Garlic Peel | వెల్లుల్లిని మనం తరచూ అనేక వంటకాల్లో ఉపయోగిస్తుంటాం. దీని వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. వెల్లుల్లిని తింటే నోరంతా దుర్వాసన వస్తుందనే కారణంతో కొందరు దీన్ని దూరం పెడతారు. కానీ వెల్లుల్లి మనకు అందించే ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు. వెల్లుల్లిని రోజూ పచ్చిగా తింటే మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. వెల్లుల్లిని తినడం వల్ల షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులో ఉంటాయి. బీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా ఎన్నో లాభాలు ఉంటాయి. అయితే కేవలం వెల్లుల్లి మాత్రమే కాదు, దాని పొట్టు కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. దీంతో పలు అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. వెల్లుల్లి పొట్టు మనకు ఏవిధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మ సమస్యలతో బాధపడుతున్న వారికి వెల్లుల్లి పొట్టు చక్కని ఔషధంలా పనిచేస్తుంది. వెల్లుల్లి పొట్టును నీళ్లతో కలిపి పేస్ట్‌లా చేసి దాన్ని రాస్తుంటే చర్మంపై ఉండే వాపులు, దురదలు తగ్గుతాయి. అలాగే గాయాలు, పుండ్లు కూడా త్వరగా మానుతాయి. వెల్లుల్లి పొట్టులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మ సమస్యలు తగ్గేలా చేస్తాయి. వెల్లుల్లి పొట్టును నేరుగా తినాల్సిన పనిలేదు. ఈ పొట్టును మీరు వండే సూప్‌లు లేదా కూరల్లో వేస్తే చాలు, వాటిల్లో ఉండే సారం కూరల్లోకి దిగుతుంది. సూప్‌ల తయారీలో కూడా వెల్లుల్లి పొట్టును వేయవచ్చు. దీని వల్ల ఆ పొట్టులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సూప్‌లో కలుస్తాయి. దీంతో వెల్లుల్లి పొట్టులో ఉండే పోషకాలు మన శరీరానికి అందుతాయి.
వెల్లుల్లి పొట్టును నీటిలో వేసి మరిగించి దాంతో డికాషన్ తయారు చేయవచ్చు. ఈ డికాషన్‌ను రాత్రి నిద్రకు ముందు తాగాలి. దీంతో మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభించి నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. వెల్లుల్లి పొట్టులో విటమిన్లు ఎ, సి, ఇ అధికంగా ఉంటాయి. అలాగే ఈ పొట్టులో ఫ్లేవనాయిడ్స్, క్వర్సెటిన్ అనే సమ్మేళనాలు కూడా అధికంగానే ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. దీంతో రక్త నాళాలలో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. రాత్రి పూట చాలా మందికి నిద్రలో ఉండగా కాలి పిక్కలు, కండరాలు పట్టుకుపోతుంటాయి. ఈ సమస్య నుంచి బయట పడేందుకు వెల్లుల్లి పొట్టు ఎంతగానో పనిచేస్తుంది. వెల్లుల్లి పొట్టు వేసి మరిగించిన నీళ్లను రాత్రి నిద్రకు ముందు తాగుతుండాలి. దీంతో ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
గుండె ఆరోగ్యానికి కూడా వెల్లుల్లి పొట్టు ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లి పొట్టులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి బీపీని క్రమబద్దీకరిస్తాయి. దీంతో రక్త సరఫరా నియంత్రణలో ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా రక్షించుకోవచ్చు. వెల్లుల్లి పొట్టులో సల్ఫర్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. దీని వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. శరీరం రోగాలు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లి పొట్టును నేరుగా తినలేని వారు దాన్ని పొడిగా చేసి అన్నంలో మొదటి ముద్దలోనూ కలిపి తినవచ్చు. ఇలా వెల్లుల్లి పొట్టును తీసుకుంటుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.