Salt | ఒకప్పుడు కేవలం నగరాల్లో మాత్రమే పాశ్చాత్య తరహాలో ప్రజల జీవనశైలి ఉండేది. కానీ ఇప్పుడది పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపించింది. దీంతో ఆయా ప్రాంతాల్లోనూ ప్యాకేజ్డ్ ఆహారాలు, ప్రాసెస్ చేయబడిన ఆహారాలను, రెడీమేడ్‌గా లభించే ఆహారాలను చాలా మంది తింటున్నారు. అయితే ఈ తరహా ఆహారాల్లో సోడియం అధిక మోతాదులో ఉంటుంది. ఉప్పు అధికంగా ఉండడం వల్ల సోడియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి ఆహారాలను తరచూ తింటే శరీరంలో సోడియం స్థాయిలు పెరిగిపోతాయి. ఇది కిడ్నీలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని జాతీయ పోషకాహార సంస్థ సైతం చెబుతోంది. ఇందుకు ఉప్పే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆయా ఆహారాల్లో అధిక మొత్తంలో ఉండే ఉప్పు అనేక అనారోగ్యాలకు కారణం అవుతుందని వారు చెబుతున్నారు.
సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు కేవలం 5 గ్రాముల ఉప్పును మాత్రమే తినాలి. కానీ సర్వేలు చెబుతున్న గణాంకాల ప్రకారం ఒక వ్యక్తి సరాసరిగా 6 గ్రాముల కన్నా అధికంగానే ఉప్పును రోజూ తింటున్నట్లు తేలింది. అందువల్లే భారతీయుల్లో చాలా మందికి గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని అంటున్నారు. కనుక ఆహారంలో రోజువారిగా తీసుకునే ఉప్పు మోతాదును తగ్గించాల్సి ఉంటుంది. ఉప్పును అధికంగా తీసుకుంటే శరీరంలో సోడియం స్థాయిలు పెరుగుతాయి. దీంతో సోడియంను బయటకు పంపించేందుకు కిడ్నీలు ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఇది దీర్ఘకాలంలో కిడ్నీలపై భారం పడేలా చేస్తుంది. దీంతో కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక ఉప్పును మోతాదులోనే తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మోతాదు కన్నా తక్కువగా తిన్నా వచ్చే నష్టమేమీ ఉండదని అంటున్నారు.
ఉప్పును తినడం ఆరోగ్యానికి అవసరమే. ఇది నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలో ద్రవాలను నియంత్రిస్తుంది. కండరాలు సంకోచం, వ్యాకోచం చెందేందుకు కూడా ఉప్పు అవసరమే. ఉప్పులో ఉండే అయోడిన్ థైరాయిడ్ గ్రంథి పనితీరుకు సహాయం చేస్తుంది. అయోడిన్ లోపం ఉంటే హైపో లేదా హైపర్ థైరాయిడ్ సమస్యలు వస్తాయి. అలాగే శరీరంలో సోడియం స్థాయిలు తగ్గితే లో బీపీ వస్తుంది. దీంతో రక్త ప్రసరణ తగ్గిపోతుంది. కనుక ఉప్పు మన శరీరానికి అవసరమే. కానీ దీన్ని మోతాదులోనే తినాలి. ఉప్పును అధికంగా తింటే మనకు వచ్చే మొదటి సమస్య.. హైబీపీ. ఈ సమస్య ఉన్నవారు కచ్చితంగా ఉప్పును తగ్గించాలి. బీపీ పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ఉప్పును మానేస్తేనే మంచిది. అలాగే ఉప్పును అధికంగా తీసుకుంటే కిడ్నీలపై భారం పడుతుంది. దీంతో పాదాలు, అర చేతుల్లో వాపులు వస్తాయి. ఇది కిడ్నీల ఫెయిల్యూర్‌కు మొదటి సంకేతం.
ఈ సూచనలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే అలర్ట్ అవ్వాలి. రోజువారిగా ఆహారంలో తీసుకునే ఉప్పు పరిమాణాన్ని గణనీయంగా తగ్గించాలి. ప్యాక్ చేయబడిన, ప్రాసెస్ చేయబడిన ఆహారాలను తినకూడదు. బయట ఫాస్ట్ ఫుడ్లు, బేకరీ ఆహారాలు, చిరుతిళ్లను తినకూడదు. ఈ విధంగా డైట్‌ను పాటిస్తే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఉప్పును అధికంగా తింటే హైబీపీ వచ్చి ఆ ప్రభావం గుండెపై కూడా పడుతుంది. ఇది దీర్ఘకాలంలో గుండె జబ్బులు లేదా హార్ట్ ఎటాక్‌ను కలగజేస్తుంది. కనుక ఉప్పు మన శరీరానికి చేసే హాని అంతా ఇంతా కాదు. దీన్ని మోతాదులో తింటేనే ఆరోగ్యంగా ఉండగలమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యవంతమైన వ్యక్తులు అయితే రోజుకు 5 గ్రాముల కన్నా తక్కువగానే ఉప్పును తినాలి. ఆరోగ్య సమస్యలు ఉంటే రోజుకు 2 లేదా 3 గ్రాముల మేర ఉప్పును తింటే చాలు.