Chapati | ప్రస్తుత తరుణంలో చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికే షుగర్ వ్యాధి వచ్చేది. కానీ ఇప్పుడు యుక్త వయస్సులో ఉన్నవారు కూడా టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే డయాబెటిస్ రాగానే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. షుగర్ కంట్రోల్ లో ఉంటే దీర్ఘకాలం పాటు జీవించవచ్చని అంటున్నారు. అయితే డయాబెటిస్ కంట్రోల్ అవ్వాలంటే డాక్టర్లు ఇచ్చే మందులను తప్పనిసరిగా క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. దీంతోపాటు రోజుకు తగినంత నిద్ర పోవాలి. నీళ్లను తాగాలి. అదేవిధంగా డైట్‌ను కూడా పాటించాల్సి ఉంటుంది. డయాబెటిస్ వచ్చిన వారు ఏ ఆహారాన్ని పడితే దాన్ని తినకూడదు.
షుగర్ వ్యాధి ఉన్నవారు తీసుకునే ఆహారం విషయంలో అనేక మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా బరువును తగ్గించుకోవాలి. దీంతో ఆటోమేటిగ్గా షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. అయితే బరువు తగ్గడంతోపాటు ఆ బరువు నియంత్రణలో ఉండేలా చూడాలి. దీంతో షుగర్ లెవల్స్ ఎప్పటికీ పెరగకుండా ఉంటాయి. దీనికి గాను ఎప్పటికీ డైట్‌ను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా బరువును పెంచే ఆహారాలను తినకూడదు. ఇవి షుగర్ లెవల్స్‌ను కూడా పెంచుతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. షుగర్ ఉన్నవారు ఆహారం విషయంలో మాత్రం అనేక జాగ్రత్తలను పాటించాల్సిందే. లేదంటే షుగర్ కంట్రోల్ అవదు.
ఇక డయాబెటిస్ ఉన్నవారు చపాతీలను తినాలని సూచిస్తుంటారు. ఎందుకంటే రైస్‌తో పోలిస్తే చపాతీల గ్లైసీమిక్ ఇండెక్స్ కాస్త తక్కువగా ఉంటుంది. పైగా గోధుమ పిండిలో ఫైబర్ ఉంటుంది కనుక చపాతీలను తింటే అంత త్వరగా షుగర్ లెవల్స్ పెరగవు. అందువల్లనే చాలా మంది రాత్రి పూట భోజనంలో అన్నంకు బదులుగా చపాతీలను తింటుంటారు. బరువు తగ్గాలనుకునే వారు కూడా తమ డైట్లో చపాతీలను చేర్చుకుంటారు. రాత్రి పూట రెండు చపాతీలను నూనె లేకుండా పుల్కా మాదిరిగా కాల్చుకుని తింటే ఎంతో మేలు జరుగుతుంది. అయితే రాత్రి పూట ఎన్ని చపాతీలను తినాలని చాలా మంది సందేహిస్లుంటారు. ఇందుకు నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
చపాతీల్లో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. వీటిల్లో ఫైబర్ ఉంటుంది కనుక వీటిని తింటే జీర్ణక్రియ కూడా మెరుగు పడుతుంది. అయితే రాత్రి పూట 30 నుంచి 50 గ్రాముల మేర పిండి పదార్థాలు లభిస్తే చాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంటే మీడియం సైజ్ ఉన్న చపాతీలు అయితే 2 లేదా 3 చాలు. పెద్దవి అయితే 2 చాలు అని వైద్యులు చెబుతున్నారు. ఇలా చపాతీలను తింటే ఆరోగ్యంగా ఉండవచ్చని, దీంతోపాటు షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయని అంటున్నారు. అయితే కొందరు అన్నం మానేస్తున్నామని చెప్పి చపాతీలను అధికంగా తింటారు. ఇలా చేసినా కూడా అనర్థమేనట. దీని వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయని అంటున్నారు. కనుక రాత్రి పూట పరిమిత మోతాదులో చపాతీలను తింటేనే వీటి ద్వారా ప్రయోజనాలను పొందవచ్చని వారు అంటున్నారు.