Eggs For Hair Problems | కోడిగుడ్లలో అనేక పోషకాలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకనే కోడిగుడ్లను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. కోడిగుడ్లను తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు కోడిగుడ్లలో ఉంటాయి. అందుకనే గుడ్లను సంపూర్ణ ఆహారంగా పిలుస్తారు. రోజుకు ఒక గుడ్డు తింటే ఆరోగ్యంగా ఉండవచ్చని న్యూట్రిషనిస్టులు కూడా చెబుతుంటారు. అయితే కోడిగుడ్లు కేవలం ఆరోగ్య ప్రయోజనాలను అందివ్వడమే కాదు, అందాన్ని పెంచడంలోనూ సహాయ పడతాయి. ఇందుకు గాను కోడిగుడ్లను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక కోడిగుడ్డును తీసుకుని పగలగొట్టి ఆ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. దీన్ని తడిగా ఉన్న జుట్టుకు రాయాలి. 30 నిమిషాల పాటు ఆగి తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తుంటే జుట్టు కాంతివంతంగా మారి మెరుస్తుంది. జుట్టుకు కాంతి కోరుకునేవారు ఈ చిట్కాను పాటించవచ్చు. అలాగే ఒక కోడిగుడ్డులోని మిశ్రమం, 2 టేబుల్ స్పూన్ల పెరుగు కలిపి జుట్టుకు పట్టిస్తే శిరోజాలు కాంతివంతంగా మారడమే కాకుండా జుట్టు దృఢంగా మారుతుంది. జుట్టు బలహీనంగా ఉన్నవారు, జుట్టు చివర్లు చిట్లిన వారు ఈ చిట్కాను పాటిస్తే ఫలితం ఉంటుంది.
కోడిగుడ్డులోని మిశ్రమానికి 1 టేబుల్ స్పూన్ కొబ్బరినూనెను కలిపి జుట్టుకు పట్టించాలి. 1 గంట సేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే డ్యామేజ్ అయిన జుట్టు తిరిగి పూర్వ కాంతిని, దృఢత్వాన్ని పొందుతుంది. నిమ్మరసంలో కోడిగుడ్డును కలిపి వాడుతుంటే జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. చుండ్రు, జుట్టు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఉన్నవారు ఈ చిట్కాను పాటిస్తే మెరుగైన ఫలితం ఉంటుంది. జుట్టు కుదుళ్ల నుంచి నూనె ఎక్కువగా స్రవిస్తూ జుట్టు ఎప్పుడూ జిడ్డుగా ఉండేవారు గుడ్డులోని తెల్లసొనను ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది. దీంతో అధికంగా ఉండే జిడ్డు పోతుంది.
కోడిగుడ్డులోని మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి జుట్టుకు పట్టించి అర గంట అయ్యాక తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తుంటే జుట్టు మృదువుగా మారి కాంతివంతంగా అవుతుంది. శిరోజాలు దృఢంగా తయారవుతాయి. కోడిగుడ్డు సొనలో అరటి పండు కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టిస్తుంటే బలహీనంగా ఉండే జుట్టు చివర్ల సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతోపాటు జుట్టు సాగే గుణాన్ని తిరిగి పొందుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కోడిగుడ్డు సొనలో కలబంద గుజ్జు 2 టేబుల్ స్పూన్లు కలిపి రాస్తుంటే జుట్టు రాలడం సమస్య నుంచి బయట పడవచ్చు. జుట్టు రాలడం తగ్గుతుంది. శిరోజాలుగా ఒత్తుగా పెరిగి దృఢంగా ఉంటాయి.
కోడిగుడ్డు సొనలో అవకాడో పేస్ట్‌ను కలిపి రాస్తుంటే జుట్టుకు మంచి కండిషనింగ్ లభిస్తుంది. శిరోజాలు ఒత్తుగా పెరిగి కాంతివంతంగా మారుతాయి. ఇలా కోడిగుడ్డును పలు ఇతర పదార్థాలతో ఉపయోగించడం వల్ల శిరోజాలను కాంతివంతంగా మార్చుకోవచ్చు. జుట్టు రాలడం తగ్గుతుంది. శిరోజాలు ఒత్తుగా పెరుగుతాయి.