మా పాపకు వారం రోజుల నుంచి దగ్గు, జ్వరంఆయాసం కూడా ఉంది. డాక్టరుకు చూపిస్తే న్యుమోనియాగా నిర్ధారించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు?
-ఓ పాఠకురాలు
న్యుమోనియా ఊపిరితిత్తులకు వచ్చే అంటువ్యాధి. ఊపిరితిత్తులకు గాలిని చేరవేసే చివరి నాళాలైన బ్రాంకియోల్స్.. ‘అల్వియోలై’ అనే చిన్న సంచి ఆకారంలో ఉండే భాగాలలోకి చేరుకుంటాయి. అల్వియోలైలో ఉండే రక్తనాళాలలో ప్రవహించే రక్తం, మనం పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్‌ను స్వీకరిస్తుంది. శరీరంలో నుంచి కార్బన్ డై ఆక్సైడ్‌ను విసర్జిస్తుంది. న్యుమోనియా వ్యాధితో అల్వియోలైలలో చీము, ఇతర ద్రవాలు చేరడం వల్ల ఆక్సిజన్ స్వీకరించడం తగ్గిపోతుంది.
కారణాలు: బ్యాక్టీరియా, వైరస్‌లతోపాటు కొన్నిసార్లు ఫంగస్, రసాయన పదార్థాల వల్ల కూడా న్యుమోనియా రావచ్చు. బ్యాక్టీరియాలో ప్రధానమైనవి స్ట్రెప్టోకాకస్ న్యుమోనియా, హెచ్. ఇన్ఫ్లుయెంజా, స్టఫైలోకాకస్. వైరస్లలో ముఖ్యమైనవి ఆర్ఎస్వి, ఇన్ఫ్లుయెంజా.
లక్షణాలు: బ్యాక్టీరియా వల్ల వచ్చే ఈ వ్యాధిలో లక్షణాలు అకస్మాత్తుగా ప్రారంభమై, తీవ్రం అవుతాయి. ముక్కు కారడం, జ్వరం, చలి, తల, ఛాతీ, కడుపు భాగాల్లో నొప్పి, దగ్గు, ఆకలి తగ్గిపోవడం, వాంతులు ప్రారంభ దశలో కనిపిస్తాయి. సరైన వైద్యం లభించకపోతే.. వ్యాధి ముదిరి ఆయాసం వస్తుంది. పాలు తాగలేకపోతారు. గాలి పీల్చేటప్పుడు ఛాతీ కిందిభాగం బయటికి రావడానికి బదులు లోనికి వెళ్లడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. చివరి దశలో స్పృహ కోల్పోవడం, ఫిట్స్ తదితర ఉపద్రవాలు ఎదురుకావచ్చు.
వ్యాప్తి: దగ్గు, తుమ్ముల కారణంగా లాలాజల బిందువుల ద్వారా సూక్ష్మజీవులు వ్యాపిస్తాయి. ఈ వ్యాధి వర్షాకాలం, చలికాలాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తల్లిపాలు తాగనివారిలో, ఆహార లోపాలు ఉన్నవారికి, మీజిల్స్ లాంటి వైరస్ వ్యాధి వచ్చినవారికి, కిక్కిరిసిన నివాసాలలో ఉండేవారికి, పొగ తాగే అలవాటు ఉన్న కుటుంబాలలో ఉండే పిల్లలకు ఈ వ్యాధి భయం ఎక్కువ.
వైద్యం: సకాలంలో వైద్యం లభించకపోతే.. మరణానికి దారి తీయవచ్చు. ముఖ్యంగా రెండు నెలలు నిండని, ఆహార లోపాలు ఉన్న శిశువులలో తీవ్రత ఎక్కువ. శిశువులలో శ్వాసక్రియ వేగాన్ని బట్టి వ్యాధి తీవ్రతను గుర్తించవచ్చు. రెండు నెలలు నిండని శిశువుల్లో శ్వాసక్రియ 60 కన్నా ఎక్కువ, రెండు నెలల నుంచి 12 నెలల వయసు పిల్లల్లో శ్వాసక్రియ 50 కన్నా ఎక్కువ, 12 నెలల నుంచి ఐదు సంవత్సరాల పిల్లల్లో శ్వాసక్రియ 40 కన్నా ఎక్కువ.. కనిపిస్తే వ్యాధి తీవ్రంగా ఉన్నట్లు. ఆ సమయంలో వైద్యుడు సూచించిన మందులను క్రమం తప్పకుండా, సరైన మోతాదులలో ఇవ్వాలి. తీవ్రత ఎక్కువైతే దవాఖానలో చేర్పించడం మంచిది. మందులు ప్రారంభించిన 2 నుంచి 4 రోజుల తరువాత వ్యాధి తగ్గడం గమనించవచ్చు.
సమస్యలు: వ్యాధిని ప్రథమ దశలో గుర్తించకపోతే అనేక సమస్యలు ఎదురుకావచ్చు. ఊపిరితిత్తులపై ఉండే రెండు పొరల మధ్య చీము చేరడం
(ఎంపైమా), ఊపిరితిత్తులలో చీము చేరడం
(ఆబ్సెస్), ఛాతీలో గాలి చేరడం(న్యూమోతొరాక్స్), గుండె రక్షణ పొరలలో చీము చేరడం.. ప్రమాద సంకేతాలు.
నివారణ: పిల్లల మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలంటే.. న్యుమోనియా, అతిసార వ్యాధు లను నివారించాలి. పుట్టిన పిల్లలందరికీ ఆరు నెలలు నిండే వరకు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి. ఆ తరువాత తల్లిపాలు కొనసాగిస్తూనే అదనపు ఆహారం ఇవ్వడం, ముఖ్యంగా కోరింత దగ్గు, క్షయవ్యాధి, హిబ్, న్యుమోకాకల్, ఇన్ఫ్లుయెంజా టీకా వేయించాలి. పోషకాహార లోపాలు, ప్రత్యేకించి జింక్, విటమిన్ ఎ లోపాలు నివారించాలి.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోగగ్రస్తులను పిల్లలకు దూరంగా ఉంచాలి.
డాక్టర్ కర్రా రమేశ్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు, సికింద్రాబాద్.