Artificial pregnancy | కొన్ని ఆలోచనలు అసాధ్యం అనిపిస్తాయి. వాటిని వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. కావాలంటే ఈ ప్రకటన చదవండి- ‘మీకు సంతానం లేదని విసిగిపోయారా! ఎలాంటి నొప్పీ లేకుండా పిల్లల్ని కనాలని అనుకుంటున్నారా? అందమైన, తెలివైన బిడ్డ కావాలని కోరుకుంటున్నారా? అయితే మమ్మల్ని సంప్రదించండి. 9 నెలల్లో పండంటి బిడ్డను అందిస్తాం. ఫోన్ ద్వారా నిరంతరం మీ శిశువు ఎదుగుదలను చూసుకునే వెసులుబాటు కూడా కలదు. ఈఎమ్ఐ సౌకర్యం కూడా ఉంది’. ఆశ్చర్యం, కోపం, అనుమానం లాంటి ఉద్వేగాలను కలిగించే ప్రకటన కదా ఇది! కాస్త నాటకీయంగా తోచినా, ఓ పదేండ్లలో ఇలాంటి మాటలు వినేందుకు సిద్ధమైపోండి. ఎందుకంటే కృత్రిమ గర్భధారణ అనూహ్యమైన మజిలీలను చేరుకోనుంది. ఆ దారిలో ఎన్నో సవాళ్లనూ ఎదుర్కోబోతున్నది.
అదే కనుక జరిగితే… మానవ జాతి ఇప్పటివరకూ చూసిన అత్యద్భుత ఆవిష్కరణ ఇదే కావచ్చు! లేదా సమాజపు తీరునే మార్చేసే మజిలీగానూ మారవచ్చు!! ఇంతకీ ఏమిటీ కృత్రిమ గర్భం, అందులో ప్రయోగాలు ఎంతవరకు వచ్చాయి, వాటిని అమలు చేయడం సాధ్యమేనా, ఇక సవాళ్ల సంగతేంటి… లాంటి ప్రశ్నలన్నింటికీ జవాబు తెలుసుకునే ప్రయత్నమిది.
గతఏడాది అమెరికాలోని ఆహార వైద్య విభాగం ఓ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నెలలు నిండకుండా పుట్టే పిల్లల్ని రక్షించేందుకు మార్గాలను అన్వేషించడమే దీని ఉద్దేశం. ఇప్పటివరకూ వెలుతురు, వేడి, ప్రాణవాయువులను అందించే ఇంక్యుబేటర్లలో ఉంచడమే ఏకైక పరిష్కారంగా ఉండేది. కానీ, అది తాత్కాలికం మాత్రమే, పరిమితులు అపరిమితం! అలా కాకుండా… పిండం వారాల తరబడి తల్లి గర్భం వెలుపలే తగిన పోషకాలు అందుకుంటూ బలపడేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి అన్నదే అక్కడి చర్చ.
అందుకు ‘బయో బ్యాగ్’ అనే జవాబు వినిపించింది. ఈ పరికరంలో ఉమ్మనీరు లాంటి ద్రవం ఉంటుంది. అందులో తేలుతూ ఉండే శిశువుకి, తన బొడ్డుతాడు ద్వారా ప్రాణవాయువుని, పోషకాలను అందిస్తారు. ఈ బయో బ్యాగ్ సూత్రం ఆధారంగానే ఫిలడెల్ఫియా పరిశోధకులు EXTEND అనే పరికరాన్ని రూపొందించారు. 300 గొర్రెపిల్లల మీద దీన్ని విజయవంతంగా ప్రయోగించారు కూడా! ఆస్ట్రేలియా, జపాన్ లాంటి దేశాల్లోనూ ఈ తరహా ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
ఈ ప్రయోగాలు చివరి దశకు చేరుకుంటే కనుక పిండాన్ని ఆరు నెలల వయసులోనే బయటకు తీయాల్సి వచ్చినా, దాని ఎదుగుదలలో ఎలాంటి అడ్డంకీ లేకుండా చూసుకోవచ్చు. ఇది కేవలం నెలలు నిండకుండా పుట్టే పిల్లలకు మాత్రమే ఎందుకు పరిమితం చేయాలి? అసలు ఇందులోనే పిల్లల్ని పెంచితే ఎలా ఉంటుంది అనే దిశగానూ ప్రయోగాలు జరుగుతున్నాయి.
