Walking | పూర్వం ఒకప్పుడు ప్రజలు రోజూ శారీరక శ్రమ చేసేవారు. గంటల తరబడి ఏదో ఒక పనిచేస్తూనే ఉండేవారు. కనుకనే వారు ఎక్కువ కాలం పాటు ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా జీవించగలిగేవారు. కానీ ప్రస్తుతం అధిక శాతం మంది గంటల తరబడి కూర్చుని పనిచేసే ఉద్యోగాల్లోనే ఉంటున్నారు. శారీరక శ్రమ పూర్తిగా తగ్గింది. చాలా మంది అసలు రోజూ కనీసం వ్యాయామం కూడా చేయడం లేదు. దీని వల్ల అనేక రోగాలు వస్తున్నాయి. అయితే ఆరోగ్యంగా ఉండేందుకు సరైన ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో రోజూ వ్యాయామం చేయడం కూడా అంతే అవసరమని వైద్యులు చెబుతున్నారు. రోజూ వ్యాయామం చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయని వారు అంటున్నారు. అయితే రోజూ కఠినమైన వ్యాయామాలను చేయాల్సిన అవసరం లేదు. వాకింగ్ చేసినా చాలు, అనేక లాభాలు కలుగుతాయని వారు సూచిస్తున్నారు. వాకింగ్‌ను రోజువారి దినచర్యలో భాగం చేసుకోవాలని అంటున్నారు.
వాకింగ్ చేయడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడి బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి వాకింగ్ ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్స్ రాకుండా చూసుకోవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు సైతం నియంత్రణలో ఉంటాయి. వాకింగ్ చేయడం వల్ల శరీరం క్యాలరీలను సులభంగా ఖర్చు చేస్తుంది. దీంతో శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. వాకింగ్ వల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. షుగర్ లెవల్స్‌ను ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవచ్చు. వాకింగ్ చేస్తే ఎముకలు, కండరాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. శారీరక దృఢత్వం లభిస్తుంది. దేహం దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యానికి కూడా వాకింగ్ మేలు చేస్తుంది. వాకింగ్ వల్ల మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాత్రి పూట చక్కగా నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి తగ్గుతుంది.
ఇక వాకింగ్ చేయడం వల్ల లాభాలు కలుగుతాయని అందరికీ తెలుసు. కానీ రోజూ ఎన్ని నిమిషాల పాటు వాకింగ్ చేయాలని చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. ఇందుకు ఫిట్ నెస్ నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారంటే.. అమెరికన్ హార్ట్ అసోసియేషన్, అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ చెబుతున్న ప్రకారం ప్రతి మనిషికి వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామం అవసరం. అంటే వారంలో కనీసం 5 రోజుల పాటు రోజుకు 30 నిమిషాల పాటు అయినా సరే వ్యాయామం చేయాల్సి ఉంటుందన్నమాట. దీని వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. కనుక వాకింగ్ కూడా ఇలా చేస్తే సరిపోతుంది. రోజుకు 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. వారంలో అలా 5 రోజుల పాటు చేస్తే చాలు, దీంతో వారానికి 150 నిమిషాల కోటా పూర్తవుతుంది. ఇలా వాకింగ్ చేస్తున్నా ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే సమయం ఉందని భావించే వారు రోజుకు కనీసం 60 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే ఇంకా ఎంతో మేలు జరుగుతుందని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు.
ఇక వాకింగ్‌ను మొదలు పెట్టేవారు ముందుగా రోజుకు 10 నిమిషాలపాటు వాకింగ్ చేయాలి. శరీరం అలవాటు పడే కొద్దీ సమయాన్ని పెంచుతూ పోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే రోజుకు 60 నిమిషాల పాటు వాకింగ్‌ను చాలా సులభంగా చేయవచ్చు. ఒక మోస్తరు వేగంతో వాకింగ్ చేస్తే గంటకు సుమారుగా 200 క్యాలరీల వరకు ఖర్చు చేయవచ్చు. అదే సాధారణ వేగంతో వాకింగ్ చేస్తే గంటకు సుమారుగా 150 క్యాలరీల వరకు ఖర్చు చేయవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో వాకింగ్ చేస్తే ఇంకా ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధంగా రోజూ వాకింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు.