గుండెపోటు.. ఇది ఎవరికైనా రావొచ్చు. ఇంతకుముందు 50 ఏళ్లు దాటినవారిలో ఎక్కువగా గుండెపోటు మరణాలు చూసేవాళ్లం. కరోనా తర్వాత చాలా చిన్న వయస్సువారు కూడా గుండెపోటుతో మృతిచెందారు. అయితే, చిన్నవయస్సువారికి గుండెపోటు ఎందుకు వస్తుందో పరిశోధకులు తేల్చారు. హృద్రోగ సంబంధిత సమస్యల కుటుంబ చరిత్ర కలిగిన వారికి ఈ ముప్పు అధికంగా ఉంటుందని తేల్చారు. జన్యుపరంగానే యువకులకు గుండె పోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. దీంతోపాటు జీవనశైలి వల్ల కూడా యువకులు ఎక్కువగా గుండె పోటు బారినపడుతున్నారని కనుగొన్నారు. హార్ట్ ఎటాక్ బారినపడకుండా ఉండాలంటే కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు.
జన్యు సంబంధ సమస్యలతోపాటు జీవనశైలి కూడా యువకుల్లో గుండెపోటుకు కారణమవుతోంది. కనుక జీవనశైలిలో మార్పులు చేసుకుంటే గుండె పోటు బారినుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు ఈ కింది జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెబుతున్నారు.
1. ధూమపానం మానేయండి..
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం, దాదాపు 25 శాతం మంది పాఠశాల, కళాశాల విద్యార్థులు కొన్ని రకాల పొగాకు ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. పది మందిలో తొమ్మిది మంది ధూమపానం చేసేవారు హైస్కూల్ పూర్తి చేసేందుకు ముందే ధూమపానం చేయడం ప్రారంభిస్తున్నారు. ధూమపానం వల్ల వచ్చే గుండె జబ్బులతో ఏటా 90,000 మంది మరణిస్తున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రక్త నాళాలను కుంచించుకుపోయేలా చేసి, గుండెపై అదనపు ఒత్తిడిని కలిగించే నికోటిన్‌ను వదిలేయడం చాలా ముఖ్యం.
2. ఆరోగ్యకరమైన శరీర బరువు..
అధిక బరువు ఉన్న యువకులు ఇతరులతో పోలిస్తే అధిక రక్తపోటును కలిగి ఉంటారు. ప్రధాన కారణం బాల్య ఊబకాయం. ఇక్కడ కొవ్వు కణాలు శరీరంలోని సాధారణ కణాల కంటే ఎక్కువగా ఉంటాయి. శారీరక శ్రమ పెంచి, ఉప్పు వాడకం తగ్గిస్తే ఈ సమస్యను అధిగమించొచ్చు. ఇది హృదయ ఆరోగ్యాన్ని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.
3. డ్రగ్స్ తీసుకోవడం ఆపేయాలి..
యువతలో చాలామంది వినోదం కోసం డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఇవి శరీరంలో ముఖ్యంగా గుండెపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. గంజాయి, కొకైన్ దీర్ఘకాలికంగా తీసుకుంటే హృదయ స్పందన రేటు పెరుగుతుంది. రక్తనాళాలు కుంచించుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.