పక్షవాతాన్ని పోలిన లక్షణాలు ఏ కొద్దిసేపో ఉంటే దానిని మినీ స్ట్రోక్ అంటారు. ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ (టీఐఏ) అని కూడా పిలుస్తారు. మెదడుకు తాత్కాలికంగా రక్త సరఫరా ఆగిపోవడం వల్ల మినీ స్ట్రోక్ సంభవిస్తుంది. సాధారణంగా కొద్ది నిమిషాలు మాత్రమే ఉండే ఈ రకమైన పక్షవాతం వల్ల దీర్ఘకాలిక దుష్ప్రభావాలు ఉండవు. కాకపోతే, మినీ స్ట్రోక్‌ను పక్షవాతానికి ఓ హెచ్చరికగా భావించాలి. వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. సత్వరమే చికిత్స తీసుకుంటే భవిష్యత్తులో పక్షవాతం రాకుండా నివారించుకునే అవకాశం ఉంటుంది.
మేయో క్లినిక్ వివరణ ప్రకారం మినీ స్ట్రోక్ (టీఐఏ) బారినపడిన ముగ్గురిలో ఒకరు తర్వాత కాలంలో పక్షవాతం బారినపడ్డారు. వీరిలో సగం మందికి టీఐఏ వచ్చిన ఒక్క ఏడాదిలోపే పక్షవాతం రావడం గమనార్హం. కాబట్టి, మినీ స్ట్రోక్ ఓ హెచ్చరిక మాత్రమే కాదు, పక్షవాతం రాకుండా నివారించుకోవడానికి లభించే ఓ అవకాశం కూడా! ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్‌కు సంబంధించిన కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం.
ఇలా శరీరంలో ఒకవైపే జరుగుతుంది. ముఖం, చేయి, కాలు ఏ అవయవమైనా సరే ఒకవైపే సమస్య ఉంటుంది. ఉదాహరణకు… ముఖం ఓవైపు వాలిపోయినట్టు అనిపిస్తుంది. చేతిలో తిమ్మిర్లు రావడం కానీ, బలం కోల్పోయినట్టుగా గానీ అనిపిస్తుంది. మెదడులో కొన్ని భాగాలకు తాత్కాలికంగా రక్త ప్రవాహం తగ్గడంతో ఇలా జరుగుతుంది. దీంతో కండరాల
కదలికపై మెదడు అదుపు కోల్పోతుంది.
మాట్లాడుతుంటే అకస్మాత్తుగా తడబడినట్టు, అస్పష్టంగా ఉంటాయి. అంతేకాకుండా తమకు ఏం జరుగుతుందో మాత్రం తెలుస్తున్నప్పటికీ, ఇతరులు మాట్లాడేది అర్థం కాకపోవచ్చు. మెదడులో భాషను అర్థం చేసుకునే భాగానికి తాత్కాలికంగా రక్త ప్రవాహంలో ఆటంకం వల్ల ఇలా జరుగుతుంది.
మసక మసగ్గా కనిపించడం, రెండుగా కనిపించడం, అకస్మాత్తుగా అంధత్వం ఆవరించడం లాంటి కంటి సమస్యలు వస్తాయి. ఒక కన్నుకు జరగొచ్చు. రెండు కండ్లకూ ఉండొచ్చు. చూపును నియంత్రించే భాగానికి రక్తం సరఫరాలో ఆటంకం తలెత్తినప్పుడు ఈ పరిస్థితి దాపురిస్తుంది.
అకస్మాత్తుగా తల తిప్పడం, తలలో తేలికగా అనిపించడం, శరీరం సమతూకం కోల్పోవడం వల్ల నడవడం, నిల్చోవడం కష్టమైపోతాయి. అంటే శరీర కదలికలను నియంత్రించడానికి సరిపడా రక్త సరఫరా మెదడుకు అందడం లేదన్నమాట.
ఇతర లక్షణాల కంటే టీఐఏలో తలనొప్పి సమస్య చాలా తక్కువగా కనిపిస్తుంది. కొంతమంది మాత్రం కారణం తెలియకుండానే అకస్మాత్తుగా, తీవ్రమైన తలనొప్పి అనుభూతి చెందుతారు. మెదడుకు అకస్మాత్తుగా రక్త సరఫరా పడిపోవడం వల్ల ఇలా జరుగుతుంది.