Beard | కాస్తంత గడ్డం పెరిగితే చాలు.. చాలా మంది పురుషులు వెంటనే షేవ్ చేయడమో లేదా ట్రిమ్ చేయడమో చేస్తుంటారు. ఆఫీసుల్లో పనిచేసేవారు అయితే కచ్చితంగా క్లీన్ షేవ్‌తోనే ఉంటారు. ఎందుకంటే ఆఫీస్‌లో తమను చూసే వారికి కాస్త డిగ్నిఫైడ్‌గా కనిపించాలని, మాస్ లుక్‌తో కనిపించవద్దనే ఉద్దేశంతో ఉద్యోగులు చాలా వరకు క్లీన్ షేవ్ చేసుకుంటారు. అలాగే సినిమా హీరోలు సినిమాల కోసం అవసరం అయితే తప్ప సాధారణంగా క్లీన్ లుక్‌లోనే కనిపిస్తుంటారు. రాజకీయ నాయకులు కూడా గడ్డం ఎక్కువగా పెంచరు. ఎవరో ఒకరు, ఇద్దరు తప్ప. అయితే సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం గడ్డాన్ని క్లీన్‌గా షేవ్ చేయకూడదని చెబుతున్నారు. గడ్డాన్ని ఎంతో కొంత ఉంచుకుంటేనే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు.
గడ్డాన్ని బాగా పెంచుకునే పురుషులు లేదా క్లీన్ షేవ్ చేసేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. గడ్డం ఉండడం వల్ల సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత (అల్ట్రా వయొలెట్) కిరణాల నుంచి సహజసిద్ధంగా రక్షణ లభిస్తుంది. ఆ కిరణాలను అడ్డుకునే సహజసిద్ధమైన అడ్డుకట్టగా గడ్డం పనిచేస్తుంది. దీంతో సూర్య కిరణాల నుంచి చర్మం సంరక్షించబడుతుంది. సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలను గడ్డం 95 శాతం వరకు అడ్డుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. దీని వల్ల ఎండ కారణంగా చర్మం కందిపోకుండా సురక్షితంగా ఉండవచ్చు. అలాగే చర్మానికి జరిగే నష్టం నివారించబడుతుంది.
గడ్డం లేని వారితో పోలిస్తే గడ్బం ఉన్నవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. గడ్డం వల్ల పురుషుల్లో చర్మ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుందని అంటున్నారు. గడ్డం ఉండడం వల్ల గాలిలో ఉండే అనేక కాలుష్య కారకాలు, దుమ్ము, ధూళి కణాలను ముక్కు లోపలకి వెళ్లకుండా చూసుకోవచ్చు. దీంతో గడ్డంలోనే అవి చిక్కకుంటాయి. ఫలితాంగా ఆస్తమా, అలర్జీలు, శ్వాస సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. అయితే రోజూ గడ్డాన్ని శుభ్రంగా ఉంచుకుంటేనే ఈ ప్రయోజనం కలుగుతుంది. లేదంటే శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలను ఆపడం కష్టమవుతుంది. కనుక గడ్డాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిందే.
చల్లని వాతావరణంలో ఉన్నప్పుడు ముఖం చాలా త్వరగా చల్లగా మారుతుంది. కానీ గడ్డం ఉండడం వల్ల ఇన్సులేషన్‌గా పనిచేస్తుంది. అంటే ముఖానికి వేడిని అందిస్తుందన్నమాట. దీంతో ముఖం త్వరగా చల్లగా మారదు. వేడిగా ఉంటుంది. దీని వల్ల శరీరం కూడా వెచ్చగా ఉంటుంది. అలాగే క్లీన్ షేవ్ చేయడం వల్ల గడ్డం ఉన్న ప్రాంతంలో బ్యాక్టీరియా, ఫంగస్ చేరి ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి. అదే గడ్డం ఉంటే ఆ ప్రాంతంలో చర్మం లోకి బ్యాక్టీరియా, ఫంగస్‌లు అంత త్వరగా చేరలేవు. దీని వల్ల ఇన్ఫెక్షన్లకు అడ్డుకట్ట వేయవచ్చు. అయితే గడ్డాన్ని తరచూ శుభ్రంగా ఉంచుకుంటేనే ఈ ప్రయోజనం కూడా కలుగుతుంది. ఇక గడ్డం ఉన్న చోట చర్మం నుంచి సహజసిద్ధమైన నూనెలు స్రవించబడతాయి. ఇవి గడ్డంతోపాటు ముఖాన్ని తేమగా ఉంచుతాయి. దీంతో ముఖం మృదువుగా మారి కాంతివంతంగా ఉంటుంది. చర్మం పొడిబారదు. ఇలా గడ్డాన్ని పెంచుకోవడం వల్ల పురుషులకు అనేక లాభాలు కలుగుతాయి.