Idli | రోజూ అందరూ అనేక రకాల బ్రేక్‌ఫాస్ట్‌లను చేస్తుంటారు. కొందరు ఇడ్లీలను తింటే కొందరు దోశ లేదా పూరీలను, ఇంకొందరు ఉప్మా వంటివి తింటారు. అయితే సాధారణంగా చాలా మంది తినే అల్పాహారాల్లో ఇడ్లీలు ముందు వరుసలో ఉంటాయని చెప్పవచ్చు. వీటిని నూనె లేకుండా తయారు చేస్తారు. కనుక తేలిగ్గా జీర్ణమవుతాయి. చిన్నారులు, వృద్ధులకు కూడా ఇడ్లీలు సులభంగా జీర్ణమవుతాయి. కనుక ప్రయాణాల్లో ఉన్నప్పుడు కూడా చాలా మంది ఇడ్లీలను తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. ఇడ్లీ దక్షిణ భారత దేశ ప్రజలకు ప్రధానమైన అల్పాహారంగా ఉంది. బియ్యం, మినప్పప్పును ఉపయోగించి సాధారణంగా ఎవరైనా ఇడ్లీలను తయారు చేస్తారు. అయితే పలు ఇతర పదార్థాలను కూడా వీటి తయారీకి ఉపయోగిస్తారు.
ఇడ్లీని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్యులు సైతం పోషకాహారంగా చెబుతుంటారు. అందుకనే జ్వరం వచ్చిన వారికి కూడా ఇడ్లీ తినమని సూచిస్తుంటారు. ఇడ్లీలకు ఉపయోగించే పిండి రాత్రంతా బాగా పులుస్తుంది. అందుకనే ఇందులో ఔషధ విలువలు పెరుగుతాయి. ఈ పిండిలో ఉండే సాధారణ పిండి పదార్థాలు సంక్లిష్టమైన పిండి పదార్థాలుగా మారుతాయి. ఇవి మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇడ్లీలలో వాడే మినప్పప్పు వల్ల ఇందులో ఉండే ప్రోటీన్లు శరీరానికి లభిస్తాయి. ఇవి శరీరానికి శక్తిని అందించి ఉత్తేజంగా ఉండేలా చేస్తాయి. దీంతో చురుగ్గా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. నీరసం, అలసట తగ్గిపోతాయి. ఇడ్లీలను పూర్తిగా ఆవిరి మీద ఉడికిస్తారు. వీటి తయారీలో ఎలాంటి నూనెలను వాడరు. కనుక ఇడ్లీ చాలా ఆరోగ్యవంతమైన అల్పాహారమని చెప్పవచ్చు.
ఇడ్లీలో గ్లూటెన్ ఉండదు. కొందరికి గ్లూటెన్ సెన్సిటివిటీ ఉంటుంది. అలాంటి ఆహారాలను తింటే పొట్టలో అసౌకర్యం ఏర్పడుతుంది. కానీ ఇడ్లీల్లో గ్లూటెన్ ఉండని కారణంగా అలాంటి వారు కూడా వీటిని ఎలాంటి భయం లేకుండా తినవచ్చు. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇడ్లీలు చక్కని ఆహారంగా పరిగణించబడతాయి. ఇవి తేలిగ్గా జీర్ణం అవడమే కాదు, జీర్ణ సమస్యలు లేకుండా చేస్తాయి. ఇతర అల్పాహారాలతో పోలిస్తే ఇడ్లీల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే బియ్యం పిండితోకాకుండా చిరుధాన్యాలతో ఇడ్లీలను తయారు చేసి తింటే ఇంకా ఎక్కువ పోషకాలను పొందవచ్చు. అనేక బి విటమిన్లు లభిస్తాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాలు రాకుండా రక్షిస్తాయి. ఇడ్లీలలో మన జీర్ణ వ్యవస్థకు మంచి చేసే బ్యాక్టీరియా ఉంటుంది. కనుక ఇడ్లీలను ప్రో బయోటిక్ ఆహారంగా చెబుతారు. అందువల్ల ఇడ్లీలను తింటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది జీర్ణ సమస్యలు లేకుండా చూస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఒక ఇడ్లీని తింటే సుమారుగా 40 నుంచి 50 క్యాలరీలు లభిస్తాయి. కొవ్వు అసలే ఉండదు. కనుకు బరువు తగ్గాలని చూస్తున్నవారికి, బరువు నియంత్రణలో ఉండాలని అనుకునేవారికి ఇడ్లీలు చక్కని ఆహారంగా పనిచేస్తాయి. ఇడ్లీల గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. అయితే బియ్యం పిండి కాకుండా మిల్లెట్స్‌తో ఇడ్లీలను తయారు చేసి తింటే డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. అయితే ఇడ్లీలు ఆరోగ్యకరమే అయినప్పటికీ ప్రస్తుతం రెడీమేడ్ పిండి మార్కెట్లో లభిస్తుంది. దాని తయారీలో ఏయే పదార్థాలను ఉపయోగిస్తారో తెలియదు. కనుక అలాంటి పిండిని వాడకూడదు. ఇంట్లో సహజసిద్ధంగా తయారు చేసుకున్న పిండి అయితేనే మంచిది. ఇడ్లీలకు వాడే పిండి పులిసి ఉంటుంది. కనుక కొందరికి ఇడ్లీలను తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారు ఇడ్లీలను తినకూడదు.