మా అబ్బాయి వయసు నాలుగేండ్లు. ఎప్పుడూ హుషారుగా ఉంటాడు. ఎలాంటి ఇబ్బందులూ లేవు. కానీ, సరిగ్గా నిద్రపోడు. రాత్రి చాలాసార్లు లేస్తుంటాడు. ఉదయం పూట కూడా అస్సలు పడుకోడు. కుదురుగా ఉండడు. పిల్లల ఎదుగుదలపై నిద్రలేమి ప్రభావం చూపుతుంది అంటారు కదా! ఇప్పటికైతే ఎత్తుకు తగ్గ బరువు ఉన్నాడు. అయినా ఆందోళనగా ఉంది. పిల్లలకు ఎన్ని గంటల నిద్ర అవసరమో తెలియజేయండి?
పిల్లలకు నిద్ర చాలా అవసరం. నిద్ర వారి ఎదుగుదలకు దోహదం చేస్తుంది. ఎందుకంటే పిల్లలు నిద్రించినప్పుడు వారిలో గ్రోత్ హార్మోన్ విడుదల అవుతుంది. అది పిల్లల పెరుగుదలకు చాలా అవసరం. సాధారణంగా పిల్లలు 8-10 గంటలు నిద్రపోతే మంచిది. అయితే ఎంతసేపు అన్నదాని కన్నా.. ఎంత క్వాలిటీ నిద్రన్నది ముఖ్యం. ఇక మీ పిల్లవాడి విషయంలో ఎత్తు, బరువు సరిగ్గానే ఉందని తెలిపారు. అయితే, మీ అబ్బాయి తన సామర్థ్యానికి తగ్గట్టుగా ఎదిగాడా లేదా అన్నది గ్రోత్ చార్ట్ ప్లాట్ చేసి చూడాల్సి ఉంటుంది. దీని ద్వారా అబ్బాయి పెరుగుదల వృద్ధిరేటు తెలుస్తుంది. ఇక, మీ అబ్బాయి కుదురుగా ఉండటం లేదని ప్రస్తావించారు.
సాధారణంగా మూడునాలుగేండ్ల పిల్లలు కాస్త అల్లరిగానే ఉంటారు. అయితే, ఈ వయసులో పిల్లల ప్రవర్తనకు సంబంధించి రకరకాల ప్రభావాలు ఉండవచ్చు. ఆటిజం, అటెక్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్డీ) వంటి సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ తరం పిల్లలు టీవీకి, మొబైల్ స్క్రీన్కు ఎక్కువగా అతుక్కుపోతున్నారు. దీనివల్ల చాలామంది చిన్నారులు నిద్రలేమికి గురవుతున్నారు. ఒకసారి పీడియాట్రీషియన్ను సంప్రదించండి. విషయాలన్నీ చెప్పి వైద్యుడు చెప్పే సలహా పాటించండి. డెవలప్మెంటల్ పీడియాట్రీషియన్ను సంప్రదించమని వైద్యులు సూచిస్తే కలవడం మంచిది.