Chapati | ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న చాలా మంది ప్రస్తుతం రాత్రి పూట అన్నంకు బదులుగా చపాతీలను తింటున్న విషయం విదితమే. ఉత్తరాదికి చెందిన వారు చపాతీలను నూనె లేకుండా కాల్చి తింటుంటారు. అయితే ప్రస్తుతం ఇదే డైట్‌ను చాలా మంది పాటిస్తున్నారు. రాత్రి పూట నూనె వేయకుండా చపాతీలను పుల్కాల మాదిరిగా కాల్చి తింటున్నారు. అయితే ఒక మీడియం సైజ్ చపాతీ ద్వారా మనకు సుమారుగా 100 క్యాలరీలు లభిస్తాయి. అలాగే పిండి పదార్థాలు 20 గ్రాములు, ప్రోటీన్లు 4 గ్రాములు, కొవ్వు 1 గ్రాము, ఫైబర్ 3 గ్రాములు లభిస్తాయి. అన్నంను తీసుకుంటే అందులో పిండి పదార్థాలు తప్ప ఇతర పోషకాలు ఉండవు. కనుకనే రాత్రి పూట అన్నంకు బదులుగా చపాతీలను తినాలని వైద్యులు కూడా సూచిస్తుంటారు. చపాతీలను తింటే బరువు తగ్గడంతోపాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని చెబుతుంటారు.
చపాతీల్లో అనేక రకాల బి కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. విటమిన్లు బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్ ఇ, స్వల్ప మొత్తాల్లో విటమిన్ కె కూడా ఉంటుంది. చపాతీల ద్వారా మనకు ఐరన్ కూడా లభిస్తుంది. దీంతో రక్తం తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది. చపాతీల్లో మెగ్నిషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, క్యాల్షియం వంటి పోషకాలు కూడా ఉంటాయి. అయితే ఈ పోషకాలను పొందాలంటే చపాతీలను నూనె లేకుండా కాల్చి తినాలని, లేదంటే వీటిని కోల్పోతామని చెబుతున్నారు. కనుక చపాతీల ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు లభించాలంటే వాటిని నూనె లేకుండా కాల్చి తినాల్సి ఉంటుంది. ఇక చపాతీల్లో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీంతో పేగుల్లో ఆహారం లేదా మలం కదలిక సరిగ్గా ఉంటుంది. దీని వల్ల మలబద్దకం తగ్గుతుంది.
చపాతీలను తినడం వల్ల శరీరానికి సంక్లిష్టమైన పిండి పదార్థాలు లభిస్తాయి. ఇవి నెమ్మదిగా జీర్ణం అవుతాయి. కనుక శరీరానికి నిరంతరాయంగా శక్తి లభిస్తుంది. ఎక్కువ సేపు పని చేయవచ్చు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగవు. కనుక షుగర్ ఉన్నవారికి చపాతీలు ఎంతో మేలు చేస్తాయి. దీంతో డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. రాత్రి పూట అన్నంకు బదులుగా చపాతీలను తింటుంటే షుగర్ ఉన్నవారికి, బరువు ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. షుగర్‌ను తగ్గించుకోవడంతోపాటు శరీరంలోని కొవ్వును సైతం కరిగించుకోవచ్చు. రాత్రి పూట మన శరీరానికి క్యాలరీలు పెద్దగా అవసరం ఉండవు. కనుక రాత్రి పూట రెండు చపాతీలను తింటే చాలు. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయం చేస్తుంది.
చపాతీల తయారీకి వాడే గోధుమ పిండిలో అనేక బి విటమిన్లు ఉంటాయి. మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఈ పిండి ద్వారా మనకు లభిస్తాయి. ఇవి శరీర మెటబాలిజంను మెరుగు పరుస్తాయి. నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తహీనతను తగ్గిస్తాయి. ఈ పిండిలో ఉండే మెగ్నిషియం కండరాలను ప్రశాంతంగా మారుస్తుంది. దీంతో కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. గోధుమ పిండిలో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. చపాతీలను తినడం వల్ల అనేక మినరల్స్‌ను పొందవచ్చు. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మొటిమలను తగ్గిస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా మారేలా చేస్తాయి. ఇలా చపాతీలను రాత్రి పూట తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు.