Eggs | మనం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు ఆరోగ్యకరమైన ఆహారాలను తినాల్సి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ నేటి ఉరుకుల పరుగుల బిజీ యుగంలో చాలా మంది జంక్ ఫుడ్‌కు అలవాటు పడ్డారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మొదలుకొని రాత్రి తినే డిన్నర్ వరకు జంక్ ఫుడ్‌నే ఎక్కువగా తింటున్నారు. అలాగే వేళ తప్పించి భోజనం చేస్తున్నారు. రాత్రి పూట కూడా ఆలస్యంగా ఆహారం తీసుకుంటున్నారు. ఇదంతా అస్తవ్యస్తమైన జీవనశైలి కిందకు వస్తుంది. దీంతో ఆరోగ్య సమస్యలను చేజేతులా కొని తెచ్చుకుంటున్నారు. అందుకనే ఆరోగ్యవంతమైన ఆహారాలను తినాలని పోషకాహార నిపుణులతోపాటు ఆరోగ్య నిపుణులు కూడా మనకు సూచిస్తుంటారు. ఇక ఆరోగ్యవంతమైన ఆహారాల విషయానికి వస్తే కోడిగుడ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు.
రోజుకు కనీసం ఒక కోడిగుడ్డును ఉడకబెట్టి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కోడిగుడ్లలో ప్రోటీన్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఒక కోడిగుడ్డును తింటే మనకు సుమారుగా 6 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి కండరాలకు శక్తిని, పోషణను అందిస్తాయి. దీంతో మనం చురుగ్గా ఉంటాం. ఉత్సాహంగా పనిచేస్తాం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ రూపంలో కోడిగుడ్డును తింటే రోజంతా యాక్టివ్‌గా ఉండవచ్చు. ఎంత పనిచేసినా అలసిపోకుండా ఉంటారు. అలాగే కోడిగుడ్లలో కోలిన్ అనే పోషక పదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఇది కణాల పనితీరుకు సహకరిస్తుంది. లివర్ పనితీరును మెరుగు పరుస్తుంది. శరీరంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. కోలిన్ వల్ల శరీరంలో అసిటైల్ కోలిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది మన మెదడు పనితీరుకు, జ్ఞాపకశక్తికి, ఏకాగ్రతకు, కండరాల పనితీరుకు ఎంతగానో సహాయ పడుతుంది. కనుక కోడిగుడ్లను తింటే మెదడును యాక్టివ్ గా ఉంచుకోవచ్చు.
కోడిగుడ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా లుటీన్, జియాజాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుడ్లలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి కళ్లను సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారి నుంచి రక్షిస్తాయి. దీంతో కళ్లలో శుక్లాలు రాకుండా చూసుకోవచ్చు. వయస్సు మీద పడడం వల్ల కంటి చూపు తగ్గడం అనే సమస్య వస్తుంది. దీన్ని కూడా రాకుండా నివారించవచ్చు. కోడిగుడ్లలో సెలీనియం అధిక మొత్తంలో ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా కోడిగుడ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
ఇక కోడిగుడ్లను రోజుకు ఎన్ని తినాలి.. అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తుంటారు. ఇందుకు నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారంటే.. ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు 1 నుంచి 2 కోడిగుడ్లను ఉడకబెట్టి తినవచ్చు. గుండె జబ్బులు ఉన్నవారు, కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు గుడ్లను తినాలి. వీరు కోడిగుడ్డు తెల్లసొన మాత్రమే తినాలి. అలాగే శారీరక శ్రమ లేదా వ్యాయామం ఎక్కువగా చేసేవారు రోజుకు 2 నుంచి 4 కోడిగుడ్లను తినవచ్చు. ఇలా కోడిగుడ్లను తింటే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.