Chicken | నాన్ వెజ్ ప్రియుల్లో చాలా మందికి చికెన్ అంటే ఇష్టం ఉంటుంది. మటన్ కన్నా చికెన్‌ను ఇష్టపడి తినేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. చికెన్‌తో వివిధ రకాల వంటకాలను తయారు చేసి తింటారు. బయటకు వెళితే పలు వెరైటీ డిష్‌లను ఆస్వాదిస్తుంటారు. అయితే కొందరు తరచూ చికెన్‌ను అధికంగా తింటారు. రోజూ ముక్క లేనిదే ముద్ద దిగని వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారు చాలా వరకు చికెన్‌ను తింటుంటారు. అయితే చికెన్‌ను మోతాదుకు మించి తింటే ప్రమాదమని, దాంతో ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్ ను అతిగా తినడం మంచిది కాదని వారు అంటున్నారు.
చికెన్ లో లీన్ ప్రోటీన్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అంటే కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్లు అన్నమాట. ఇవి మన శరీరానికి శక్తిని అందిస్తాయి. కండరాలు దృఢంగా ఉండేలా చేస్తాయి. కండరాలను నిర్మిస్తాయి. చికెన్‌లో కొవ్వులు కూడా ఉంటాయి. అయితే చికెన్‌ను తరచూ తినడం మంచిది కాదు. వారానికి 300 గ్రాములకు మించకుండా చికెన్ తినాలని సూచిస్తున్నారు. ఈ మేరకు పరిశోధకులు అధ్యయనాలు కూడా చేపట్టారు. చికెన్‌ను మోతాదుకు మించి తింటే బరువు పెరుగుతారు. చికెన్‌లో ఉండే శాచురేటెడ్ కొవ్వులు శరీరంలో అధికంగా చేరితే బరువు పెరిగే ప్రమాదం ఉంది. చికెన్‌లో ఉండే ప్రోటీన్ల వల్ల కిడ్నీలపై భారం కూడా పడుతుంది. కనుక చికెన్‌ను మోతాదులోనే తినాలి.
చికెన్‌ను అధికంగా తింటే డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. దీంతో శరీరంలోని ద్రవాలు త్వరగా ఖర్చయిపోతాయి. దీని వల్ల నీరసం, అలసట వస్తాయి. ఎక్కువ సేపు అలాగే ఉంటే సొమ్మసిల్లి పడిపోతారు. కొందరికి చికెన్ తింటే వేడి చేస్తుంది. అది డీహైడ్రేషన్ వల్లనే అని వైద్యులు చెబుతున్నారు. నీటి శాతం తగ్గడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. దీన్నే వేడి చేసిందని అంటారు. కాబట్టి మోతాదులో చికెన్‌ను తింటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చికెన్‌ను అధికంగా తింటే మన శరీరంలో ఉన్న క్యాల్షియం కూడా చాలా వరకు బయటకు పోతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. కనుక చికెన్‌ను తరచూ తినే వారు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
చికెన్‌ను వీలైనంత వరకు స్కిన్ లెస్ తినాలి. ముఖ్యంగా చికెన్ బ్రెస్ట్ భాగంలో కొవ్వు తక్కువగా ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కానీ చాలా మంది కొవ్వు ఎక్కువగా ఉండే లెగ్ పీస్‌లను తినేందుకు ఇష్టపడతారు. కానీ బ్రెస్ట్ పీస్‌లను తినాల్సి ఉంటుంది. చికెన్‌ను 74 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత వద్ద ఉడికించాలి. అప్పుడే అందులో ఉన్న సూక్ష్మ క్రిములు నశిస్తాయి. లేదంటే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. చికెన్‌ను 100 శాతం మెత్తగా ఉడికిన తరువాతే తినాలి. లేదంటే జీర్ణం కాక విరేచనాలు, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. చికెన్‌ను కొనేటప్పుడు ఆర్గానిక్ పద్ధతిలో పెంచిన కోళ్లు అయితే మంచిది. దేశవాళీ నాటు కోళ్లను తినడం వల్ల కొవ్వు తక్కువగా ప్రోటీన్లను ఎక్కువగా పొందవచ్చు. ఇలా చికెన్‌ను తినే విషయంలో పలు విషయాలను ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.