Flax Seeds | ఆరోగ్యంగా ఉండాలంటే మన రోజువారి ఆహారంలో పోషకాలు కలిగిన పదార్థాలు ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే అలాంటి పదార్థాలు తినేందుకు మనకు అనేకం అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో అవిసె గింజలు కూడా ఒకటి. ప్రస్తుతం చాలా మంది గింజలను తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. కానీ ఏ గింజలను తినాలి, ఏ సమయంలో తినాలి, ఎంత తినాలి అనే విషయాలపై సరైన అవగాహన ఉండడం లేదు. అవిసె గింజలను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు కలుగుతాయి. అయితే ఈ గింజలను రోజుకు 2 టేబుల్ స్పూన్ల మోతాదులో లేదా 20 గ్రాముల వరకు తినవచ్చు. ఈ విత్తనాలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో లేదా సాయంత్రం స్నాక్స్ రూపంలోనూ తినవచ్చు. ఇలా ఈ గింజలను తింటే అనేక లాభాలను పొందవచ్చు.
అవిసె గింజలలో ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఆల్ఫా లినోలినిక్ యాసిడ్ కూడా అధికంగానే ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. రక్త నాళాల వాపులను తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఈ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది చాలా నెమ్మదిగా జీర్ణం అవుతుంది. అందువల్ల షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. ఈ గింజల్లో ఉండే ఫైబర్ కారణంగా పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి. దీంతో మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు రోజూ ఈ గింజలను తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.
అవిసె గింజలను తినడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మనం తినే ఆహారాల్లో ఉండే కొవ్వును కూడా శరీరం శోషించుకోదు. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది. ఈ గింజల్లో ఫైబర్ అధికంగా ఉన్న కారణంగా వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. దీంతో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. అవిసె గింజల్లో అధికంగా ఉండే ఫైబర్ కారణంగా ఈ గింజలను తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. పొట్ట నిండిన భావనతో ఉంటారు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అధిక బరువు తగ్గాలనుకుంటున్న వారు రోజూ అవిసె గింజలను తింటుంటే ఎంతగానో ఫలితం లభిస్తుంది.
అవిసె గింజల్లో లిగ్నన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. హార్మోన్ సమస్యలు ఉన్నవారు కూడా ఈ గింజలను రోజూ తింటే ఫలితం ఉంటుంది. అవిసె గింజలను రోజుకు 2 టేబుల్ స్పూన్ల మోతాదులోనే తినాలి. అధికంగా తింటే మలబద్దకం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అజీర్తి కూడా వస్తుంది. ఈ గింజలను నీటిలో నానబెట్టి తింటే చాలా సులభంగా జీర్ణం అవుతాయి. కనీసం 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టాల్సి ఉంటుంది. అవిసె గింజలను తింటే జీర్ణం అయ్యేందుకు నీళ్లను అధికంగా తాగాల్సి ఉంటుంది. రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడేవారు అవిసె గింజలను తినేముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.