Coffee | రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా మంది టీ, కాఫీ వంటి పానీయాలను సేవిస్తుంటారు. టీ ప్రియులు కొందరు ఉంటే, కాఫీ అంటే ఇష్టపడే వారు కొందరు ఉంటారు. అయితే కాఫీ గురించి కొన్ని విషయాలను వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శాతం మంది తాగుతున్న పానీయాల జాబితాలో కాఫీ మొదటి స్థానంలో ఉంది. కాఫీని సేవించడం వల్ల ఉదయాన్నే శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. బద్దకం పోతుంది. చురుగ్గా, యాక్టివ్‌గా ఉంటారు. కాఫీలో అనేక సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కాఫీలో కెఫీన్ అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది. ఇది నిద్రను ప్రేరేపించే అడినోసిన్ అనే హార్మోన్ విడుదలను అడ్డుకుంటుంది. అందువల్ల కాఫీని సేవిస్తే నిద్ర రాదు. మత్తు వదిలిపోతుంది. కాఫీని సేవించడం వల్ల డోపమైన్, నోరెపైన్ఫ్రైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి అప్రమత్తతను పెంచుతాయి. మూడ్ మారేలా చేస్తాయి.
కాఫీని సేవించడం వల్ల శరీరంలో అడ్రినలిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. శరీరానికి శక్తి లభిస్తుంది. అందుకనే చాలా మంది అథ్లెట్లు వర్కవుట్ చేసేందుకు ముందుగా కాఫీని సేవిస్తుంటారు. దీంతో ఎక్కువ సేపు వ్యాయామం చేసినా శ్రమ అనేది అనిపించకుండా ఉంటుంది. నీరసం, అలసట ఉండవు. అధిక బరువు తగ్గాలనుకుంటున్న వారికి కూడా కాఫీ ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. కాఫీ వల్ల మెటబాలిజం పెరిగి క్యాలరీలు ఖర్చవుతాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. అయితే కాఫీలో చక్కెర కలపకుండా తాగాలి. లేదా బ్లాక్ కాఫీని తాగాలి. దీని వల్ల బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.
కాఫీలో అనేక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. క్లోరోజెనిక్ యాసిడ్, క్వినైడ్స్ ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. దీని వల్ల క్యాన్సర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు రోజూ కాఫీని చక్కెర లేకుండా తాగాలి. దీంతో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. కాఫీలో ఉండే కెఫీన్ అనేక నాడీ సంబంధ సమస్యలను సైతం తగ్గిస్తుందని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి వ్యాధుల నుంచి బయట పడేలా చేస్తుంది. కాఫీని తాగడం వల్ల లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని తేలింది. అలాగే ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్ ఉన్నవారు కాఫీని తాగుతుంటే ఫలితం ఉంటుంది.
కాఫీని రోజూ పరిమిత మోతాదులో సేవిస్తుంటే గుండె పోటు రాకుండా చూసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే కాఫీని రోజుకు ఎన్ని కప్పులు సేవించాలి..? అని చాలా మంది సందేహిస్తుంటారు. ఇందుకు వైద్యులు ఏమని సమాధానం చెబుతున్నారంటే.. ఒక కప్పు కాఫీలో సుమారుగా 100 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది. మన శరీరానికి రోజుకు 400 మిల్లీగ్రాముల వరకు కెఫీన్‌ను తీసుకోవచ్చు. అంతకు మించకూడదు. కనుక రోజుకు 4 కప్పుల వరకు కాఫీని తాగవచ్చు. అయితే కాఫీని 4 కప్పులు తాగితే మాత్రం ఇక టీ తాగకూడదు. ఎందుకంటే అందులోనూ కెఫీన్ ఉంటుంది కనుక శరీరంలో కెఫీన్ మోతాదు పెరుగుతుంది. టీ, కాఫీ ఏది తాగినా సరే రోజువారి కెఫీన్ మోతాదు మించకుండా చూసుకోవాలి. అప్పుడే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.