Dry Anjeer Fruits | ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారాలను తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను తింటున్నారు. అలాంటి వాటిల్లో అంజీర్ పండ్లు కూడా ఒకటి. అంజీర్ పండ్లు మనకు రెండు రకాలుగా లభిస్తాయి. నేరుగా పండ్ల రూపంలో వీటిని తినవచ్చు. లేదా డ్రై ఫ్రూట్స్‌ను కూడా తినవచ్చు. అంజీర్ పండ్లు మనకు ఏడాది పొడవునా లభించవు. కానీ అంజీర్ డ్రై ఫ్రూట్స్ మాత్రం మనకు అన్ని సమయాల్లోనూ అందుబాటులో ఉంటాయి. అయితే ఆరోగ్యం కోసం అంజీర్ డ్రై ఫ్రూట్స్‌ను తినాలని తెలుసు. కానీ వీటిని అసలు రోజుకు ఎన్ని తినాలి.. ఏ సమయంలో తింటే మంచిది.. అని చాలా మంది సందేహిస్తుంటారు. ఇందుకు పోషకాహార నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
అంజీర్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగుల్లో మలం కదలికలను సులభతరం చేస్తుంది. అందువల్ల ఈ పండ్లను తింటే మలబద్దకం తగ్గుతుంది. అధిక బరువు తగ్గాలనుకునే వారు ఈ పండ్లను తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక వీటిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అంజీర్ డ్రై ఫ్రూట్స్‌లో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. ఐరన్, పొటాషియం వంటి పోషకాలు సైతం అధికంగానే ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటే శరీరానికి శక్తి లభిస్తుంది. శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. ఉత్సాహంగా మారుతారు. చురుగ్గా పనిచేస్తారు. నీరసం, అలసట తగ్గిపోతాయి.
అంజీర్ పండ్లలో క్యాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటే ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. ఆర్థరైటిస్, ఆస్టియో పోరోసిస్ వంటి ఎముకల సంబంధ సమస్యలు ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంజీర్ పండ్లను తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ పండ్లలో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి అంజీర్ పండ్లు మేలు చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. షుగర్ ఉన్నవారు సైతం ఈ పండ్లను తినవచ్చు. ఇవి తియ్యగా ఉన్నప్పటికీ వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ. పైగా వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి కనుక ఈ పండ్లను తింటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది.
అంజీర్ డ్రై ఫ్రూట్స్‌ను రోజుకు 2 లేదా 3 మాత్రమే తినాలి. అధికంగా తింటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. రాత్రి పూట 3 అంజీర్ డ్రై ఫ్రూట్స్‌ను నీటిలో నానబెట్టాలి. వాటిని మరుసటి రోజు ఉదయం పరగడుపునే తినాలి. ఇలా తినడం వల్ల వాటిల్లో ఉండే పోషకాల శాతం పెరుగుతుంది. పైగా ఉదయం తింటే రోజంతటికీ కావల్సిన శక్తి లభించి ఉత్సాహంగా ఉంటారు. అంజీర్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక కొందరికి పొట్టలో అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఈ పండ్లను తినకూడదు. అంజీర్ పండ్లను తినడం వల్ల శరీరానికి ఐరన్ లభిస్తుంది. ఇది రక్తం తయారయ్యేలా చేస్తుంది. ఇలా ఈ పండ్లతో అనేక లాభాలను పొందవచ్చు.