Arthritis Pains | చలికాలంలో సహజంగానే మన శరీరంలో రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. తగ్గిన ఉష్ణోగ్రత కారణంగా రక్త సరఫరా సరిగ్గా జరగదు. అందుకని శరీరం తనకు తాను వెచ్చగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో కీళ్ల వద్ద రక్త సరఫరా సరిగ్గా జరగదు. దీంతో వాపులు వచ్చి నొప్పి వస్తుంటుంది. అందుకనే ఆర్థరైటిస్ లేదా ఆస్టియోపోరోసిస్ సమస్య ఉన్నవారు చలికాలంలో తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. ఇక ఈ సమస్యలు లేకున్నా కొందరికి చలికాలం వచ్చిందంటే చాలు.. వాపులు, నొప్పులు వచ్చి ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అయితే కింద చెప్పిన ఆరోగ్య చిట్కాలను పాటిస్తే చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే కీళ్ల వాపులు కూడా తగ్గిపోతాయి. ఇక ఆ ఆరోగ్య చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలను ఈ సీజన్లో తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. ముఖ్యంగా కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. క్యాల్షియం మనకు అనేక ఆహారాల్లో లభిస్తుంది. పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు, చీజ్ వంటి వాటిల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అయితే పాలు, పాల ఉత్పత్తులు పడని వారు, తీసుకోలేని వారు బాదంపాలు, సోయా పాలు, తృణ ధాన్యాలు, పప్పు దినుసులు, ఉడకబెట్టిన శనగలు, సోయాబీన్స్, చియా సీడ్స్, రాజ్మా గింజలు, పెసలు, నువ్వులు వంటి ఆహారాలను తీసుకోవచ్చు. వీటిల్లోనూ క్యాల్షియం సమృద్ధిగానే ఉంటుంది. ఇవి ఎముకలను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతాయి.
ఈ సీజన్లో ఆకుకూరలను అధికంగా తీసుకోవడం వల్ల కూడా ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే క్యాల్షియం అధికంగా ఉండే కూరగాయలను సైతం తీసుకోవచ్చు. ముఖ్యంగా కేల్, బ్రోకలీ, బెండకాయలు, పాలకూర, మొలకలు, బీన్స్ వంటి ఆహారాలను తీసుకోవడం ద్వారా క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పుల నుంచి బయట పడవచ్చు. అదేవిధంగా పలు రకాల యోగాసనాలను వేయడం వల్ల కూడా ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. యోగా గురువుల వద్ద ఆసనాలు నేర్చుకుని వేస్తే మందులు, ఆహారంతో పనిలేకుండా కీళ్ల నొప్పుల నుంచి బయట పడవచ్చు.
ఇక డాక్టర్ల సలహాల మేరకు విటమిన్ డి, క్యాల్షియం సప్లిమెంట్లను వాడవచ్చు. రెండింటినీ కలిపి వాడడం వల్ల విటమిన్ డి మన శరీరంలోని క్యాల్షియంను అధికంగా శోషించుకునేలా చేస్తుంది. దీంతో ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ఎముకల దృఢత్వానికి మెగ్నిషియం, జింక్, కాపర్, మాంగనీస్, బోరాన్ వంటి పోషకాలు కూడా అవసరం అవుతాయి. అందుకని మల్టి విటమిన్ ట్యాబ్లెట్లను కూడా డాక్టర్ సలహా మేరకు వాడుకోవచ్చు. అలాగే కాస్తంత శారీరక శ్రమ చేయడం వల్ల కీళ్లలో కదలిక ఏర్పడుతుంది. దీంతో ఆ భాగంలో రక్త సరఫరా పెరుగుతుంది. ఫలితంగా నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజూ కనీసం 30 నిమిషాలపాటు తేలికపాటి వాకింగ్ చేస్తే ఎంతగానో ఫలితం ఉంటుంది. ఇలా పలు రకాల చిట్కాలను పాటించడం వల్ల చలికాలంలో వచ్చే ఆర్థరైటిస్ నొప్పులను తగ్గించుకోవచ్చు.