తల్లి గర్భం బయటే శిశువు అన్న ఆలోచన కొత్తేమీ కాదు. పురాణాల్లో సైతం అలాంటి నేపథ్యాలు కనిపిస్తాయి. ఇప్పటి కాలంలో అయితే హాల్డేన్ అనే శాస్త్రవేత్త 1923లో దీని గురించి చర్చించడమే కాకుండా ఈ ప్రక్రియకు ‘ఎక్టోజెనెసిస్’ అనే పేరు పెట్టారు. అప్పట్లో అందరూ పరిశోధనల కోసం ఇండియా నుంచి పాశ్చాత్య దేశాలకు వెళ్తే… హాల్డేన్ లండన్ నుంచి ఇండియాకు వచ్చి స్థిరపడటం విశేషం. జన్యువులు, పునరుత్పత్తి, వ్యాధులు లాంటి ఎన్నో అంశాల మీద ఆయన అద్భుతమైన రీసెర్చ్ చేశారు.
1950ల నాటికి ఈ ‘ఎక్టోజెనెసిస్’ ఆలోచన ఓ ఆశగా మారింది. తల్లి కడుపులో శిశువుకు తగిన పోషకాలూ ప్రాణవాయువూ చేరాలి. ఉష్ణోగ్రత తగినంత ఉండాలి. ఎలాంటి ఇన్ఫెక్షన్లూ సోకకూడదు. వ్యర్థాలు బయటకు వెళ్లిపోవాలి. హార్మోన్లు అందాలి! ఓ హీటరు, డయాలసిస్ యంత్రం, ద్రవం నిండిన ట్యాంకు… వీటితో ఆ వాతావరణాన్ని సృష్టిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది గ్రీన్బర్గ్ అనే శాస్త్రవేత్తకు. అందుకు అనుగుణంగా ఓ పరికరాన్ని సృష్టించి పేటెంట్ కూడా అందుకున్నాడు. కానీ, ఇవన్నీ కూడా ఆచరణలో తేలిపోయాయి. టెస్ట్ ట్యూబ్ బేబీ అనే ప్రక్రియ వచ్చేదాకా కృత్రిమ గర్భం అనే మాట సిద్ధాంత స్థాయిలోనే ఉండిపోయింది.
Artificial Womb Facility
ఒక ప్రయోగశాలలో అండాన్ని, వీర్యకణాన్నీ కలపడం! అది ఫలదీకరణం అయిన తర్వాత గర్భంలోకి ప్రవేశపెట్టడం. సామాన్య భాషలో టెస్ట్ ట్యూబ్ బేబీగా చెప్పుకొనే ఈ In vitro fertilisation… అన్నది కృత్రిమ గర్భధారణ ఆలోచనలోనే తొలి విజయం. ఈ ప్రయోగానికి ఆద్యుడిగా రాబర్ట్ ఎడ్వర్డ్స్ అనే ఇంగ్లండ్ శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతి దక్కింది. ఆ దేశం సర్ బిరుదుతో గౌరవించుకుంది. ఆ ప్రక్రియ ద్వారా ఆయన సృష్టించిన లూయిస్ బ్రౌన్ అనే పాప లోకంలోనే తొలి టెస్ట్ ట్యూబ్ బేబీగా సంచలనం సృష్టించింది.
ఇప్పుడు ఇందుకు సమాంతరమైన మరో కథ వినండి! పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుభాష్ ముఖర్జీ పునరుత్పత్తి మీద రెండు డాక్టరేట్లు సాధించారు. పిల్లలు, కుటుంబ నియంత్రణ లాంటి విషయాల చుట్టూ ఎన్నో అపోహలు, మూఢనమ్మకాలు కమ్ముకున్న సమయంలో కృత్రిమ గర్భధారణ గురించి ఆలోచించారు. సంతానలేమి ఓ శాపం కాకూడదనే లక్ష్యంతో పరిశోధించారు. అరకొర వసతులతో రిఫ్రిజిరేటర్ లాంటి పరికరాలతోనే In vitro fertilisation (ఇన్విట్రో ఫెర్టిలైజేషన్)ని సాధించారు. తరచూ ఏర్పడే విద్యుత్ కోతల మధ్య ఆ ఫ్రిడ్జ్ కూడా సరిగా పనిచేసేది కాదు.
ఓవైపు శాస్త్ర ప్రపంచంలో రాజకీయాలు, మరోవైపు ఎలాంటి సహకారం అందించని సాటి పరిశోధకుల మధ్యే దేశంలోనే తొలి టెస్ట్ ట్యూబ్ బేబీని సృష్టించారు. ఇందుకోసం ఆయన పాటించిన సూత్రాలు రాబర్ట్ ఎడ్వర్డ్స్ విధానాలకు భిన్నంగా ఉండటం విశేషం. బహుశా సుభాష్‌కు తగినన్ని వసతులు అంది ఉంటే… లోకంలోనే తొలి టెస్ట్ ట్యూబ్ బేబీని సృష్టించేవారేమో! ఇంత జరిగినా తోటి శాస్త్రవేత్తల, అధికారుల తీరు మారలేదు. తనను వెంటాడి, వేధించి, అవమానించారు.
