Cashew Nuts | జీడిపప్పును చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని అనేక మసాలా వంటల్లోనే కాక తియ్యని వంటకాల్లోనూ వేస్తుంటారు. జీడిపప్పు వల్ల వంటకాలకు చక్కని రుచి వస్తుంది. అయితే జీడిపప్పును తింటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం చాలా మందికి తెలుసు. కానీ ఈ పప్పును తింటే బరువు పెరుగుతామని భయపడుతుంటారు. జీడిపప్పును వాస్తవానికి ఎక్కువగా తినాల్సిన పనిలేదు. దీన్ని రోజూ గుప్పెడు మోతాదులో లేదా 30 గ్రాముల మేర తింటే చాలు, ఎన్నో లాభాలు కలుగుతాయి. గుప్పెడు జీడిపప్పును తింటే సుమారుగా 160 క్యాలరీల శక్తి లభిస్తుంది. 12 నుంచి 13 గ్రాముల మేర ఆరోగ్యకరమైన కొవ్వులు, 5 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. అలాగే 9 గ్రాముల పిండి పదార్థాలు కూడా అందుతాయి. జీడిపప్పులో విటమిన్లు కె, బి6, బి1, బి3, బి9 వంటి అనేక రకాల విటమిన్లు లభిస్తాయి. ఈ పప్పులో విటమిన్ ఇ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.
జీడిపప్పులో అనేక రకాల మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా కాపర్, మెగ్నిషియం, జింక్, ఐరన్, ఫాస్ఫరస్, మాంగనీస్, సెలీనియం అధికంగా ఉంటాయి. జీడిపప్పులో మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తాయి. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ ముప్పు నుంచి సురక్షితంగా ఉండవచ్చు. జీడిపప్పులో మెగ్నిషియం, ఫాస్ఫరస్, కాపర్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచుతాయి. ఆస్టియోపోరోసిస్ రాకుండా రక్షిస్తాయి. ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
జీడిపప్పులో జింక్ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థకు చెందిన కణాలు నిర్మాణం అయ్యేలా చేస్తుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. జీడిపప్పులో ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ పప్పు క్యాలరీలను అధికంగా ఇస్తుంది కానీ ఇది తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ విలువను కలిగి ఉంటుంది. అందువల్ల జీడిపప్పును తింటే షుగర్ లెవల్స్ పెరగవు. పైగా ఇందులో ఉండే మెగ్నిషియం వల్ల శరీరం ఇన్సులిన్‌ను మరింత మెరుగ్గా వాడుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారికి కూడా జీడిపప్పు మేలు చేస్తుంది. ఇందులో ఉండే ప్రోటీన్ల కారణంగా వీటిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
జీడిపప్పులో కాపర్, ఐరన్, జింక్ అధికంగా ఉండడం వల్ల ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. యాక్టివ్‌గా ఉంటారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. చిన్నారులకు రోజూ ఈ పప్పును తినిపిస్తే వారి మెదడు వికసిస్తుంది. ప్రతిభావంతులుగా మారుతారు. చదువుల్లో రాణిస్తారు. జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా ఫినోలిక్ లిపిడ్స్, టోకోఫెరాల్స్, ఫైటో స్టెరాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో ఫ్రీ ర్యాడికల్స్ వల్ల కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గిపోతాయి. గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండవచ్చు. ఇలా జీడిపప్పును రోజూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.