుంది. ముఖానికి 5 నిమిషాల పాటు ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. తరువాత ఏదైనా మాస్క్ వేసుకుని ఆరిన తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ ను సులభంగా తొలగించుకోవచ్చు. ఈవిధంగా సహజ చిట్కాలను ఉపయోగించి కూడా మనం బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చు. అయితే బ్లాక్ హెడ్స్ తో బాధపడే వారు వాటిని చేతులతో ఒత్తిడి కలిగించడం వంటిది చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వారానికి 2 నుండి 3 సార్లు మాత్రమే స్క్రబ్ చేయాలి. అతిగా స్క్రబ్ చేయడం వల్ల చర్మం దెబ్బతినే అవకాశం ఉంటుంది.