తినే ఆహారంపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఇదే మాట కిడ్నీలకూ వర్తిస్తుంది. శరీరం నుంచి వ్యర్థాలను వడగట్టడం కిడ్నీల ప్రధాన విధి. కిడ్నీలు ప్రమాదంలో పడితే కండ్ల చుట్టూ ఉబ్బడం, మూత్ర విసర్జనలో ఇబ్బందులు, చేతులు, కాళ్లలో వాపులు తదితర సమస్యలు తలెత్తుతాయి. తగిన పోషకాహారంతో కిడ్నీలను పదిలంగా కాపాడుకోవచ్చు.
క్యాబేజి
కిడ్నీల మరమ్మతు, పోషణకు క్యాబేజి సాయపడుతుంది. దీనిలోని ఫైటోకెమికల్స్ మూత్రపిండాల పనితనాన్ని మెరుగు పరుస్తాయి. క్యాబేజీలో వివిధ విటమిన్లు, ఫైబర్, ఫోలిక్ యాసిడ్ పుష్కలం.
చేపలు
వీటిలోని ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కిడ్నీలను సంరక్షిస్తాయి. మూత్రపిండ సమస్యలు ఉన్నవాళ్లు సాల్మన్, మెకరెల్, హెరింగ్, ట్యునా జాతి చేపలను తినాలని చెబుతారు నిపుణులు.
బెర్రీపండ్లు
బెర్రీ జాతి పండ్లు మెగ్నీషియం, విటమిన్-సి, ఫైబర్, ఫోలేట్ గనులు. స్ట్రాబెర్రీ, క్రాన్బెర్రీ, రాస్బెర్రీ, బ్లూబెర్రీ కిడ్నీలకు మేలుచేస్తాయి. వీటిలోని యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీఆక్సిడెంట్లు ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. మూత్రాశయం పనితీరును మెరుగుపరుస్తాయి.
వెల్లుల్లి
దీన్లోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ క్లాటింగ్ లక్షణాలు కిడ్నీ రోగాలను సమర్థంగా తగ్గిస్తాయి. వెల్లుల్లిని తురుముగాను, పొడిగాను వంటల్లో వాడుకోవచ్చు.
నిమ్మరసం
నిమ్మకాయలు, నిమ్మజాతి పండ్ల రసంలోని ఆమ్లాలు కిడ్నీల్లో రాళ్లను కరిగించి.. వాటి ఆరోగ్యానికి దోహదపడతాయి.
తెల్లసొన
కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు గుడ్డు తెల్లసొన తింటే మంచిది. ఇందులో ఫాస్ఫరస్ తక్కువగా, నాణ్యమైన ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు కిడ్నీలు సవ్యంగా పనిచేయడానికి అవసరమైన ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు కూడా పుష్కలం. పచ్చసొన మాత్రం తినకపోవడమే మంచిది.
యాపిల్
మలబద్ధకం నివారణకు, హృద్రోగాలపై పోరాటానికి, కంటిచూపు మెరుగుదలకు యాపిల్స్ దోహదపడతాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలం. కాబట్టి, కిడ్నీల ఆరోగ్యానికి దోహదపడతాయి. మంచి కొలెస్ట్రాల్ వృద్ధికి సహకరిస్తాయి.
క్యాలీఫ్లవర్
ఇందులో విటమిన్-సి, ఫోలేట్, ఫైబర్ సమృద్ధంగా ఉంటాయి. శరీరంలోని వ్యర్థాల ప్రభావాన్ని తగ్గించడంలో క్యాలీఫ్లవర్లో ఉండే ఎసెన్షియల్ కాంపౌండ్లు సహకరిస్తాయి.
ఎర్రద్రాక్ష
ఎర్రద్రాక్షలు ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయి. ఈ ఆమ్లాలు కిడ్నీలు, మూత్రనాళంలోని బ్యాక్టీరియా, ఇతర హానికర సూక్ష్మక్రిములను చంపేస్తాయి. కండరాలు రిలాక్స్ అవడానికి ఎర్రద్రాక్ష సహకరిస్తుంది. దాంతో శరీరంలో రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. వీటిలోని ఫ్లేవనాయిడ్లు క్యాన్సర్ నుంచి రక్షిస్తాయి.