Nannari Sharbat | వేసవి కాలంలో మన శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సీజన్ లో చాలా మంది వివిధ రకాల చల్లని పానీయాలను సేవిస్తుంటారు. వాటిల్లో నన్నారి షర్బత్ కూడా ఒకటి. నన్నారి అనే మొక్కకు చెందిన వేర్ల నుంచి తయారు చేసే ఈ షర్బత్‌ను వేసవిలో చాలా మంది సేవిస్తుంటారు. అయితే ఈ షర్బత్ అందించే ప్రయోజనాలు చాలా మందికి తెలియవు. నన్నారి మొక్క వేర్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ వేర్లతో తయారు చేసే షర్బత్‌ను వేసవిలో తాగితే అనేక లాభాలను పొందవచ్చు. నన్నారి షర్బత్ శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. నన్నారి వేర్లు మన శరీరానికి చలువ చేస్తాయి. అందువల్ల ఈ వేర్లతో తయారు చేసిన షర్బత్‌ను సేవిస్తే వేడి తగ్గుతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.
నన్నారి వేర్లకు మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే శక్తి ఉంది. నన్నారి షర్బత్‌ను సేవిస్తుంటే రక్తం శుద్ధి అవుతుంది. శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. నన్నారి వేర్లలో డైయురెటిక్ లక్షణాలు ఉంటాయి. కనుక ఈ షర్బత్‌ను తాగితే శరీరంలోని వ్యర్థాలను కిడ్నీలు మరింత సమర్థవంతంగా బయటకు పంపిస్తాయి. వ్యర్థాలు మూత్రం ద్వారా బయటకు పోతాయి. నన్నారి వేర్లు జీర్ణ క్రియను మెరుగు పరుస్తాయి. అజీర్తి, అసిడిటీ నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. మలబద్దకం తగ్గుతుంది. నన్నారి వేర్లలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఈ వేర్లతో షర్బత్‌ను తయారు చేసి తాగుతుంటే శరీరంలోని వాపులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది.
నన్నారి వేర్లలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించేందుకు సహాయం చేస్తాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవచ్చు. క్యాన్సర్లు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. నన్నారి షర్బత్‌ను సేవిస్తుంటే చర్మానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. ఈ షర్బత్‌ను తాగడం వల్ల దాహం తీరుతుంది. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఆయుర్వేదంలో నన్నారి వేర్లను పిత్త దోషాన్ని తగ్గించేందుకు వాడుతారు. ఇలా ఈ వేర్లతో అనేక లాభాలను పొందవచ్చు. ఇక ఇంట్లోనే నన్నారి షర్బత్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
నన్నారి షర్బత్‌ను తయారు చేసేందుకు రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. మార్కెట్లో లభించే నన్నారి సిరప్‌ను తెచ్చి దాన్ని ఒక గ్లాస్లో 2 టేబుల్ స్పూన్ల మోతాదులో పోయాలి. అనంతరం చల్లని నీళ్లు లేడా సోడాను పోసి కలపాలి. కొద్దిగా నిమ్మరసం పిండాలి. కాసిన్ని పుదీనా ఆకులను వేయాలి. దీంతో నన్నారి షర్బత్ రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తాగవచ్చు. చల్లని నీళ్లకు బదులుగా ఐస్ క్యూబ్స్‌ను కూడా ఉపయోగించవచ్చు. అలాగే ఆయుర్వేద షాపుల్లో మనకు నన్నారి వేర్లు లభిస్తాయి. వీటిని తెచ్చి శుభ్రంగా కడిగి ఎండబెట్టి పొడి చేయాలి. దీన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని చల్లని నీటిలో వేసి కలపాలి. అనంతరం అందులో కాస్త బెల్లం వేయాలి. కొద్దిగా నిమ్మరసం పిండాలి. కాస్త జీలకర్ర పొడ వేసి కొన్ని పుదీనా ఆకులను వేయాలి. దీంతో నన్నారి షర్బత్ రెడీ అవుతుంది. ఇలా కూడా ఈ షర్బత్‌ను తయారు చేసి తాగవచ్చు. ఈ షర్బత్ ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.