Sugar | రోజూ ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి మళ్లీ నిద్రించే వరకు మనం అనేక రకాల ఆహారాలను తీసుకుంటూ ఉంటాం. వాటిల్లో ఘనాహారాలతోపాటు ద్రవాహారాలు కూడా ఉంటాయి. అయితే చాలా వరకు ఆహారాల్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. పండ్ల వంటి సహజసిద్ధమైన ఆహారాల్లో లభించే చక్కెరను పక్కన పెడితే టీ, కాఫీ, స్వీట్లు, జంక్ ఫుడ్‌లో ఉండే చక్కెరను పరిగణనలోకి తీసుకుంటే చాలా మంది రోజూ టీస్పూన్ల కొద్దీ చక్కెరను తింటున్నారు. చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల అనేక దుష్పరిణామాలు కలుగుతాయి. శరీరంలో చక్కెర అధికమైతే అనేక వ్యాధులు వస్తాయి. అధికంగా బరువు పెరుగుతారు. శరీరంలో అధికంగా ఉండే చక్కెర కొవ్వు నిల్వలకు కారణం అవుతుంది. దీంతో అధికంగా బరువు పెరుగుతారు.
చక్కెరను అధికంగా తింటే బరువు పెరిగి టైప్ 2 డయాబెటిస్ సమస్యకు దారి తీస్తుంది. శరీరంలో రక్త సరఫరాకు అడ్డంకులు ఏర్పడుతాయి. దీంతో శరీర కణజాలం వాపులకు గురవుతుంది. ఇది క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతుంది. రక్తంలో ట్రై గ్లిజరైడ్స్ స్థాయిలు సైతం పెరిగిపోతాయి. దీంతో రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడుతాయి. ఇవి గుండె పోటు వచ్చేందుకు కారణం అవుతాయి. శరీరంలో ఉండే మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎల్డీఎల్ (చెడు కొలెస్ట్రాల్) పెరుగుతుంది. దీంతో గుండె జబ్బుల బారిన పడతారు. శరీరంలో అధికంగా ఉండే చక్కెర లివర్‌పై సైతం ప్రభావం చూపిస్తుంది. లివర్‌లో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది.
చక్కెర అధికమైతే చర్మంపై సైతం ప్రభావం చూపిస్తుంది. వయస్సు త్వరగా మీద పడినట్లు వృద్ధాప్య ఛాయలు త్వరగా వచ్చేస్తాయి. ముఖంపై ముడతలు ఏర్పడుతాయి. చర్మం తన సహజసిద్ధమైన సాగే గుణాన్ని కోల్పోతుంది. చర్మం వాపులకు గురవుతుంది. దీంతో మొటిమలు కూడా వస్తాయి. చక్కెర అధికంగా తింటే నోట్లో బ్యాక్టీరియా పేరుకుపోతుంది, ఇది నోటి దుర్వాసనను కలిగిస్తుంది. దంతాలు, చిగుళ్లకు సైతం హాని కలుగుతుంది. దంతాలపై ఉండే ఎనామిల్ పోతుంది. దీంతో దంత క్షయం ఏర్పడుతుంది. అప్పుడు దంతాలు విపరీతమైన నొప్పులకు గురవుతాయి. చక్కెరను అధికంగా తింటే అది తినకుండా ఉండలేని పరిస్థితికి మారుతారు. దీంతో అధికంగా చక్కెర తినడానికి అలవాటు పడతారు. ఇది ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కనుక చక్కెర తినడాన్ని తగ్గించాలి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం బాగా శారీరక శ్రమ చేసే వ్యక్తులు లేదా వ్యాయామం చేసే వ్యక్తులు రోజుకు 2వేల క్యాలరీల డైట్‌ను తీసుకుంటే 12 టీస్పూన్ల వరకు చక్కెరను తినవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అలా కాకుండా సాధారణ వ్యక్తులు అయితే రోజుకు 3 టీస్పూన్లకు మించి చక్కెరను తినకూడదని సూచిస్తున్నారు. చక్కెరను అధికంగా తింటే అనేక వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని అంటున్నారు. కనుక చక్కెరను తినే విషయంలో అందరూ జాగ్రత్తలను పాటించాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.