తన పరిశోధనలను ప్రపంచంతో పంచుకునేందుకు కూడా అనుమతించలేదు. అడుగడుగునా అడ్డంకులతో సుభాష్ గుండె బలహీనపడింది, మనసు గాయపడింది. 50 ఏండ్ల వయసులో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. తన జీవితం ఆధారంగా రూపొందిన ‘ఏక్ డాక్టర్ కీ మౌత్’ చూసి తీరాల్సిన చిత్రం. ఈర్ష్యాద్వేషాలు, తాత్కాలిక రాజకీయాలు దేశానికి ఎంత చేటు చేస్తాయో హెచ్చరించే కథ ఇది. అయితే సుభాష్ లాంటి వారి స్ఫూర్తితో… పూర్తిస్థాయి కృత్రిమ గర్భాన్ని సృష్టించే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.
ఫలదీకరణం చెందిన అండాన్ని తల్లి కడుపులోనో లేదా మరో మహిళ కడుపులోనో (సరోగసీ) ప్రవేశపెట్టడమే ఇంతవరకూ జరిగింది. EXTEND లాంటి పరికరాలతో సగం నెలలు బయటే ఉండే వెసులుబాటూ మొదలవబోతున్నది. కానీ పిండాన్ని పూర్తిగా ఒక పెట్టెలో ఎదిగేలా చేయడం ఇంకా ఆలోచన దశలోనే ఉంది. దాన్ని సాధించాలంటే చాలా నిబంధనలను దాటాలి. నైతికంగా తలెత్తే ప్రశ్నలకు, చట్టపరంగా ఎదురయ్యే సవాళ్లకు జవాబు చెప్పాలి. కుటుంబ నియంత్రణ నుంచీ క్లోనింగ్ వరకు సంతానోత్పత్తికి చెందిన ఏ అంశానికైనా ఇలాంటి పరిమితులు ఉండి తీరతాయి. ఒకవేళ వాటిని దాటితే ఆ ప్రక్రియ ఎలా ఉండబోతున్నది?
కొన్ని సందర్భాలలో కృత్రిమ గర్భం నిజంగా వరమే అనిపిస్తుంది. ఎలాగైతే టెస్ట్ ట్యూబ్ బేబీల ద్వారా సంతానలేమితో బాధపడేవారికి ఉపశమనం లభించిందో… అలా అన్ని దారులూ మూసుకుపోయిన సమయాల్లో కృత్రిమ గర్భం జీవితం పట్ల ఆశ రేకెత్తిస్తుంది. అలాంటి కొన్ని సందర్భాలు…
కృత్రిమ గర్భం చుట్టూ చెలరేగే చట్టపరమైన ప్రశ్నల్ని పక్కన పెడితే… దాని వల్ల ఎదురయ్యే ఇతర సమస్యలు కూడా కలవరపెడుతున్నాయి.
అది 1931. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల మధ్య సమయం. సాంకేతికతతో అంతా సాధ్యమని నమ్ముతున్న కాలం. మనిషి కంటే యంత్రాలు, ఆయుధాలే ముఖ్యమని భావిస్తున్న సమయం. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆంగ్ల రచయిత ఆల్డస్ హక్స్లీకి ఓ ఆలోచన వచ్చింది. దాని రూపమే Brave New World. క్రీ.శ. 2540లో లోకం ఎలా ఉండబోతున్నది అనే ఊహ ఇందులో కనిపిస్తుంది. ఆ సమయంలో లండన్‌లో ‘పిల్లల్ని తయారుచేసే కేంద్రం’ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వాళ్లను ఓ అయిదు తరగతులుగా సృష్టించి సమాజానికి అందిస్తుంటారు. ఇందులో ఉన్నత తరగతులుగా ఉన్న పిల్లలు మానసికంగా, ఆరోగ్యంగా ఉండేలా తగినన్ని రసాయనాలతో వాళ్లను సృష్టిస్తారు. ఇలా పుట్టిన మార్క్స్ అనే వ్యక్తి చేసే పోరాటమే కథను ముందుకు నడిపిస్తుంది. పిల్లల్ని కృత్రిమంగా సృష్టించడం వల్ల కలిగే పర్యవసానాల చుట్టూ కథనం ఉంటుంది. కేవలం కృత్రిమ గర్భం మాత్రమే కాదు… సామాజిక అసమానతలు, మానవ వికాసం, నిద్ర లాంటి ఎన్నో విషయాలను చర్చిస్తుందీ నవల.
పూర్తిగా ఎదగని పిల్లల్ని కొంతకాలం బయటే ఉంచవచ్చు అనే ఆలోచన, కృత్రిమ గర్భధారణలో కీలకం. ఆ ప్రయత్నమే ఇంక్యుబేటర్కి దారితీసింది. నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు అమ్మ ఒడి వెచ్చదనాన్నీ, ప్రాణవాయువునూ, తేమనూ, ఆహారాన్నీ అందించే ఈ ఇంక్యుబేటర్లు నూరేండ్ల క్రితం నుంచే అందుబాటులోకి వచ్చాయి. తొలి రోజులలో కిరోసిన్ దీపాలను పక్కన పెట్టి, ఆ వేడిని అందించేవారు. ఆ మాటకు వస్తే గదిలో కాస్త వేడి చూపిస్తే, కోడి పొదగాల్సిన అవసరం లేకుండానే పిల్లలు పుడతాయనే ఆలోచనతో వేల ఏండ్ల క్రితమే ఇంక్యుబేటర్లను పోలిన వాతావరణాన్ని సృష్టించాయి కొన్ని నాగరికతలు. ప్రతి జీవీ ఓ నిర్దిష్టమైన ఉష్ణోగ్రత దగ్గర చురుగ్గా ఉంటుందని తెలిసిపోవడంతో పౌల్ట్రీల నుంచి టీకాల తయారీ వరకు దీన్ని వాడుతున్నారు.
కృత్రిమ గర్భం అన్నది ఒక ఆలోచనగానే ఉన్న సమయంలో…. దాని గురించి ఓ ఊహకు రూపాన్నిచ్చిన వ్యక్తి హషీం అల్ గైలి. యెమన్‌కు చెందిన ఈ బయాలజిస్ట్ గత పదిహేనేండ్లుగా సోషల్ మీడియాలో వైజ్ఞానిక శాస్త్రం గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని అందిస్తున్నారు. కోట్ల మంది ఫాలోవర్లను, వందల కోట్ల వీక్షణలను అందుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ కృత్రిమ గర్భాలు ఎలా ఉండబోతున్నాయి అంటూ EctoLife: The World’s First Artificial Womb Facility అనే వీడియోను రూపొందించారు.
ఎక్టో లైఫ్ అనే ఓ ఊహాజనిత ప్రయోగశాలలో అండాలు శిశువుగా ఎలా రూపాంతరం చెందుతాయో కళ్లకు కట్టారు. ఒకేసారి నాలుగు వందల శిశువుల వరకూ పెంచగలిగే ఈ ప్రయోగశాలలో ప్రతీ శిశువునీ నిశితంగా గమనించవచ్చనీ, తన తల్లిదండ్రులు దాన్ని లైవ్‌లో చూడవచ్చనీ అంటారు హషీం. బిడ్డకీ, తల్లికీ అనుబంధం ఏర్పడేలా ఆమె మాటలను, పాటలను వినిపిస్తూ ఉండే సౌకర్యాన్నీ సూచిస్తారు.
బిడ్డ తన కడుపులోనే ఉన్న అనుభూతి కలిగేలా తను కాళ్లు ఆడించినప్పుడల్లా (కిక్స్) తంతున్న అనుభూతి అందించేలా సెన్సర్లని కూడా ఏర్పాటు చేయవచ్చని చెబుతారు. ఎక్టోలైఫ్ యాప్ ద్వారా శిశువుకి సంబంధించిన ప్రతీ సమాచారాన్నీ అనుక్షణం పరిశీలించవచ్చు అంటారు. మీ దగ్గర మరీ ఎక్కువ డబ్బులు ఉంటే ఓ చిన్నపాటి ఎక్టోలైఫ్ మీ ఇంట్లోనే నిర్మిస్తాం, మీ శిశువు మీ కళ్ల ముందే ఎదుగుతుంది అని ఊరిస్తారు. వైజ్ఞానిక ప్రపంచంలో ఏదీ అసాధ్యం కాదు కాబట్టి, వినడానికి ఎంత ఆశ్చర్యంగా తోచినా… భవిష్యత్తులో ఇలా జరగవచ్చు అని నమ్మాల్సిందే!
– కె.సహస్ర