Appetite | తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే అజీర్తి ఏర్పడుతుంది. దీంతో ఆకలి వేయదు. ఆహారం తక్కువగా తింటారు. ఆకలి తగ్గేందుకు పలు ఇతర కారణాలు కూడా ఉంటాయి. జీర్ణాశయంలో ఎంజైమ్‌లు లేదా జీర్ణ రసాల ఉత్పత్తి తగ్గడం, లివర్ పనితీరు మందగించడం, మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలు ఉండడం వంటి కారణాల వల్ల కూడా ఆకలి ఉండదు. దీంతో ఆహారం సరిగ్గా తినలేకపోతుంటారు. అయితే పలు రకాల చిట్కాలను పాటిస్తే అజీర్తిని తగ్గించి ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేయవచ్చు. దీంతో ఆకలి కూడా పెరుగుతుంది. ఆకలి అసలు లేని వారు కొన్ని చిట్కాలను పాటిస్తే ఎంతో మేలు జరుగుతుంది. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకలిని పెంచడంలో మిరియాలు అద్భుతంగా పనిచేస్తాయి. మిరియాలను పొడిగా చేసి చిటికెడు మోతాదులో తీసుకుని కాస్త తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం భోజనానికి 30 నిమిషాల ముందు చప్పరించాలి. దీంతో అజీర్తి తగ్గుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. మిరియాల పొడిని మజ్జిగలో కలిపి తాగుతున్నా ఉపశమనం లభిస్తుంది. ఆకలి పెరుగుతుంది. మిరియాలలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థలో ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచుతాయి. జీర్ణ రసాలు సక్రమంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీంతో ఆకలి పెరుగుతుంది. మిరియాలను తేనెతో కలిపి తినడం వల్ల రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మలబద్దకం తగ్గుతుంది. మిరియాలతో కషాయం తయారు చేసి కూడా తాగవచ్చు.
ఆకలిని పెంచేందుకు అల్లం రసం కూడా ఎంతో పనిచేస్తుంది. ఒక టీస్పూన్ అల్లం రసాన్ని ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు సేవించాలి. అల్లంలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవన్నీ పైత్యాన్ని తగ్గిస్తాయి. వికారం, అజీర్తి సమస్యల నుంచి బయట పడేస్తాయి. ఆకలి పెరిగేలా చేస్తాయి. ఆకలి లేని వారు రోజూ అల్లం రసాన్ని తాగుతుంటే ఫలితం ఉంటుంది. అలాగే ఉసిరికాయ జ్యూస్‌ను రోజూ తాగుతున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఉసిరికాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. దీంతో అజీర్తి తగ్గి ఆకలి పెరుగుతుంది. రోజూ ఉదయం పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో ఉసిరికాయ జ్యూస్‌ను తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది.
యాలకులను కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. భోజనం చేసిన తరువాత రాత్రి పూట ఒక యాలక్కాయను నేరుగా అలాగే నమిలి తినాలి. ఇది అజీర్తిని తగ్గిస్తుంది. జీర్ణాశయంలో గ్యాస్ ఉత్పత్తిని అరికడుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. దీంతో ఆకలి పెరుగుతుంది. యాలకులను తినడం వల్ల రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. అలాగే నోట్లో ఉండే బ్యాక్టీరియా తగ్గుతుంది. నోటి దుర్వాసన నుంచి ఉపశమనం లభిస్తుంది. యాలక్కాయను రాత్రిపూట తింటే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిద్ర చక్కగా పడుతుంది. పిప్పిళ్ల చూర్ణం పావు టీస్పూన్ మోతాదులో తీసుకుని దానికి ఒక టీస్పూన్ తేనెను కలిపి రాత్రి పూట నిద్రకు ముందు తీసుకోవాలి. ఈ మిశ్రమం ద్వారా ఆకలి పెరగడమే కాదు, పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరుగుతుంది. ఇలా పలు చిట్కాలను పాటిస్తే ఆకలిని పెంచుకోవడమే కాదు, ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు.