Almonds | బాదంపప్పును తినడం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. బాదంపప్పు మనకు ఎన్నో పోషకాలను అందిస్తుంది. అనేక రోగాలు రాకుండా రక్షిస్తుంది. అయితే బాదంపప్పును నీటిలో నానబెట్టి పొట్టు తీసి తినాలా, లేక పొట్టును అలాగే ఉంచి తినాలా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. పొట్టుతో తింటే లాభాలు కలుగుతాయని కొందరు పొట్టుతోనే తింటారు. అయితే వాస్తవానికి ఈ పప్పును ఎలా తింటే మంచిది..? ఇందుకు డాక్టర్లు ఏమని సమాధానం చెబుతున్నారు..? అంటే..
న్యూట్రిషనిస్టులు చెబుతున్న ప్రకారం అయితే బాదంపప్పును రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు తీసుకుంటే మంచిది. దీని వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఎన్ని బాదంపప్పులను తినాలి అనేది వ్యక్తుల బరువు, ఎత్తు, శారీరక శ్రమ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. శారీరక శ్రమ చేసే వారు కాస్త ఎక్కువ మోతాదులో బాదంపప్పును తినాల్సి ఉంటుంది. అదే రోజంతా కూర్చుని పనిచేసేవారు 7 నుంచి 10 బాదంపప్పులను తింటే చాలు. మోతాదుకు మించి బాదంపప్పులను తినడం వల్ల అనేక దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక బాదంపప్పును తగిన మోతాదులోనే తినాల్సి ఉంటుంది.
ఇక న్యూట్రిషనిస్టులు చెబుతున్న ప్రకారం బాదంపప్పు పొట్టులో ఎలాంటి పోషకాలు ఉండవు. కనుక దాన్ని తినకూడదు. పొట్టు తీసిన తరువాతే ఆ పప్పులను తినాలి. బాదంపప్పును తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఇవి అధిక బరువును తగ్గించడంలో ఎంతగానో దోహదపడతాయి. ఈ పప్పును తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. బాదంపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
కొలెస్ట్రాల్, బీపీ సమస్యలు ఉన్నవారు రోజూ బాదంపప్పును తినడం వల్ల ఎంతగానో ఉపయోగం ఉంటుంది. ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు. జీర్ణసమస్యలు ఉన్నవారికి సైతం ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. బాదంపప్పులో విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీని వల్ల సీజనల్‌గా వచ్చే వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. విటమిన్ ఇ వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి.
బాదంపప్పును రోజూ చిన్నారులకు ఇవ్వడం వల్ల వారిలో మెదడు పనితీరు మెరుగు పడుతుంది. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. చదువుల్లో వారు రాణిస్తారు. తెలివితేటలు పెరుగుతాయి. బాదంపప్పును నానబెట్టి దాంతో పేస్ట్ చేసి ముఖానికి ఫేస్ ప్యాక్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. దీంతో ముఖంపై ఉండే ముడతలు, మొటిమలు తగ్గిపోతాయి. ఇలా బాదంపప్పు వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.