Hypothyroidism @ Men | మన మెడ భాగంలో ఉండే గ్రంధి థైరాయిడ్. మెదడు, గుండె, కండరాలు, ఇతర అవయవాలు సక్రమంగా పని చేసేందుకు అవసరమైన హార్మోన్లను ఈ గ్రంధి ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ శరీరంలో జీవక్రియ, శక్తిస్థాయి, ఇతర విధులను నియంత్రించేందుకు బాధ్యత వహిస్తుంది. అయోడిన్ లోపం, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, జన్యుపరమైన లోపాలు, మధుమేహం వంటి వాటి వల్ల థైరాయిడ్‌లో అసమతుల్యత ఏర్పడుతుంది. అయితే, తగినంత థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయకపోయే పరిస్థితినే హైపోథైరాయిడిజం అంటారు. థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా మహిళల్లో కనిపిస్తున్నప్పటికీ.. పురుషుల్లో కూడా ప్రభావితం చేస్తుంది.
హైపోథైరాయిడిజం.. దీనినే అండర్ యాక్టీవ్ థైరాయిడ్ అని కూడా అంటారు. సాధారణంగా శారీరక, మానసిక శ్రేయస్సు క్షీణతను చూపుతుంది. కానీ, చాలా సమయంపాటు ఎలాంటి లక్షణాలు కనిపించవు. చాలా మందిలో హైపోథైరాయిడిజం లక్షణాలు సూక్ష్మంగా ఉంటాయి. నిర్దిష్టంగా ఉండవు. కొన్ని లక్షణాలు పురుషులు, స్త్రీలలో సాధారణంగా కనిపిస్తాయి. కాగా, కొన్ని లక్షణాలు మాత్రం పురుషుల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి.
హైపోథైరాయిడిజం లక్షణాలు..
ఆందోళన, చికాకు, బరువు తగ్గడం, కండరాల బలహీనత, కళ్ల చికాకు, మతిమరుపు వంటివి లక్షణాలు ఉంటాయి. అలాగే, చలికి అసహనంగా ఉంటారు. ముఖం, శరీరంలో కొంత భాగం ఉబ్బినట్లుగా ఉంటుంది. చెమట తగ్గిపోతుంది. చర్మం పొడిగా మారుతుంది. జుట్టు ఊడిపోతుంది. గొంతు బొంగురుపోతుంది. స్వరంలో మార్పులు కనిపిస్తాయి.
హైపోథైరాయిడిజం ఉన్న పురుషులు.. బరువు పెరగడం వల్ల అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌ని సూచిస్తూ అరచేతుల్లో జలదరింపు, తిమ్మిర్లు వేస్తుంటాయి. హైపో థైరాయిడిజంతో బాధపడుతున్న పురుషుల్లో వంధ్యత్వం, పునరుత్పత్తి వైఫల్యం కూడా ఒక లక్షణంగా ఉంటుంది. టెస్టోస్టెరాన్ వంటి పురుష సంతానోత్పత్తి హార్మోన్లు తగ్గుతాయి.
పురుషుల్లో హైపోథైరాయిడిజం డయాస్టొలిక్ హైపర్‌టెన్షన్ రూపంలో బీపీ హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. పెరిగిన కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి లిపిడ్ ప్రొఫైల్‌లలో మార్పులకు కారణమవుతుంది. గుండె చుట్టూ ద్రవం చేరడం (పెరికార్డియల్ ఎఫ్యూషన్), హృదయ స్పందన రేటు తగ్గడం, పాదాల్లో వాపు, నడుస్తున్నప్పుడు కాళ్లలో సమన్వయం లేకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి.
మైక్సెడెమా కోమా అనేది థైరాయిడ్ గ్రంధి చురుకైన పరిణామం. ఇది కొందరిలో ప్రాణాంతకం కావచ్చు. క్లినికల్ హైపోథైరాయిడిజం నిర్ధారణ అయిన వెంటనే చికిత్స చేయించుకోవడం చాలా ఉత్తమం.
ఎప్పుడు వైద్యుడ్ని కలవాలి..
అయోడిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తగ్గించాలి, జంక్ పుడ్ పూర్తిగా మానేయాలి. కాఫీ, టీ తాగకూడదు. స్పష్టమైన కారణం లేకుండా అలసిపోయినట్లుగా భావించిన సందర్భాల్లో వైద్యుడ్ని కలుసుకోవాలి. లేదా ఇతర హైపోథైరాయిడ్ లక్షణాలు ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించాలి. హైపోథైరాయిడిజం కోసం వాడే థైరాయిడ్ హార్మోన్ మందుల గురించి వైద్యుల సలహాలు తీసుకోవాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఇది అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్య నిపుణుడిని లేదా ఇంటి వైద్యుడిని సంప్రదించండి. ఈ కథనంతో ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదు.