Raw Onions | ఉల్లిపాయలను మనం వంటల్లో రోజూ ఉపయోగిస్తూనే ఉంటాం. ఉల్లిపాయలు లేకుండా ఏ కూర పూర్తి కాదు. వీటిని వేస్తే వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. చాలా మంది పచ్చి ఉల్లిపాయలను నేరుగా తింటుంటారు. పెరుగు లేదా మజ్జిగతో, మసాలా లేదా నాన్ వెజ్ వంటకాలను చేసినప్పుడు, బిర్యానీతోపాటు పచ్చి ఉల్లిపాయలను లాగించేస్తుంటారు. ఒకప్పుడు మన పూర్వీకులు, పెద్దలు కూడా ఉల్లిపాయలను అధికంగా తినేవారు. వారు వాటిని పచ్చిగానే తినేవారు. ఉల్లిపాయలను అసలు పచ్చిగా తినవచ్చా, లేదా అని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే ఉల్లిపాయలను పచ్చిగా తినవచ్చని వైద్యులు చెబుతున్నారు. కానీ దీన్ని శుభ్రం చేసిన తరువాతే తినాల్సి ఉంటుంది. ఉల్లిపాయ మీద ఉండే పొట్టును తొలగించి అనంతరం దాన్ని కడగాలి. ఆ తరువాత తినాలి. ఇలా తింటే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడదు.
ఉల్లిపాయల్లో అనేక పోషకాలు ఉంటాయి. అనేక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఉల్లిపాయల్లో క్వర్సెటిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఫ్లేవనాయిడ్ జాబితాకు చెందుతుంది. ఇది యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ కార్సొనోజెనిక్ గుణాలను కలిగి ఉంటుంది. బీపీని తగ్గించడంలో సహాయం చేస్తుంది. అందువల్ల ఉల్లిపాయలను పచ్చిగా తింటుంటే బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చు. హైబీపీ ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లో ఆల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. అందువల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
షుగర్ ఉన్నవారికి పచ్చి ఉల్లిపాయలు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటే వీటిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేలా చేస్తాయి. దీంతో శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. పచ్చి ఉల్లిపాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ముఖ్యంగా సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గిపోతాయి.
పచ్చి ఉల్లిపాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే ఇవి ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తాయి. అంటే వీటిని తింటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఇక పచ్చి ఉల్లిపాయలను అసలు రోజుకు ఎంత మోతాదులో తినాలి అని కూడా చాలా మందికి సందేహం వస్తుంటుంది. ఇందుకు పోషకాహార నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారంటే.. పచ్చి ఉల్లిపాయ చిన్నది అయితే రోజుకు ఒకటి తినవచ్చు. అదే మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే అందులో సగం వరకు తినాలి. పెద్ద ఉల్లిపాయ అయితే అందులో 2 లేదా 3 ముక్కలు తింటే చాలు. ఇలా పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.